శాంతి ప్రియ
లోక కళ్యాణార్థం వేల సంఖ్యలో
వచ్చిన ప్రవక్తల వలె ఆవిర్భవించె
మళ్ళీ ఒక కరుణ కలువ
విరబూసింది మానవ వసంతాన
ఆయన దేశకాలాలకు పరిమితమైన
ప్రవక్త కాదు, వినిర్మల హృదయ
విశ్వనాయకుడు అచ్చమైన
అక్షరాల అంతిమ దైవ ప్రవక్త (లి)
ఆయన పలుకులలో తేనెలొలికెను
అంతః కుహరాల తమస్సులు తొలిగెను
తపశ్శక్తులై ఉషస్జ్యోతులై వెలిగెను
మతుల మైల కడిగి మానవత్వం
నాటెను ఆయన దయా దృష్టి వీక్షణల
దివ్యత్వము కాపురముండెను
రుధిర విపాస వెర్రి తలలు వేసిన
మృగ సమాజ మతోన్మాదులు ఆయన
పలుకుల స్వాతిముత్య చినుకుల తాకిడిచె
మానవ ముత్యాలైపోయిరి
బహు విచిత్రమాయన హితోక్తి
వినగానే ధరావతులు ధనాన్వితులు
దళిత నిరువేదల్ని గుండెలకు హత్తుకొనిరి
'సయ్యిదీ' అంటూ గౌరవించిరి
గుండెకాయని నమిలి మింగలేక
ఉమ్మేసినట్టి వారిని చేరదీసి నిజం
ఇదని నచ్చజెవ్పి మెలమెల్లగా మనిషిగా
మలచిన నీవు ముమ్మాటికీ మహా మనీషివే!
కర్కశ హృదయాల్లో కరుణ రసాల్ని పండించి
కుఫ్ర్ కారడవిని ఈమాన్ కాంతి వనంగా
మలచి మమతల ముత్యాలు జల్లిన
నీవు నిస్సందేహంగా జగద్గురువువే
నెత్తురు వొడిన నేలలో నీతి
అత్తరులను చిల్కించితివె
సతులు చితికి ఆహుతయ్యే భూమిలో
తల్లి పాదాల చెంత స్వర్గమంటివె
ఈ జగాన జీవించిన నీవు
మాన్యుడవు అసామాన్యుడవు
భౌతిక జీవితం పరలోక పంట
పొలం అన్న మహిమాన్వితుడవు
మనిషికీ - అభిమతానికి మధ్య జరిగిన
భీకర పోరులో కులానికి కాదు
గుణానికే దిగ్విజయమ్మని
చాటిన ధర్మప్రభాకరుడవు

No comments:
Post a Comment