Tuesday, March 23, 2021

అసలు బాధ ఏది?

 రచన:  సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ 


మన మాటల్ని చేతల్ని వట్టి బూటకం అని కొట్టి పారేసినప్పుడు బాధ. మన హక్కుని మనకు దక్కకుండా చేసినప్పుడు బాధ. మనం కూడబెట్టిందంతా ఒక్కసారిగా కుప్ప కూలినప్పుడు బాధ. వయసు పైబడినా కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయినప్పుడు బాధ. మనవారు, మనలో సగం అనుకున్నవారే ద్రోహం చేసినప్పుడు బాధ. ఆప్తులు అసువులు బాసినప్పుడు బాధ. వెన్నుపోటు పొడిచింది వెన్నుదన్నుగా నిలవాల్సినవారే అని తెలిసినప్పుడు బాధ. మనం ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నవారు మన మనో

భావాలతో ఆడుకుంటున్నారని తెలిసినప్పుడు బాధ. ఆశలు చిగురించక ముందే ఆశాభంగం కలిగినప్పుడు బాధ. సదుద్దేశ్యంతో సేవ చేయాలనుకున్నప్పుడు నిందలు పడాల్సి వస్తే బాధ. మనం గౌరవించే వ్యక్తి దగ్గర మనకు మర్యాద దక్కనప్పుడు బాధ. కటుంబ గౌరవం బజారు పాలైనప్పుడు బాధ. చేయని నేరాని కి శిక్ష అనుభవించినప్పుడు బాధ. కష్ట కాలంలో ఆప్తులు కూడా ఆదుకోనప్పుడు బాధ.



ఇవి, ఇలాంటి అనేక బాధల్ని మనిషి తన రోజువారి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాడు. 'అనుభవిస్తేనేగానీ ఆ బాధ ఏమిటో తెలియదు' అన్న మాట మనం తరచూ వింటుంటాము. అనుభవిస్తాము గనక అది బాధగా తోస్తుంది. ఐహిక పరమైన ఈ బాధలన్నీ పరీక్ష నిమిత్తం మాత్రమేనని ఆపద్బాంధవుడు అయిన అల్లాహ్ సెలవిస్తున్నాడు: “యావత్తు విశ్వ సార్వ భౌమత్వం కలిగి ఉన్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షిండానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు. గొప్ప క్షమాశీలి”.(అల్ ముల్క్: 1,2) 

“భయం, ఆకలి, ధనప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము”. (బఖర: 155)

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ కొందరిని ఇచ్చి పరీక్షిస్తాడు. మరికొందరిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు”. ఈ బాధలు, కష్టాలన్నీ తాత్కాలిక తటాకమైన ఐహిక జీవితానికి సంబంధించినవే. కాని మన అనుభవంలోకి రాని బాధలు, సిసలైన పీడనలు ముందున్నాయి. అవి, మనిషి మరణానంతరం మొదలవుతాయి. అవేమంటారా? 

అది- 'దైవదూతలు వచ్చి, వారి ముఖాలపై పిరుదలపై కొడుతూ 'ఇక దహనయాతన చవి చూడండి. ఇది మీరు చేజేతులా కొనితెచ్చుకున్న దాని పర్యవసానమే'. (అల్: 50) అని అన్నప్పుడు కలిగే బాధ. తను చలనం లేకుండా పడి ఉంటే - ఆప్తులు పెట్టే నాదాలు వింటూ కూడా కనీసం వారిని ఓదార్చలేని దుర్భర స్థితి ఏర్పడినప్పుడు కలిగే బాధ. సమాధిలో చల్లనైన ఎసీలకు, మెత్తనైన పరుపులకు, వెచ్చనైన హీటర్లకు, పసందైన పరిసరాలకి బదులు ఇరుకిరుకు స్థలంలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, చేసుకున్న పాప పుణ్యాలు తప్ప మరే సామగ్రి లేనప్పుడు, అరచి నోరు బాదుకు న్నా వినే, పట్టించుకునే నాధుడే లేనప్పుడు కలిగే బాధ.

మున్కర్ నకీర్లు వచ్చి మన్ రబ్బుక? - నీ ఆరాధ్య దేవుడు ఎవడు?, మన్ నబియ్యుక? - నీ ప్రవక్త ఎవరు?, మా దీనుక? -నీధర్మం ఏది? అని నిలదీసినప్పుడు, భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా అతి ఇరుకైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చినప్పుడు, ధరిత్రి చేసే ఒత్తిడికి కుడి ప్రక్కటి ఎముకలు ఎడమ ప్రక్కటి ఎముకల్లో చొచ్చుకుపోయినప్పుడు, 70 గజాల లోతుకి పాతుకుపోయేలా చేసే కొరడా దెబ్బ పడినప్పుడు కలిగే విపరీతమైన బాధ.


“అలాంటి వారిని (దైవాన్ని మరచిన వారిని) మేము ప్రళయ దినాన బోర్ల పడేసి ఈడ్చుకొస్తాము. వారిని, అంధులుగా, బధిరులుగా, మూగలుగా చేసి వేస్తాము”. (బనీ ఇస్రాయీల్: 97) అని దేవుడు హెచ్చరించినప్పుడు కలుగుతుంది భరించరాని బాధ. కాకపోతే ఐహిక బాధలు పరీక్ష నిమిత్తం అయితే, మరణానంతరం బాధలు మనిషి చేసిన కర్మల ఫలం అయి ఉంటాయి. ఇది మరువ కూడదు. మరచి బ్రతకకూడదు. బ్రతికతే శిక్ష అనుభవించక తప్పదు. 

“ఒక భయంకర దినాన తాము లేపి (దైవ సమక్షంలో) ప్రవేశించబడతామని వారికి తెలియదా? ఆ రోజు యావత్తు మానవులు విశ్వ ప్రభువు ముందు (తల వంచి) నిలబడతారు”.(దివ్య ఖుర్ఆన్ - 83; 4-6)  

(వారు తమ దుష్కార్యాలకు జవాబు చెప్పుకోవాల్సిన పని లేదని భావిస్తున్నారా?) “ఎంత మాత్రం కాదు. దురాత్మల కర్మల వివరాలు కారాగారం (సిజ్జీన్) చిట్టాలో ఉంటాయి”. (ముతఫ్ఫిఫీన్: 7)

దీనికన్నా ఇంకా తీవ్రమైన బాధ మరొకటుంది. హషర్  మైదానంలో తలమీదికి సూర్యుడు తీసుకురాబడినప్పుడు, భూమి మరో భూమిగా మార్చివేయబడినప్పుడు, చేసుకు న్న వారికి చేసుకున్నంత అన్నట్టు - మోకాళ్ళ దాక కొందరు, నడుము దాక కొందరు, పూర్తిగా కొందరు చెమటలో మునిగి ఉన్నప్పుడు కలిగే బాధ.

నీడ ఎక్కడ కానరాని మాడ్చివేసే ఎండలో ఏ అండ మనకూ ఉండని తుది తీర్పు దినాన అల్లాహ్ అర్ష్  నీడకు సయితం నోచుకోని నికృష్ట స్థితి దాపురించినప్పుడు, హౌజె కౌసర్ (కౌసర్ సరోవరం) పై నుండి ధిక్కరించ బడినప్పుడు, మనం చేసిన పాపాలకు అల్లాహ్  ఆగ్రహించి “మీ కర్మలకు పర్యవసానం చవి చూసుకోండి” అన్నప్పుడు, “ఈ దినం రాకను మీరు బుద్ధి పూర్వ కంగానే విస్మరించారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాము” (జా:13) అని అన్నప్పుడు కలిగే బాధ మహా దారుణమైనది.

ఆలూబిడ్డలు, అన్నాదమ్ముళ్లు కూడా మా లెక్క పూర్తి కాలేదు సారీ అన్నప్పుడు, మన కర్మల చిట్టా ఎడమ చేతిలో ఇచ్చి - 'ఇదిగో చదువుకో నీ కర్మల చిట్టా. ఈరోజు నీ కర్మల లెక్క చూడటానికి నీవే చాలు” (దివ్యఖుర్ఆన్-17:14) అని అన్నప్పుడు, విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) వారి సిఫారసు కూడా మన విషయంలో స్వీకరించ బడనప్పుడు, 70 తల్లుల కన్నా అధిక ప్రేమ గల అల్లాహ్  కూడా మన వైపు కన్నెత్తి చూడనప్పుడు, మనతో ఒక్క మాటైనా ప్రేమతో మాట్లాడనప్పుడు కలిగే తీవ్రమైన బాధ వర్ణ నాతీతం.

మన నుదుటి మీద నరకవాసి అని వ్రాయబడినప్పుడు, అవిశ్వాసుల్ని గుంపులు గుంపులుగా నరకం వైపు తోలుకెళ్ళినప్పుడు, నరక ద్వారాలు తెరవబడినప్పుడు, 'నరకంలో పోయి పడండి. ఇక మీరిక్కడే ఎల్లకాలం పడి ఉంటారు'. (జుమర్: 72) అని అన్నప్పుడు, అయ్యయ్యో! నా కర్మల పత్రం నాకసలు లభించకుండా, నా లెక్కేమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది!! ఈ రోజు నా సిరి సంపదలు నాకేమాత్రం పనికి రాలేదే!? అయ్యో! నా అధికారం, అధిపత్యాలన్నీ మట్టిలో కలిసి పోయాయి” (హ్మాహ్: 26-29) అంటూ తీవ్ర పశ్చాత్తాపంతో నెత్తి నోరు బాదుకున్నప్పుడు, 'పట్టుకోండి వాణ్ణి. వాడి మెడకు గుదిబండ కట్టి నరకంలో త్రోసేయండి. ఆ తర్వాత 70 మూరల గొలుసుతో వాడ్ని బిగించి కట్టండి.....చీము, నెత్తురు తప్ప వాడికి తినడానికి మరేమీ లభించదు' (దివ్యఖుర్ఆన్-69: 30-38) అని ఆజ్ఞ జారి చేయబడినప్పుడు, 'పట్టుకోండి వాడ్ని, బరబర ఈడుస్తూ తీసుకెళ్ళి నరకం మధ్యలో విసరి పడేయండి. సలసల కాగే నీటిని వాడి నెత్తి మీద కుమ్మరించండి...ఇక చూడు దీని రుచి, నువ్వు మహా గౌరవనీయుడవయిన పెద్ద మనిషివి కదూ....” (దుఖాన్: 48, 49) అని అవహేళనగా అన్నప్పుడు కలిగే పీడన. జఖూమ్ అనే చెట్టు తప్పకుండా తిన వలసి వచ్చినప్పుడు, చమురు తెట్టు లాంటి ఆ పదార్థం కడుపు లోకి పోయి మరగ కాచిన నీటిలా కుతకుత ఉడికిపోతున్నప్పుడు కలిగే బాధ మహా భయంకరమైనది. 

చచ్చిపోదామన్నా చావు రానప్పుడు, చావుకే చావు ఇవ్వబడిన ప్పుడు, చర్మాలు కాలిపోతే మళ్ళి మళ్ళి కొత్త చర్మాల్ని సృజించ బడినప్పుడు, నరకంలో గల చివరి విశ్వాసి కూడా స్వర్గానికి చేరుకున్నప్పుడు, మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండండి అని అల్లాహ్  తీర్పు ఇచ్చేసినప్పుడి కలిగే పరమ పీడన వర్ణనాతీతం.

పై పేర్కొన్న ఈ బాధలు నేడు మన అనుభవంలో లేనివి, రానివి. అయితే హెచ్చరిస్తున్నది ఎవరో కాదు; తన దాసుల

శ్రేయం కోరే కరుణ సాగరుడైన అల్లాహ్. ఆయన తెలియ పరచిన వాస్తవాలు నిజాలుగా మన ముందు ప్రత్యక్షమవ్వక ముందే 'పారా హుషార్' అంటున్నాడు. “మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి తప్పించుకోండి. (మీ ప్రభువుకు భయపడండి.) తండ్రి తన కొడుకుకు, కొడుకు తన తండ్రికి ఎలాంటి సహాయం చేయలేని దినం గురించి భయపడండి. అల్లాహ్  వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించ కూడదు సుమా!”. (లుఖ్మాన్: 33) 

ఇక ఐహిక సంపద, సుఖసౌఖ్యాలంటారా-,

"మానవులంతా ఒకే ఒరవడిలో కొట్టుకుపోతారన్న భయమే గనక లేకపోతే మేము కరుణామయుడైన అల్లాహ్ను  తిరస్కరించే వారి ఇండ్ల కప్పులను, వారు మేడపైకి ఎక్కే మెట్లను, వారి తలుపులను, వారు దిండ్లకానుకొని కూర్చునే పీఠాలను, అన్నింటినీ వెండి బంగారాలతో చేసి వేసే వారము. అయినా అది (మూన్నా ళ్ళ ముచ్చటైన) ప్రాపంచిక జీవిత సంపద మాత్రమే. (పరలోక సంపద ఇంతకంటే ఎంతో శ్రేష్ఠమైనది. శాశ్వతమైనది). నీ ప్రభువు దగ్గర భయభక్తులు కలవారికే పరలోక సంపద ప్రాప్త మవుతుంది”. (జుఖుఫ్: 35) -

కనుక విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని, మీ భార్యా పిల్లల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఆ నరకాగ్నికి మాన వులు, రాళ్ళు సమిధలవుతారు”. (తహ్రీమ్: 6)

 రేపటి భయంకర పీడనలు, పరాభవం నుంచి మనల్ని, మన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “ప్రతీ ప్రాణి మృత్యు రుచి చూడ వలసిందే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు”. (అలి ఇమ్రాన్: 185) 

 ప్రాపంచిక బాధలు, కష్టాలు, నష్టాలు - ఒక్క మరణంతో అంతమైపోతాయి. కానీ, పరలోక బాధలు మరణానంతరం మొదలవుతాయి. కాబట్టి మంకు ప్రాప్తమైన ప్రాపంచిక జీవితాన్ని పరలోకపు పంట పొలంగా భావించి మేలిమి  విత్తనాల్ని నాటుకుంటే మంచిది. అలా కాకుండా నాసి రకపు  విత్తనాల్ని, ముళ్ల  విత్తనాల్ని జల్లుకుంటే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల  ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

 ఆరోజు సంతానం, సిరిసంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో అల్లాహ్  సన్నిధికి వచ్చినవారికే ఆరోజు ప్రయోజనం ఉంటుంది.” దైవభీతి పరులకు స్వర్గం అతిచేరువగా తీసుకురాబడుతుంది. (ఆరోజు) దారితప్పినవారి ముందు నరకం ఉంచబడుతుంది. (అష్-షుఅరా: 88-91) 


Sunday, March 7, 2021

తమస్సు తొలిగింది

 

(ఇది మనసు మనుషుల సంభాషణ. మనస్సనేది రెండు రకాలు: 1)తమస్సు-నఫ్సే అమ్మారా 2) ఉషస్సు-నఫ్సే లవ్వామా. మనసు ఒకటే అయినా రూపాలు రెండు. ఒకటి చీకట్లను నింపితే మరొకటి వెలుగుల్ని వ్యాపింపజేస్తుంది. తమస్సు అధీనంలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో, ఉషస్సు వెలుగులో ఎలా జీవిస్తాడో తెలియజేసేందుకు వ్రాసినదే వ్యాసం.

 


మనిషి: ఎక్కడిదీ వికటాట్టహాసం? కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటిలో ఎవరిదీ అట్టహాసం? ఎవరో ఇటే వస్తున్నారు. ఏయ్! ఎవరు నువ్వు?

 

తమస్సు: నేనా? నేనెవరో నీకు తెలియదా? నరుడా! పామరుడా! (వెకిలి నవ్వు....)

 

మనిషి: ఏమిటా నవ్వు? నీ వెకిలి నవ్వులలో హడలిపోయి వచ్చిన దారి తిరిగి పోయే పిరికిని కాను. నా సత్యాన్వేషణ సాగక తప్పదు. నా లక్ష్యాన్ని నేను సాధించక తప్పదు. నాకడ్డం నిలవకు. నన్ను వెళ్ళనీ. ఉషస్సు కాంతుల్లో ఊయలలూగని. ఊఁ..

 తమస్సు: ఎక్కడికి నీవు వెళ్ళేది?

 మనిషి: అదంతా నీకనవసరం.

 తమస్సు: నాకూ? అనవసరమా? (వెకిలినవ్వు) మూర్ఖుడా! నాకన వసరమ యింది జగాన ఉందా? ప్రతి మనిషిలో రక్తం కన్నా వేగంగా ప్రవహించే నాకే ఎదురు చెబుతావా? హాబిల్ ఎలా పరాజయం పాలయ్యాడో, నూహ్ కుమారుడు జల ప్రళయానికి ఎలా ఆహుతి అయ్యాడో, నమూద్ ఎలా ప్రాణాలు వదిలాడో, ఫిర్ఔన్ కు ఎలాంటి దుర్గతి పట్టిందో, ఖారూన్ విధంగా భూమిలో కూరుకుపోయాడో, అబూ లహబ్, అబూ జహల్ ఎలా తుడిచి పెట్టుకుపోయారో, నేడు ఎవరు నియంతలై వ్యవహరిస్తున్నారో, సారాయిలో ఉన్న కిక్కేమిటో, జూదంలో ఉన్న ట్రిక్కేమిటో, పాపభూయిష్ట లుక్కేమిటో, షిర్క్ చిక్కేమిటో చెప్పమంటావా? రహస్య చిట్టామొత్తం విప్పమంటావా?

 మనిషి: చాలు చాలు, డాంబికాలకేం తక్కువ లేదు. అంతా తెలిసినట్టు మిడిసి పడుతున్నావే. ఇంతటి దానవై నా దారికెందుకు అడ్డంగా వస్తున్నావు? నన్నెందుకు సత్యాన్వేషణ మార్గం నుండి తప్పించ జూస్తున్నావు?

 తమస్సు: నీ లక్ష్యం కాంతి అదో వట్టి భ్రాంతి. చీకటే శాశ్వితం, కాంతి తాత్కాలికం. నా మాట విను. ఇదే జీవితం ఇది తప్ప వేరే జీవితం లేదు. ఉంటుందని నువ్వనుకోవడం శుద్ద వేస్టు. నీలి కన్నుల చినదానల్ని చూసి నీ కళ్ళు మిలమిల మెరుస్తుండగా, నీ మనస్సు ఊహాజగత్తులో నింగికి నీలాల నిచ్చెనలు వేస్తుండగా, నీ దేహం కోరికల గుర్రాలను కళ్ళెం లేకుండా తోలుతుండగా చూడాలని, చూసి ఆనందించాలని ఉంది. నా కోరికను తీర్చవూ ప్లీజ్!

 మనిషి: ఓయీ! మాటల మాయతో మభ్యపెట్టే మాయావి. ఎవరు నీవు? నువ్వు నాతో మాట్లాడటం ఏమిటీ. నన్నిరికించి, ఉడి కించి నా లక్ష్యం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం ఏమిటీ?

తమస్సు: బలే...బలే... నేనెవరో నీకు తెలీదా..? నేను నీ మనస్సుని

మనిషి: నువ్వు తమస్సులా అన్పిస్తున్నావు.

 తమస్సు: (కొంటెగా కళ్ళెగరేస్తూ) ఏం ఎలా ఉంది నా పేరు? భలే గుర్తుపట్టావే...

 మనిషి: నా ప్రాణాలు తోడేట్టుంది. నన్ను నరక కూపంలో నెట్టేట్టుంది.

 తమస్సు: పోనీ నేనెలా ఉన్నాను?

 మనిషి: నన్ను నమిలి మింగేట్టున్నావు. నీకు పుణ్యముంటుంది నాదారి నన్ను పోనీ.

తమస్సు: వెర్రివాడా! నిన్ను నువ్వు వివేకి ననుకుంటున్నావు. నల్లదాననయిన నన్ను చూసి బెదిరి పోతున్నావు. భయపడుతున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంతలో( తతంగమంతా చూస్తున్న ఉషస్సు రంగ ప్రవేశం చేస్తుంది)

 మనిషి: ఎంత విచిత్రం? కళ్ళకు మిరిమిట్లు గొలిపే కమనీయ మూర్తి. ఎంత శాంతం నీ వదనం! తేనె వెన్నెలలు కలిపి పోత బోసిన అపూర్వమూర్తి.

 ఉషస్సు: అయ్యో మానవుడా! అప్పుడే కవిత్వంలో పడ్డావా? నీ లక్ష్యం మరచిపోయావా?

మనిషి: కవిత్వం అబద్దమా?

ఉషస్సు: ఔను చాలా వరకు. పోయట్రి ఇజ్ హాఫ్ లై' అన్నారు. అలాగే 'అషుఅరావు యత్తబివుహుముల్ గావూన్' కవులు, దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు. అంటుంది ఖుర్ఆన్. 'నవ్వులా అవి; కావు నవపారిజాతాలు' అంటే నిజమని సామాన్యుడు నమ్ముతాడా?

మనిషి: సత్యం-ఆలోచనామృత కలశం కవిత్వం. అది చరిత్ర చెబుతుంది. అందంగా. నీ సుందర సుమనోహర కాంతి వదనాన్ని చూసి, ఒక్క క్షణం అలా విభ్రాంతుణ్ణయ్యాను. తమస్సుతోనే జీవితం గడిపిన నాకు నీ వెలుగు వదన దర్శనం మహాభాగ్యం.

 

ఉషస్సు: సరే...సరే...వెలుతురంటున్నావే వెలుగు నీ మనసులో లేదూ?

 

మనిషి: నా హృదయం ఏనాడో బొగ్గయిపోయింది. దాన్ని మాణిక్యంగా మార్చే సత్యశక్తి కోసం గాలిస్తున్నాను. నాటికి నీవు కనిపించావు. నాకు సహాయ పడవా ప్లీజ్!

ఉషస్సు: ఇదిగో వెలుతురు....చూడు...చూడు. తారల కన్నుల్లో, మెరుపుల మెయి విరుపుల్లో వెలుతురు. కొండల్లో పూవనాల్లో వెలుతురు సెలయేటి గలగల్లో వెల్తురు. సిరిమల్లెల నవ్వుల్లో వెలుతురు.

 

మనిషి: నేను కోరింది. కాంతి కాదు. హృదయ కాంతి. కొద్ది

సేపటికి కనుమనుగయ్యే తారల్లో, తళుక్కుమని మెరిసి మాయమయ్యే మెరుపుల్లో, మరుక్షణంలో వాడిపోయే పూలల్లోనా వెలుతురు. మట్టి దీపమైనా, మణి దీపమైనా మనస్సులోని తమస్సులు తొలగవు.

 

ఉషస్సు: అవును తృప్తి కోసం, అలంకార నిమిత్తం మాత్రమే తప్ప దీపాలు హృదయాంధకారాన్ని తుడిచివేయలేవు. పైగా మనిషి వెలిగించే దీపాల కాంతి మనిషి చుట్టే ఉంటుంది. అది కూడా అసలయిన కాంతి కాదు. అసలు కాంతి మనసులో ఉండాలి.

నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. (ఉషస్సు కంఠం మంద్ర గంభీ రంగా వినిపిస్తున్నది). మానవులూ, పశుపక్షాదులూ పుట్టక ముందు, చెట్టూ చేమలూ మొలవక ముందు, అల్లాహ్   సృష్టిలో ని ప్రతి వస్తువునూ నీటితో పుట్టించాడు.

 

మనిషి: జంతువు దశలో నుంచే మనిషి వచ్చాడంటారు కదా?

 

ఉషస్సు: వట్టి ఊహాజనిత ఆలోచన మాత్రమే తప్ప ఇందులో ఇసుమంతటి నిజం లేదు. సృష్టిలో సమస్తం అల్లాహ్  6 రోజుల్లో సృష్టించాడు.

 

 మనిషి: సృష్టికి సంబంధించిన సమాచారం చాలానే ఉన్నట్టనిపి స్తోంది.

 

ఉషస్సు: వెలుతురు అసలయిన వెలుతురు కాదన్నావు, నిజమే. అఖండజ్యోతిని కనుక్కోవాలంటే సృష్టి నిర్మాణం గురించి యోచించడం ఒక్కటే మార్గం. ప్రపంచం ఒక మిథ్య అనంటారు చాలా మంది. దీనికి భిన్నంగా విద్యావంతులు, వివేచనా పరులు ' లోకం పరలోక పంట పొలం' అంటారు. లోకం, లోకంలోని సమస్తం ఏదో ఒకనాడు నశించక తప్పదు. దీనికతీతంగా శాశ్వతమయిన మరో లోకం ఉంది. అదే పరలోకం అదే స్వర్గం. అదే పరమాత్మ దర్శనంతో పునీతమయ్యే జగం. అదే అసలయిన వెలుతురు. మనకు కనపడే బయటి వెలుతురు కొంత కాలానికి ఆరిపోతుంది. కానీ అఖండ జ్యోతి అక్షరంగా, అద్వితీయంగా నిలుస్తుంది. అసలైన వెలుతురంటే మనిషి అఖండ జ్యోతీశ్వరుణ్ణి చేరుకోవడమే.

 

మనిషి: తెలిసింది. వెలుతురెక్కడుందో నాకర్థమయ్యింది. ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం కనులు విప్పింది. నా చిరకాల అన్వేషణకు లక్ష్యం దొరికింది. ఓహో! ఎంత తీయని అనుభూతి! నా హృదయ వాటికలో వెలుతురు మొగ్గలు కిలకిలా నవ్వుతున్నాయి. నా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు-సర్వేంద్రియాలు పరిమళిస్తు న్నాయి, పరవశిస్తున్నాయి. ఆత్మకు మాత్రమే దృశ్యమ్మగు అక్షర వాహిని అది. (తన్మయత్వంలో) ఓహోహో! ఎంత దివ్యంగా ఉందీ సన్నివేశం!! నిత్యం ఇలాంటి మనో స్థితే ఉంటే ఎంత బాగుండు!! ఇన్నాళ్ళూ నేను మాయ జగత్తులోనే జీవించాను. ఇప్పుడు నా మనసుకు చుట్టుకున్న మాయావలయం పటాపంచలయింది. సత్యా కాంతుల తళతళలు, నాలో ఏదేదో దురాలోచనలను రేకెత్తించిన తమస్సులను కడిగి వేస్తున్నాయి. ఇందుకేనేమో 'మనిషి సత్కర్మల్ని బట్టి వారికి జ్యోతులివ్వబడతాయి' అని మహాప్రవక్త () వారు అన్నది అంటూ సర్వలోక సృష్టికర్తను మొరపెట్టుకోనారంభిస్తాడు మనిషి:

 

దేవా! నా హృదయం జ్యోతిర్మయం అవ్వాలి. నా నయనం కాంతులీనాలి. నా శ్రవణం వెలుగులు నిండాలి. నా చుట్టూ ప్రక్కల వెలుగు దివ్వెలు వెలగాలి. నా వదనం ప్రకాశమానం అవ్వాలి. నా నరాల్లో నవ నాడుల్లో, నా కండరాల్లో, రక్తంలో, రోమంలో, చర్మంలో ఆంతర్యంలో - అంతటా కాంతి కమలాలు విరియాలి. నా జీవితం వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేయాలి. నా నలువైపుల కాంతి కిరణాలు విరజిమ్మాలి. నా మేధ కాంతితోనూ, నా మది శాంతితోనూ ఉప్పొంగాలి. నేను నిన్ను చేరాలి. నీ దివ్వ దర్శనంతో నా జన్మ ధన్యమవ్వాలి. ఆమీన్!