Tuesday, December 27, 2022

అనాథల సంరక్షణ మరియు ఇస్లాం

ఒక మహా యుద్ధం, ఒక మహా ప్రకృతి విలయం, భూకంప బీభత్సం మానవాళిని భయానకంగా గాయపరిచి వెళ్తాయి. కొవిడ్‌ 19 ‌కూడా అంతటి లోతైన గాయమే చేసింది. కొవిడ్‌తో జరుగుతున్న ఈ భీకర సమరంలో చుక్క రక్తం కూడా చిందలేదు. కానీ కొన్ని లక్షల మంది వారాల వ్యవధిలో ఆ యుద్ధంలోనే నేలకొరిగిపోయారు. పెనుగాలి సవ్వడి లేదు, వాన లేదు. పిడుగులు లేవు. ఇళ్లు కూల లేదు. కానీ వందల తుఫానుల శక్తితో కొవిడ్‌ ‌మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఇప్పుడు భారతీయ సమాజం ముందు నిలిచిన అతి పెద్ద ప్రశ్న- కొవిడ్‌ ‌మిగిల్చిన అనాథ బాలబాలికల రక్షణ. శతాబ్దాల పాటు భారతీయులను కబళించిన అంటు వ్యాధులూ, యుద్ధాలూ, దుర్భిక్షాలూ అవి మిగిల్చిన అమానవీయ అనుభవాను మనం చదువుకున్నాం. వాటికి ఏమీ తీసిపోని భయానక దృశ్యాలను కరోనా కారణంగా ఈ తరం వారమంతా చూస్తున్నాం. మిగిలిన విషాదాల మాట ఎలా ఉన్నా ఆ దృశ్యా లన్నింటిలోను మనసులను విచలితం చేస్తూ ఆ బాలబాలికల దయనీయ స్థితి కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా కరోనా చేసిన కన్నీటి బొమ్మలు. వేయీ రెండు వేలూ కాదు, దాదాపు 30,000. 30,000 మందిలో బాలురు 15,620. బాలికలు 14,447.

 


2019 అక్టోబర్‌లో ప్రభుత్వ చైల్డ్‌లైన్‌ ‌పోర్టల్‌ అం‌దించిన వివరాల ప్రకారం దేశంలో 25 మిలియన్లు (2007 గణాంకాల ప్రకారం, యునెసెఫ్‌ ‌సేకరించినది), అంటే రెండుకోట్ల యాభయ్‌ ‌లక్షల మంది అనాథ బాలలున్నారు. ఇప్పుడు కొవిడ్‌ ఆ ‌సమస్యను ఇంకాస్త తీవ్రం చేసింది. మరొక అధ్యయనం ప్రకారం నాలుగున్నర కోట్ల దిక్కులేని పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలను తాత్కాలికంగా ఆదుకునే వారు కనిపిస్తున్నారు కానీ, శాశ్వత ప్రాతిపదికన దత్తత చేసుకోవడానికి ముందుకు వస్తున్నవారు చాలా తక్కువ. దేశంలో ఒక అనాథను ఎవరూ సాకడానికి ముందుకు రాకపోతే వారి బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలని చట్టం చెబుతోంది. సంబంధిత ఉద్యోగులే అలాంటి వారిని గుర్తించి ఏదైనా సంస్థలో ఆశ్రయం కల్పించాలి.  ఇది ఓ వైపే అయితే, ఈ బడుగు బలహీన వర్గం గురించి ఇస్లాం ఏం చెబుతుంది అన్నది ముక్తసరిగా తెలుసుకుందాం!

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు: "నీవు అనాధల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు." (అల్ జుహా : 9,10)

ఇంకా ఇలా అంటున్నాడు : "పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? అతడే అనాథలను కసరి కొట్టేవాడు, పేదవాళ్ళకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు." (అల్ మావూన్ : 1-3)

అల్లాహ్  దృష్టిలో ప్రజలంతా ఆయన దాసులే. వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి ఎక్కువ  విలువ ఉంటుంది. అలాంటి వారు అభాగ్యులు, నిరుపేదలైనందు వల్ల లోకులు వారిని నీచులుగా, అల్పులుగా భావించినా దేవుని సన్నిధిలో మాత్రం వారు గౌరవనీయులుగానే పరిగణించ బడతారు. వీరికి భిన్నంగా అహంకారులు   ప్రాపంచికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారి సిరిసంపదలకు, వారి భోగభాగ్యాలకు, ఇహలోకపు పెద్దరికానికి దేవుని దృష్టిలో పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు.

 

ప్రజలందరూ పరస్పరం ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని ప్రబోధిస్తోంది ఇస్లాం. తోటిప్రజల  గురించి - వారు ధనికులైనా, నిరుపేదలైనా, ఏ వర్ణం, ఏ వర్గానికి, ఏ మతానికి, మారె సమాజానికి చెందిన వారైనా - అన్నీ ఉన్న వారైనా, అనాథలైన  ఎల్లప్పుడూ సదభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా ప్రయత్నంగానో అప్రయత్నంగానో అన్నమాటల వల్ల తోటి ప్రజలకు  బాధకలిగితే వెంటనే పశ్చాత్తాపంతో వారికి క్షమాపణలు చెప్పుకోవాలి. ధనికులనీ, పేదవారనీ, కులీనులనీ, కులహీనులనీ ఎలాంటి తారతమ్యాలు లేవు. ఇస్లాం దృష్టిలో అందరూ సమానులేనన్న విషయాన్ని గ్రహించాలి.

స్వర్గంలో దైవప్రవక్త (సల్లం) సామీప్యంలో, ఆయన సహచర్యంలో చోటు లభించటం

గొప్ప అదృష్టం. అనాధల పట్ల ఉత్తమంగా వ్యవహరించేవారు, వారి మంచిచెడ్డలు చూసేవారికి

ఆ అదృష్టం లభిస్తుంది. అందుకే దైవప్రవక్త (సల్లం) అనాధల పట్ల మంచిగా వ్యవహరించే

వారి ఇల్లు ఉత్తమ ఇల్లనీ, అనాధల్ని కష్టపెట్టేవారి ఇల్లు అతి నీచమైన ఇల్లని అన్నారు.

హజ్రత్ సహ్ బిన్ సాద్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: నేను మరియు అనాధల పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం. ('ఇలా' అన్నప్పుడు) ఆయన తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలిని కలపకుండా కొంతసందు ఉంచి చూపిం చారు. (అంటే స్వర్గంలో ఇద్దరూ ఒకేచోట ఉంటారు కాని స్థానాల్లో మాత్రం తారతమ్యం ఉంటుంది.) (బుఖారీ)

హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు అనాధుల పోషకుడు అనాధకు బంధువైనా, కాకపోయినా (సరే) నేను మరియు అతను స్వర్గంలో ఈ రెండు వ్రేళ్ళ మాదిరిగా (కలసి) ఉంటాం." హదీసు ఉల్లేఖకులు మాలిక్ బిన్ అనస్ చూపుడువ్రేలు మరియు మధ్య వ్రేలితో సైగ చేసి చూపించారు. (ముస్లిం)

సామూహిక అనాధపరిపోషక కార్యాకలాపాలు కేవలం బంధుమిత్రుల అనాధపిల్లలకే పరిమితం కావు. సమాజంలోని ప్రతి అనాధకు, అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ ఇవి తమ సేవలనందజేస్తాయి. ముస్లింలు సామూహిక అనాధ పరిపోషక వ్యవస్థను స్థాపించుకుంటే వారిలో ఎవరికీ భీమా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. భీమా అనేది వడ్డీ వ్యాపారంలోని ఒక రకం. నిరుపేదల నడ్డివిరిచే ఈ వడ్డీ వ్యాపార విధానాలను ఇస్లాం రూపుమాపాలని ఆదేశిస్తోంది. కనుక ముస్లింలు తమ ధర్మం బోధించే సమున్నత ఆర్థిక విధానాలను అమలుపరచుకుంటే ఇలాంటి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు.

ఇక్కడ కొందరికి ఓ సందేహం కలగొచ్చు - ఇలా చేస్తే ఒకరి మీద ఆధార పడే స్వభావం సర్వ సాధారణం అవుతుంది కదా? అని. 

సాధారణంగా వీధుల వెంట తిరుగుతూ భిక్షాటనం చేసేవారు నిరుపేదలై ఉండరు. పైసా జమ చేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాని కొంతమంది తాము ఎంత వాళ్ళు పైసా పేదరికంతో కునారిల్లుతున్నప్పటికీ తొడుక్కున్న దుస్తులవల్లగాని, బాహ్య అవతారం వల్లగాని తమ పేదరికాన్ని బయట పెట్టుకోరు. వారి ఆత్మాభిమానం వారిని ముట్టెత్తనీయదు. వాస్తవానికి నిరుపేదలు, దానధర్మాలు పుచ్చుకోవటానికి అర్హులు వీరే. కనుక దానధర్మాలు చేసినప్పుడు ఇలాంటి సిసలైన నిరుపేదల్ని వెతికి వారికే దానం చేయాలి. భిక్షాటనను వృత్తిగా చేసుకున్నవారికి దానాలు చేస్తే వారిని భిక్షాటనపై ప్రోత్సహించినట్లవుతుంది. ఇస్లాం భిక్షాటనను గర్హిస్తుంది.

దైవ ప్రవక్త (స)  ఇలా ప్రవచించారు : (ఇంటింటా తిరిగి) ఒకటి రెండు ఖర్జూరపు పండ్లు లేదా ఒకటి రెండు ముద్దలు అడుక్కునే వాడు నిరుపేద కాదు. (పేదరికంతో బాధపడుతున్నప్పటికీ) ముష్టెత్తకుండా (ఆత్మాభిమానంతో) బ్రతికేవాడే సిసలైన నిరుపేద. (బుఖారీ - ముస్లిం)

 

బుఖారీ - ముస్లింలో వేరొక ఉల్లేఖనం లోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి: ప్రజల దగ్గర ఒకటి రెండు ముద్దలు లేదా ఒకటి రెండు ఖర్జూర పండ్లు అడుక్కుంటూ తిరిగేవాడు నిరుపేద కాదు. సిసలైన నిరుపేద ఎవరంటే, అతని దగ్గర ఇతరుల్ని యాచించకుండా ఉండేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉండదు. మరోవైపు ప్రజలు అతనికి దానం చేయాలన్నా అతను వారికి పేదవాడిగానూ కనిపించడు. (తాను ఎంత పేదరికం బాధపడుతు న్నప్పటికీ) ఇతరుల ముందు చేయి చాపటానికి అతను సిద్ధపడడు. (బుఖారీ – ముస్లిం)

 

ఒక్క అనాథాలనే కాదు, సమాజంలోని బడుగు వర్గాల ప్రజలు - వారు వికలాంగులైనా, వితంతువులైనా వారి పోషణా బాధ్యత అందరి మీద ఉంటుంది. పైగా ఇది ఎంతో ఘానా కార్యం కూడా.  వాస్తవానికి సమాజంలోని ఇతర అభాగ్యజీవులు, నిరాశ్రయులు, నిరాధారజీవులందరి పోషణ, సంరక్షణ కోసం చేసే కృషి దైవమార్గంలో చేయబడే పోరాటంతో సమానంగా పరిగణించబడు తుంది. దీనిద్వారా ఇస్లాంలో సంక్షేమ కార్యకలాపాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ నేడు ముస్లింలు వీటిని విస్మరిస్తూ పోతున్నారుగాని ఇస్లాం ధర్మం సంక్షేమరాజ్య రూపురేఖల్ని సైద్ధాంతికంగా వివరించి, క్రియాత్మకంగా ఏనాడో దానిని స్థాపించి చూపించింది.   కేవలం నమాజ్, రోజాలు పాటించటమే ఆరాధన కాదు. బలహీనులకు సహాయపడటం, వితంతువులు, నిరుపేదల్ని ఆదుకోవటంలాంటి పనులన్నీ కూడా ఆరాధనల క్రిందికే వస్తాయి.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు వితంతువులు, సమానం. (హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు:) అతడు అలుపెరగ కుండా దైవారాధన చేసేవాడితో, నిరంత రంగా ఉపవాసాలు పాటించేవాడితో సమానమని కూడా దైవప్రవక్త (సల్లం) అన్నారని నా అనుమానం. (బుఖారీ - ముస్లిం)

 

కొందరుంటారు -  సమాజంలోని నిరుపేదల్ని, అభాగ్యజీవుల్ని ఆహ్వానించకుండా  అట్టహాసంగా విందులు, వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. వారు తమ  విందుకు హాజరయితే అది తమ కీర్తికే కళంకంగా భావిస్తారు. వాస్తవానికి ఆ విందుకు హక్కుదారులు ఆదరణ నోచుకోని అనాథలు, ఆకలిగొన్నవారు, అగత్యపరులు, నిరుపేదలే. అలాంటప్పుడు వారిని విస్మరించి ధనవంతుల్ని మాత్రమే ఆహ్వానించటం నైతికంగా ఎంతో దిగజారిన పని అనిపించుకుంటుంది. దీనివల్ల కలిగే ఇంకో దుష్పరిణామం ఏమిటంటే, ధనవంతులు చేసే ఘనమైన విందు ఏర్పాట్లని చూసి పేదవారు చిన్నబుచ్చుకుంటారు. తమ దగ్గర అంత స్తోమత లేకపోయినందుకు వారి మనసు చివుక్కుమంటుంది. ఈ విధంగా ఒక ముస్లింని మానసికంగా కష్టపెట్టడం కూడా పాపమే. ఇస్లాం ధర్మం అగత్యపరుల్ని ఆదుకోవాలని, వారి మనసును సంతుష్టపరచాలని, సమాజంలోని నిరుపేదల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశిస్తోంది.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: (అగత్యపరులు) వస్తుంటే వద్దని, రానివారి కోసం వెంప ర్లాడే వలీమా విందు అత్యంత నీచ మైనది. (వలీమా విందు) ఆహ్వానాన్ని అంగీకరించనివాడు దైవానికి, దైవ ప్రవక్తకు అవిధేయుడయ్యాడు. (ముస్లిం) బుఖారీ - ముస్లింలలోని అబూ హురైరా (రజి) గారి వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: పేదవారిని పిలవకుండా (కేవలం) ధనికులు మాత్రమే ఆహ్వా నించబడే వలీమా విందు అత్యంత నీచమైనది. (బుఖారీ - ముస్లింల)

హజ్రత్ ఆయిషా (రజి. అర్హి) కథనం : ఒక స్త్రీ తన ఇద్దరు అనాథ ఆడ పిల్లలను  వెంటబెట్టుకొని నా దగ్గరికొచ్చి - ఏమైనా దానం చేయమని అడిగింది. అప్పుడు నా దగ్గర ఆమెకివ్వటానికి ఒక ఖర్జూర పండు తప్ప మరేమీ లేదు. నేను ఆ ఒక్క ఖర్జూర పండునూ ఆమెకిచ్చేశాను. ఆ స్త్రీ నేనిచ్చిన ఖర్జూరపండును తన ఇద్దరు కూతుళ్ళకు పంచి ఇచ్చింది. తాను మాత్రం తినలేదు. కొంత సేపటికి ఆమె లేచి వెళ్లిపోయింది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) మా దగ్గరికి వచ్చి నప్పుడు నేనీ విషయాన్ని ఆయనకు తెలియజేయగా, దానికి ఆయన ఆడపిల్లల వల్ల ఎవరైనా పరీక్షలకు గురైనప్పటికీ (సహనం వహిస్తూ) వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించిన వ్యక్తి పాలిట ప్రళయదినాన ఆ ఆడ పిల్లలే నరకాగ్నికి అడ్డుగా నిలుస్తారు" అని అన్నారు. (బుఖారీ - ముస్లిం)

 

సమాజంలో బలవంతులు బలహీనులపై దౌర్జన్యాలకు పాల్పడటమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దౌర్జన్యాలకు గురయ్యేది అబలలైన స్త్రీలు, అనాధలే. ప్రజలు స్త్రీల కోసం, అనాధల కోసం షరీఅత్ కేటాయించిన హక్కులు వారికి దక్కకుండా చేస్తుంటారు. ఒకవైపు వారి హక్కుల్ని కాలరాయటంతోపాటు మరోవైపు వారిని రకరకాలుగా వేధించటం, చిత్రహింసలకు గురిచేయటం చేస్తుంటారు. దైవప్రవక్త (స) ఇలాంటి దౌర్జన్య పరులకు పరలోకంలో వినాశం తప్పదని హెచ్చరించారు. బలవంతులు బలహీనుల హక్కుల్ని దోచుకుతినడాన్ని ఖండించారు

హజ్రత్ అబూ షురైహ్ ఖువైలిద్ బిన్ అమ్ర ఖుజాయి (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా అనేవారు : దేవా! ఇద్దరు అబలల హక్కుల విష యమై నేను ప్రజల్ని పదే పదే భయ పెడుతున్నాను. (ఆ ఇద్దరు ఎవరంటే), అనాధ మరియు స్త్రీ. (ఈ హదీసు 'హసన్' కోవకు చెందినది).  

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే సత్యధర్మ ధ్వజవాహకులైన ముస్లింలు సైతం తమ ధర్మాదేశాల అమలుకు స్వస్తి పలికారు. మంచికి మారుపేరు కావాల్సిన ముస్లిం సమాజాల్లోనే ఇలాంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. బలవంతులు బలహీన వర్గాలపై దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. పురుషులు స్త్రీలను నానా యాతనలకు గురిచేస్తున్నారు. ఫలితంగా నేడు ప్రపంచంలో ఇస్లాం అపఖ్యాతి పాలౌతోంది. ఇస్లాంలో మహిళల హక్కులకు రక్షణ లేదన్న అపవాదు మొదలయ్యింది. ఇస్లాం విరోధులు రకరకాల అనుమానాలు సృష్టించి దీనికి ఆజ్యం పోస్తున్నారు. కాని వాస్తవానికి ఇస్లాం ధర్మం పురుషులతోపాటు స్త్రీలకు కూడా సమాన హక్కుల్ని, సముచితమైన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ప్రసాదించింది. నేటి ముస్లింలు వాటిని విస్మరిస్తున్నారంటే ఆ దోషం ఇస్లాంది కాదు. దానికి ఇస్లాంను ఆడిపోసుకోవటం సమంజసం కూడా కాదు.

 

నేడు ముస్లింలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ నడవడిక ద్వారా గాని, తాము అనుసరిస్తున్న విధానాల ద్వారాగాని ఇస్లాంధర్మం అపఖ్యాతి పాలు గాకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. ఇస్లాం బోధించే అభ్యుదయ సుమగంధాల్ని లోకానికి తెలియజేయాలి. లేకపోతే తాము స్వయంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకు, ఇంకా తమ ధర్మం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు వారు రెండింతల పాపాన్ని మోయవలసి ఉంటుంది.

హజ్రత్ ముస్లిబ్ బిన్ సాద్ బిన్ అబూ వఖాస్ (రజి) కథనం ప్రకారం (ఆయన తండ్రి) అయిన సాద్ గారికి తాను తన క్రిందివారికన్నా గొప్పవాణ్ణనిపించింది. (ఈ విషయం తెలుసుకొని) దైవప్రవక్త “ఈ బలహీనుల చలువతోనే మీకు (దైవం తరపునుంచి) సహాయం లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందని గ్రహించండి" అని అన్నారు. (సహీహ్ బుఖారీ)

స్థితిమంతులు తమల్ని తాము గొప్పవారిగానూ, తమకన్నా తక్కువ స్థాయిలో వున్నవారిని అల్పులుగానూ భావించకూడదు. పైగా బలహీనుల్ని, నిస్సహాయుల్ని గౌరవించాలి. వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. బహుశా మీపై ఆధారపడి బతుకుతున్న వారిమీద కనికరంతోనే దేవుడు మీ సిరిసంపదల్లో వృద్ధిని ప్రసాదిస్తున్నాడేమో! అలాంటప్పుడు మీరు మిడిసిపడటం దేనికి?!

దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్గా ఉవైమిర్ (రజి) తెలియజేశారు: మీరు నన్ను బలహీనుల్లో అన్వే షించండి. నిస్సందేహంగా ఈ బలహీనుల వల్లనే మీకు సహాయం అందు తోంది. ఉపాధి లభిస్తోంది.(సుననె అబూదావూద్)

బలహీనులు, నిస్సహాయుల వల్ల స్థితిమంతులకు సహాయం లభించటంలోని ఆంతర్యం ఏమిటంటే సాధారణంగా నిరుపేదల, బలహీనుల హృదయాలు ఐహిక వ్యామోహానికి అతీతంగా ఉంటాయి. కనుక వారిలో చిత్తశుద్ధి మెండుగా ఉంటుంది. ఇతరుల కన్నా ఎక్కువగా వారు దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. అలాంటివారు దైవసన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు వారిని ఒట్టి చేతులతో త్రిప్పి పంపడు. తప్పకుండా వారి ప్రార్థనలను ఆమోదిస్తాడు. కాబట్టి అలాంటి బలహీనుల్ని ఆదుకుంటే వారు తమని ఆదుకున్నవారు సుఖంగా ఉండాలని దైవాన్ని వేడుకుంటారు. వారి ప్రార్ధనల ఫలితంగా వారికి దైవసహాయం అందుతూ ఉంటుంది. నసాయిలోని వేరొక ఉల్లేఖనం కూడా ఈ అర్థాన్ని సమర్థిస్తోంది. అందులో 'దేవుడు సమాజంలోని బలహీనుల ప్రార్థనలు, నమాజు మరియు వారి చిత్తశుద్ధి వల్ల ఆ సమాజాన్ని కాపాడుతుంటాడు' అని ఉంది. (ఔనుల్ మాబూద్)


Friday, May 13, 2022

అనారోగ్యం వల్ల కలిగే అనుగ్రహాలు

మిత్రమా! జబ్బు ఓ చెడ్డ . వస్తువు అయివుంటే అల్లాహ్ తాను మెచ్చిన దాసులను అనారోగ్యానికి గురిచేసేవాడు కాదు. నువ్వూ-నేనే కాదు, పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా రోగ బారిన పడ్డారు. దైవప్రవక్త అయ్యూబ్ (అలైహిస్సలాం) భరించరాని బాధకి లోను చేయబడ్డారన్న సంగతి నీకు తెలుసు. ఇక్కడ గమనించదగిన ఓ ముఖ్య విషయముంది. కొన్ని రోగాలు మనిషిని అత్యున్నత స్థాయికి చేరుస్తాయి. అల్లాహ్ మార్గంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి లభించేంత పుణ్యం లభిస్తుంది. ఉదాహరణకు: - పురిటి నొప్పులతో ప్రాణం వదిలే స్త్రీ మూర్తి, జల ప్రవాహంలో మునిగి మరణించేవారు, అగ్ని ప్రమాదంలో మృత్యు చెందేవారు, (ఆత్మ హత్యలు కావు సుమా) ప్లేగు తరహా వ్యాధితో మరణించేవారు. అల్లాహ్ ప్రియుల్లో చేరతారని ప్రవక్త(స) ఉద్ఘాటించారు. 



 ప్రేమ - అనురాగం

జబ్బు మనిషికి, సమాజంలో వున్న ప్రముఖ వ్యక్తుల పట్ల, బంధుమిత్రుల పట్ల ప్రేమానురాగాలను, గౌరవ మర్యాదలను నేర్పుతుంది. తను సంఘజీవి అనీ, ఇతరుల అవసరం ఎంతయినా తనకుందనీ, జీవితమనే ఈ రణరంగంలో ఒంటరి పోరాటం అసాధ్యమని తెలియపరుస్తుంది. మరి జనుల అవసరం తనకు లేదని భావించే వ్యక్తి జీవితం గర్వం, అహంకారం, అహంభావాలతో నిండి వుంటుంది. తత్ఫలితంగా మనిషి సాటి మనుషులని అర్ధం చేసుకోవటంగాని, పిల్లలతో మృదువుగా మాట్లాడటంగాని చెయ్యడు. దైవ వచనం ఈ విషయాన్నే సూచిస్తుంది. మానవుడు తనను తాను ఎవరి అక్కరా లేనివాడననీ, స్వతంత్రుడననీ మితిమీరి ప్రవర్తిస్తూ వుంటాడు. (అలఖ్ -  6,7) 


మారుతున్న మనస్తత్వం

నేటి పిల్లలు మధ్యతరగతి లేదా పేద కుటుంబంలో పుట్టవచ్చు, కానీ వారి ఆలోచన చాలా హై-ఫై. వీరి కలలు చాలా రిచ్ గా ఉంటాయి. దీని వల్ల పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. పిల్లలు కష్టపడి పనిచేసే తల్లిదండ్రులను కార్మికులుగా పరిగణించడం ప్రారంభిస్తారు. వారు పెద్దయ్యాక కొన్నిసార్లు వారిని సేవకులుగా చేసి, వారి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేస్తారు. 

తల్లి పాదాల క్రింద (తల్లి సేవలో) స్వర్గముంది, తండ్రి స్వర్గానికి తలుపు లాంటివాడు అన్న దైవప్రవక్త(స) గారి హితబోధని తు.చ తప్పకుండా పాటిస్తూ స్వర్గాన్ని తన సొంతం చేసుకోవటానికి బదులు తన జన్మకు కారకురాలైనవారిని అగౌరవ పరచి మనిషి తన చేజేతులా ఇహపరాల జీవితాల మరణ శాసనం రాసుకుంటున్నాడు. ఇలాంటివారు ప్రవక్త ముహమ్మద్ (స) గారి ఈ హదీసును కాస్త గమనిస్తే చాలా మంచిది: “తీర్పు దినాన సార్వభౌమాధికారి అయిన అల్లాహ్ మనిషిని ఉద్దేశించి ఇలా అంటాడు: ఓ ఆదం పుత్రుడా నేను రోగిగా వున్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావా? అని. ' ఓ నా ప్రభూ! నువ్వు సర్వలోక ఆరోగ్య ప్రదాతవి కదా. (దాసుదయిన) నేను (ప్రభువయిన) నిన్ను పరామర్శించడం ఏమిటి?' అని దాసుడు విన్నవించుకుంటాడు. అల్లాహ్ ఇలా అంటాడు: " నా ఫలానా దాసుడు రోగగ్రస్థుడయివున్నప్పుడు నువ్వు అతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు కదా! అలా నువ్వు వెళ్ళి అతన్ని ఓదార్చి వుంటే నన్ను అక్కడ పొంది ఉండే వాడివి. (నా కరుణా కటాక్షా లకు అర్హుడయ్యేవాడివి) ( ముస్లిం)


ఆఖరి మాట అంతిమ ప్రవక్త(స) నోట

(అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)

* మీపై సుఖశాంతులు కురియుగాక! సర్వలోక ప్రభువయిన అల్లాహ్ ను స్తుతిస్తూ, ఆయనకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులైన వారు ఎవ్వరూ లేరు. కనుక మీరు సయితం అల్లాహ్ ను స్తుతిస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోండి. అల్లాహ్ మీకు గొప్ప ఫలితాన్ని ఇవ్వుగాక! మీకు సహన స్థయిర్యాలు ప్రసాదించుగాక! మనందరినీ కృతజ్ఞుల్ని చేయుగాక. మన ధన ప్రాణాలు ఆస్తిపాస్తులు, ఆలుబిడ్డలు, బంధు మిత్రులు - ఇవన్నీ అల్లాహ్ ప్రసాదించిన దైవానుగ్రహాలే. ఇవన్నీ మనకు అప్పగించబడిన అల్లాహ్ అమానతులు. ఇవి మీ దగ్గర వున్నంత వరకు అల్లాహ్ మీకు సుఖసౌఖ్యాలు ప్రసాదించుగాక! అవి దూరమయిన తరువాత అల్లాహ్ మీకు మంచి సత్ఫలితాన్ని ప్రసాదించుగాక, పరలోకాన్ని కాంక్షిస్తూ సహనం వహించే మీపై అల్లాహ్ తన కారుణ్య వర్షాన్ని కురిపించి సన్మార్గంపై మీకు నిలకడను ప్రసాదించుగాక, సహనం వహించండి.

 చూడండి! మీ కలత చెందడాలు. (ఆశా జ్యోతిని ఆర్పివేసే) నిరాశా నిస్పృహలు బహుశా మీకు పుణ్యం లభించకుండా చెయ్యవచ్చునేమో! తరువాత పశ్చాత్తాపం చెందేది కూడా మీరే. మీ ఈ అసహనం వల్ల మరణించే వ్యక్తి తిరిగి రాడు. దు:ఖం నుండి విముక్తి లభించదు. ఏది, ఎప్పుడు జరగాలో అది జరిగే తీరుతుంది. వస్సలామ్. " ( ముఅజముల్ కబీర్ - తబ్రానీ  )

(హజ్రత్ మాబ్-ఇన్-జబల్(ర) గారు పుత్ర వియోగంతో ధుఃఖిస్తూ  వున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) ఆయన్ను ఓదార్చుతూ వ్రాసిన లేఖ ఇది).


Wednesday, April 20, 2022

లైలతుల్ ఖదర్ విశిష్టత / The uniqueness of Laylat al-Qadr

అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)

 

ఆయా కాలాలను బట్టి వివిధ జాతుల్లో, వివిధ భాషల్లో దైవ ప్రవక్తలు వచ్చారన్న విషయం విదితమే. లోక కళ్యాణార్ధం వచ్చిన ప్రవక్తలందరూ, ప్రజలకు స్వచ్చమైన జీవన విధానాన్ని చూపించి, స్వేచ్చావాయువుల్లో విహరింపజేసే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అన్న సద్వచనం మీద మానవాళిని సమైక్యపరచడానికి ప్రయత్నించారు. అలా విశ్వ శాంతి నిమిత్తం వచ్చిన ప్రవక్తలలో ముహమ్మద్ (స ) చిట్టచివరివారు.

మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి సత్యాన్నిచ్చి పంపాము. ప్రతిజాతిలోనూ హెచ్చరించేవాడు ఆవిర్భవించాడు. (ఫాతిర్: 23,24)




చరిత్రను తిరగేస్తే...... .
నాడు - హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) ప్రవక్తల పితామహుడు. మొక్కవోని సాహసమూర్తి. సహన శీలి. నాటి - ఆ సమాజం, సభ్యతాసంస్కారాలకు సమాధి కట్టి, నీతినిజాయితీలకు నిప్పు పెట్టి, దురాచారాలను ప్రవేశపెట్టి, పచ్చి నిజాలను మంటల్లో నెట్టి, జన మోసాలకు, ధన మోహాలకు, విగ్రహ వ్యామోహాలకు శ్రీకారం చుట్టి, న్యాయ శాస్త్రాలకు పాడె కట్టి, ధరలోభాలకు పట్టం కట్టి, షిర్క్ అడుసు తొక్కి, చర్మ చక్షువులకు కర్రి మబ్బుల గంతలు కట్టి, సందుల్లో, బొందుల్లో శిలాప్రతిమల్ని నిలబెట్టి, జన నమ్మకాలను కొల్లగొట్టి, హరామ్ అనే హాలాహలానికి అమృతం అన్న లేబల్ చుట్టి, చెట్టు, పుట్ట, పాము-పశువు, వాగు-వంక, సూర్యచంద్ర నక్షత్రాలకు తల వంచి, ఆత్మనే వంచించి, కటిక చీకట్లలో కొట్టుమిట్టాడే ఆ గాఢాంధకార సమాజంలో సత్య జ్యోతి వెలిగించడానికి నడుం బిగించారు ప్రవక్త ఇబ్రాహీమ్ (అ).

నిన్న- అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స ). ప్రవక్తలందరి నాయకుడు. మహా గొప్ప విప్లవకర్త, విశ్వకారుణ్యమూర్తి. నిన్నటి - ఆ సమాజంలోని- ధరావతుల, ధనాన్వితుల దారుణ హింసా చర్యలను నిరశించి, తిండిలేక ప్రజలు కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య ఊగిస లాడుతుంటే, ధాన్యాగారాలను నిల్వబెట్టి, ప్రజల కళ్ళు గప్పి, వంచనలకు, లంచాలకు, చక్ర బారు వడ్డీలకు చక్రాలు తిప్పే విద్రోహ శక్తుల్ని నియంత్రించి, సత్య ధర్మాద్వేషులని, సంఘంలో నక్కిన గుంట నక్కల్ని, సమాజంలో దాగిన విష ఖడ్గాలని, పాలు పోసి మరీ పెంచబడిన భయద భయంకర సర్పాలనీ, హంతకులని, నియంతలని, స్వార్థపరులని, దుర్మార్గులని, ధూర్తులని గర్జించి, బానిసత్వ సంకెళ్ళను తెంచి, అనవసర ఆంక్షల బరువులను దించి, మంచిని పెంచి చెడును త్రుంచి, మానవ నిర్మాతయి, సౌజన్య ప్రదాతయి, సాత్విక దాతయి నిలిచారు మహా ప్రవక్త ముహమ్మద్ (స).

ఆయన చేపట్టిన మహోద్యమం కారణంగా ప్రతి హృదయం జ్యోతిర్మయం అవగా, ప్రతి నేత్రం మందారం వలె విరియగా, ప్రతి వదనం సౌహార్ద ప్రతిబింబంగా వెలియగా, ప్రతి పలుకు మలయ మారుతంలా మారగా, మనో సీమల్లో మమతల మల్లెలు పూయగా, ఆత్మ బలం గుభాళింపగా విజయ ఢంకా మ్రోగించారు, హృదయాల విజేత అన్పించారు.

ఫలితం - ద్వేషం మొలచిన పాదుల స్నేహ వల్లి వెల్లి విరిసింది. కక్షలు, కార్పణ్యాలు పెరిగిన తావుల కారుణ్యం కురులు విప్పింది. దౌర్జన్యం, దౌష్ట్యం మోహరించిన చోటల్లా స్వేచ్ఛా పూవు విరబూసింది. వర్గ, వర్ణ, కుల, గోత్ర, మత, ప్రాంత విభేదాలు తొలగి, వైషమ్యాలు, వైరాలు, నేరాలు, ఘోరాలు సద్దు మణిగి, బర్బరత్వం అంతరించి, మృగత్వం మెడలు వంచి, మానవత్వం జయించింది. శాంతి తంత్రి నినదించింది. దానవత్వం, దమన నీతి, దారుణత్వం అణగారింది. సాత్విక దృష్టి సౌమ్యతా మొగ్గలు తొడిగింది. శ్రమకి,
శ్రామికునికి ఫలితం సకాలంలో లభించింది. స్త్రీకి హక్కు దక్కింది. లోభం, మోహం, మోసం, క్రౌర్యం, కామం, మదం, మత్సర్యం, దురహంకారం చరమ సంధ్యలో తుది శ్వాస వదిలింది. జగమంతా కుటుంబం మనది అన్న భావన వికసించింది. జనులంతా సుందర
భాస్కర సుమనోహర కిరణాలవగా, విశ్వం మొత్తం శాంతి శ్రేయాలు వర్ధిల్లగా, అందరి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జలఝరి వలె రాలగా, అందరికీ వీడ్కోలు పలికి పరమపదించి పరమోన్నత మిత్రుని సన్నిధికి పయనమయ్యారు ప్రవక్త (స ).

మరి నేడు - ముస్లింలు. ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఉనికిలో తేబడ్డ శ్రేష్ఠ సముదాయం. కాని... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు - అలనాటి దర్గాలు, దుర్గాలు, దురాచారాలు, దమన నీతులు నేడూ మన మధ్యనే మసలుతూ, కొత్త రంగులు పులుముకొని, అందంగా ఆకర్షణీయంగా ముస్తాబయి దర్జాగా చెలామణి అవుతున్నాయి. మానవుడు సాధించని ప్రగతి అంటూ ఏదీ లేదు నేడు. విద్యుత్ దీపాలతో నగర పల్లె వీధులు వెలిగిపోతున్నాయి. కానీ, హృదయ సీమలు సుహృద్భావ లేమితో, మానవత్వం, దైవభీతి కరువై బీటలు వారుతున్నాయి. మనసున పూసిన మందారాలు వాడిపోతున్నాయి. కరుణ, ప్రేమ, జాలి, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి. అరచేతిలోని  అంతర్జాలం ఒక వైపు అద్భుతనాల్ని ఆవిష్కరిస్తుంటే, మరో వైపు పూడ్చ సాధ్యం కానీ అనర్థాల్ని సృష్టిస్తున్నది.  సత్యం, ధర్మం, న్యాయం కోసం సద్వినియోగించుకోవాల్సిన ఈ పరికరాలను ముఖ్యంగా యువత - అశ్లీలం, విచ్చలవిడితనం, స్వీయ నగ్న చిత్రీకరణ, నీతి  రాహిత్య సంభాషణ కోసం దారుణంగా దుర్వినియోగ పరుస్తున్నారు.  నేటి మన దుస్థితికి కారణం, కారకులు ఎవరు? మనం కాదా? ప్రజా బాహుళ్యంలో విద్యా గంధాన్ని, ప్రేమ మరిమళాన్ని వెదజల్లే బాధ్యత మన మీద లేదా? ఆత్మ స్తుతిని మాని ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన కర్తవ్యం మనది కాదా? ఏమిటి మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నం కాలేదా?

విశ్వాసుల హృదయాలు అల్లాహ్  ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు. మీరలా కాకూడదు సుమా!
వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత అల్లాహ్  దానికి తిరిగి జీవం పోస్తున్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (అల్ హదీద్:16-17)