దివ్యఖుర్ఆన్ రమజాన్ మాసాన్ని ప్రేమిస్తుంది. రమజాన్ మాసం దివ్య ఖుర్ ఆన్ ను అభిమానిస్తుంది. ఈ రెండిటి దీ ఆత్మీయబంధం. అల్లాహ్ ఇలా ప్రబోధించాడు: రమజాను నెల "ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి.
(ఖుర్ఆన్ 2 : 185) “లౌహే మహ పూజ్” అనబడే సురక్షిత ఫలకంలో నుండి దివ్యఖుర్ఆన్ మొత్తం భూమిపై గల మొదటి ఆకాశంపైకి ఈ నెలలోనే అవతరింపజేయబడింది. దివ్య ఖుర్ఆన్ అవతరించటం ఈ నెలకు దైవికంగా ప్రాప్తించిన ఒక మహా గౌరవం.
అందుకే దైవప్రవక్త (స) ప్రత్యేకించి రమజాన్ నెలలో జిబ్రయీల్ దూతతో కలిసి ఖుర్ఆన్ అధ్యయనం చేసేవారు. ఆయన ఖుర్ఆన్ శ్రద్ధగా ఆలకించేవారు. దాని భావం గురించి యోచించేవారు. పారాయణం చేసేవారు. దాని పిలుపులకు స్పందించే వారు.
రమజాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తి ఆ నెల సాంతం మహోన్నతమైన గ్రంథంతోపాటు జీవిస్తాడు. ఆ గ్రంథ ఔన్నత్యం గురించి అల్లాహ్ ఇలా ప్రకటించాడు:
“ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటం దుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము.”
(ఖుర్ఆన్ 38:29) “ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (ఖుర్ఆన్ 47 : 24)
“ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచిగాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనపడేది.” (ఖుర్ఆన్ 4 : 82)
రమజాన్ నెలలో ఖుర్ఆన్ పారాయణానికి ఉండే ఆ రుచి, ఆ మాధుర్యమే వేరు! ఆ నెలలో ఖుర్ఆన్ పారాయణం మనిషిలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. మౌఢ్యం కాని విశ్వాసాన్ని అతనిలో జాగృతపరుస్తుంది. అంతేకాదు, పారాయణ కర్తకు వినూత్న శక్తిని ప్రసాదిస్తుంది. ఇస్లాం ప్రారంభంలో ఖుర్ఆన్ అవతరణకు సంబంధిం చిన సర్వ స్మృతులనూ అది జ్ఞాపకంలోకి తెస్తుంది. సామూహికంగా ఖుర్ఆన్ పారాయణం చేసిన సంఘటనలు, సదాచార సంపన్నులైన మన పూర్వీకులు ఖుర్ఆన్ పట్ల ఆకర్షితులై, దాని పారాయణం కోసం అత్యధిక సమయాన్ని వినియోగించటం
మొదలగు తీపి జ్ఞాపకాలన్నీ కూడా మన మనోసీమలో మెదలుతాయి. దైవప్రవక్త (స) ఒకసారి తన సహచరులకు ఉపదేశిస్తూ, “ఖుర్ఆన్ పఠించండి. నిశ్చయంగా అది రేపు తీర్పు దినాన దైవసన్నిధిలో మీకోసం సిఫారసు చేస్తుంది” అన్నారు. “ఖుర్ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించేవారు మీలో అందరికంటే ఉత్తములు” అని కూడా ప్రవక్త (స) ప్రబోధించి ఉన్నారు. “అల్ బఖర మరియు ఆలి ఇమ్రాన్ అనే పుష్పద్వయాన్ని పారాయణం చేస్తూ ఉండండి. తీర్పు దినాన అవి రెండు మేఘాల రూపంలోనో లేక పక్షుల గుంపు రూపంలోనో వచ్చి తమ చదువరులకు నీడను కల్పిస్తాయి” అన్న మాట కూడా దైవప్రవక్త (స) ప్రబోధించినదే.
ఆయన ఇంకా ఇలా ప్రబోధించారు: "ఖుర్ఆన్ పండితుడై ఉండి దాన్ని పఠించే వ్యక్తి (తీర్పుదినాన) గౌరవనీయులు, పుణ్యాత్ములైన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్ఆన్ ను పఠించటంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు.”
రమజాన్ నెల రాగానే మన పూర్వీకులు ప్రాపంచిక వ్యవహారాలన్నిటిని ప్రక్కకు నెట్టి ఖుర్ఆన్ పారాయణంతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణానికి సంసిద్ధులయ్యే వారు. రమజాన్ రాకతో ఇమామ్ మాలిక్ ఒక్క ఖుర్ఆన్ పారాయణం తప్ప ఇతర ఏ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదని చారిత్రక ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. విద్యార్ధులకు ఖుర్ఆన్ హదీసులు బోధించటం, ఇస్లామీయ చట్టపరమైన విషయాల్లో ప్రజలకు సలహాసహకారాలు అందించటం సాధారణ రోజుల్లో ఆయన నిత్యకృత్యాలు.
అయితే రమజాన్ నెల వస్తే చాలు ఆయన ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నులయి ఉండేవారు. రమజాన్ అంటే ఖుర్ఆన్ మాసమని చెబుతుండేవారు. ఒక్క ఇమామ్ మాలిక్ అనే కాదు, రమజాన్ నెలలో మన పూర్వీకులందరి ఇండ్ల నుంచీ తేనెటీగలు పాడుతున్నట్టు కమ్మని ఖుర్ఆన్ పారాయణం వినిపిస్తూ ఉండేది. ఉపవాసపు నెలసాంతం వారి ఇండ్లు ఖుర్ఆన్ పారాయణపు నవకాంతుల్ని వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నూతన ఆనందాల్ని నింపుతూ ఉండేవి. కమ్మటి స్వరాలతో వారు ఖుర్ఆనను మధురాతి మధురంగా పారాయణం చేసేవారు. అందులోని వింత విషయాల వద్ద ఆగి విస్మయం వెలిబుచ్చేవారు. శిక్షకు సంబంధిం చిన హెచ్చరికలు వినగానే వణకిపోయేవారు. నరకం గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించేవారు. స్వర్గ ప్రస్తావనలు వస్తే అమితానందాన్ని వ్యక్తపరిచేవారు. ఆదేశాత్మక వాక్యాలు పఠించినప్పుడు వాటిని పాటించాలని మనసులో గట్టిగా నిశ్చయించుకునేవారు. వారింపు విషయాలకు దూరంగా ఉంటామని ప్రతినబూనేవారు.
ఇది సత్యమని ధృవీకరించబడిన విషయం. ఒకసారి ఇబ్నె మసూద్ (రజ్ళి దైవప్రవక్త (స) ముందు నిసా అధ్యాయంలోని మొదటి భాగం పారాయణం చేస్తున్నారు. అలా పఠిస్తూ పఠిస్తూ ఆయన, “ఓ ముహమ్మద్ (స)! మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?” అనే వాక్యం దగ్గరికి వచ్చేసరికి దైవప్రవక్త (స), “ఇక చాలు, ఆపండి” అన్నారు. ఇబ్నె మసూద్ (రజి) తల పైకెత్తి చూస్తే, దైవ ప్రవక్త (స) కన్నీళ్ల పర్యంతమై ఉన్నారు. ఆయన కండ్ల వెంబడి అశ్రుధారలు ప్రవహిస్తూ కనిపించాయి.
మరో ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి అబూమూసా (రజి) దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. అయితే తన పారాయణం దైవప్రవక్త (స) ఆలకిస్తున్న సంగతి ఆయన గమనించలేదు. కాసేపటి తర్వాత దైవప్రవక్త (స) ఆయనతో, “నేను నైపుణ్యభరితమైన నీ పారాయణం ఆలకించాను. బహుశా నువ్వు గమనించలేదేమో! ఏమైనా దావూద్ ప్రవక్తకు ప్రసాదించబడిన స్వరమాధుర్యంలోని ఒకింత నీకు కూడా లభించినట్లుంది” అన్నారు. అబూ మూసా దైవప్రవక్త (స)కు బదులిస్తూ, “దైవప్రవక్తా! మీరు నా పారాయణం ఆలకిస్తున్న సంగతి నేను గమనించి ఉన్నట్లయితే మరింత మనోహరంగా, శ్రావ్యంగా పారాయణం చేసి ఉండేవాడిని కదా!” అన్నారు.
ఈ సందర్భంగా మరో సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది.
ఖత్తాబ్ కుమారులు ఉమర్ (రజి) తన సహచరులతోపాటు కూర్చొని ఉన్నప్పుడు, “అబూ మూసా! మాకు మా ప్రభువును గుర్తు చేయవూ?” అని వేడుకునేవారు. అంతే, అబూమూసా ముందుకు వచ్చి మధురమైన తన కంఠంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఆయన పారాయణం విన్నవారందరూ కన్నీరుమున్నీరుగా విలపించేవారు.
ఆ తర్వాతి తరాల ప్రజల్లో పురుడు పోసుకున్న అనుచిత కోరికలు వారిని అల్లాహ్ గ్రంథాన్ని వినకుండా చేశాయి. మనుషుల అభిరుచులు మారిపోయాయి. విద్యా సంగ్రహణానికి గ్రహణం పట్టింది. ప్రజల అవగాహనా శక్తికి సుస్తీ చేసింది.
దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని వదలి పెట్టి మత గురువుల పుస్తకాలకు పెద్దపీట వేసిన రోజు నుంచే ముస్లిం సమాజంలో పతనం మొదలయింది. శుద్ధ సమాజం లోనూ ప్రతి చోటా చాపక్రింద నీరులా కలీ వ్యాపించింది. ఫలితంగా ముస్లిం సమాజంపై ఘోరమైన విపత్తులూ విరుచుకుపడ్డాయి. ఖుర్ఆన్ పదాలకు చెప్పబడిన అనుచిత తాత్పర్యాలు, వెలికి తీయబడిన విపరీతార్థాలు ముస్లిం సమాజాన్ని ముక్క చెక్కలు చేసి పడేశాయి. ప్రజల్లో ధైర్య సాహసాలు క్షీణించాయి. సమాజాన్ని సన్మార్గంలో నడిపింపజేయటం ఖుర్ఆన్ ఉద్దేశం. హృదయ రోగాలకు స్వస్థతను చేకూర్చే సంజీవని ఖుర్ఆన్. ఆసాంతం అది ఒక
జ్ఞానం, ఒక సంస్కృతి. మనిషి జీవితానికి, ప్రాణానికి, మోక్షానికి తిరుగులేని ఆధారం. సంతోషమైనా, ఆనందమైనా ఖుర్ఆన్ ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇహలోక బహుమానమైనా, పరలోక పారితోషికమైనా ఖుర్ఆన్ చలువే. అది విశ్వప్రభువు ప్రబోధనం. మానవ జీవన సంవిధానం. సమసిపోని విజ్ఞానం.
అలాంటప్పుడు రమజాన్ నెలలో....... ఒక్క రమజాన్ నెలలోనే ఏమిటి, మిగతా నెలల్లోనూ మనం ఖుర్ఆన్ తో పాటు జీవించకపోవటం ధర్మమేనా? ఖుర్ఆన్ మహత్యాన్ని గుర్తెరిగి దాని వెలుగుజిలుగులతో, దాని పారాయణం వల్ల సంప్రాప్తి మయ్యే సుఖసంతోషాలతో మన హృదయాలను నింపుకోకపోవటం న్యాయమా? మనలో మార్పు అనేది రాదా?
No comments:
Post a Comment