ధర్మ రక్షణ, ప్రాణ రక్షణ, మేధో రక్షణ, ధన రక్షణ సంతాన రక్షణ, మాన రక్షణ
1) ధర్మ రక్షణ
ధర్మాన్ని సంరక్షించడం అంటే అల్లాహ్ తనదాసుల కోసం ఎంచుకున్న నిజమైన ధర్మాన్ని సంరక్షించడం. తద్వారా మానవాళిని తప్పుదోవ, మార్గభ్రష్టత్వం, అపసవ్యతలు, తప్పుడు నమ్మకాల నుండి రక్షించడం.
దీని అర్థం - ప్రజల సంబంధాన్నివారి సృష్టికర్తతో బలపరచి, తౌహీద్ మరియు స్వచ్ఛమైన విశ్వాస నియమాలలో వారికి స్థిరత్వాన్ని ప్రసాదించడం. బహుదేవతారాధన మరియు తప్పుదారి పట్టించే మత విశ్వాశాల నుండి వారిని దూరంగా ఉంచి స్వచ్ఛమైన ఆరాధనలను, విధులను వారికి బోధించి - తద్వారా వారి ఇహపరాల మోక్ష హామీని తీసుకోవడం.
మనిషి జీవితంలో ధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది అల్లాహ్ ను ఆరాధించాలనే మనిషిలోని ఆత్మ ఘోషను, అంతరాత్మఆకాంక్షను ఇది సంతృప్తి పరుస్తుంది. అది అతని మనస్సాక్షిని చైతన్య పరచి. మంచితనం, ధార్మికతను, దార్శనికతను పెంచి, అతని జీవితాన్ని ఆనందభరితం, ప్రశాంతమయం చేస్తుంది.
అల్లాహ్ యే గనక ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తుదముట్టించకపోతే, అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడే మఠాలు, మందిరాలు, చర్చీలు, మసీదులు, (ఇతర) ఆరాధనాలయాలు ధ్వంసం చేయబడే ప్రమాదం ఉంటుంది. (అల్-హజ్: 40)
2) ప్రాణ రక్షణ
మనిషి మౌలిక అవసరాలలో ప్రాణ రక్షణ, జీవించే హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఇస్లాం ప్రతి విధమైనటువంటి ప్రాణ హానిని, ప్రాణ నష్టాన్ని, ప్రాణ హనాన్ని నిషేధించింది. జీవ హత్యను - అది మనిషి స్వీయ హత్య - ఆత్మహత్య అయినా, వేరే ప్రాణి హత్య అయినా ఇస్లాం దాన్ని తీవ్రంగా ఖండించింది.
(అన్యాయం, అక్రమం, హత్య, ఆత్మహత్యల ద్వారా) మిమ్మల్ని మీరు హతమార్చుకో కండి. దేవుడు మీ విషయంలో ఎంతో దయామయుడని తెలుసుకోండి. అన్యాయం, అక్రమాలతో ఇలా చేసేవాడ్ని మేము త్వరలోనే నరకాగ్నిలో విసరి వేస్తాం. ఇది దేవునికి ఏమంత కష్టం కాదు. (అన్-నిసా: 29,30)
తోటి విశ్వాసిని బుద్ధిపూర్వకంగా హతమార్చినవారికి నరకమే తగిన శిక్ష. అక్కడే అతను ఎల్లకాలం పడిఉంటాడు. అతనిపై దేవుని ఆగ్రహం, అభిశాపం విరుచుకు పడతాయి. దేవుడు అతని కోసం ఘోరమైన (నరక)యాతన సిద్ధపరచి ఉంచాడు. (అన్-నిసా: 93)
న్యాయప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. (అల్-అన్ఆమ్: 151)
దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవరైతే ఇనుముతో తనను తాను చంపుకుంటాడో, అతని ఇనుము అతని చేతిలో ఉంటుంది, అతను డాంనితో తాన్ కడుపులో పొడుచుకుంటూ నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటాడు. మరియు ఎవరైతే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాడో, అతను దానిని తాగుతూ నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటాడు. మరియు ఎవరైతే పర్వతం నుండి దూకి మరణిస్తాడో, అతను అదే ప్రక్రియను కొనసాగిస్తూ నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటాడు. (ముస్లిం)
3) మేధో రక్షణ
ఈ చరాచర జగత్తులో, అనేక కోట్ల జీవరాశులు నిరంతరం పుడుతూ గిడుతూ ఉంటాయి. ఇన్ని ప్రాణులలోనూ... విజ్ఞతతో ప్రవర్తించడం, జ్ఞానం సముపార్జించటం, విచక్షణా జ్ఞానం కలిగి, ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనే అంశాలు కేవలం మానవులకు మాత్రమే లభించిన వరం. మనిషికి ప్రాప్తమయి ఉన్న ఇతర భౌతికానుగ్రహాలు ఓ ఎత్తయితే విచక్షణా జ్ఞానం, తెలివీతేటలు ఓ ఎత్తు.అతనికి ప్రాప్తమయి ఉన్న ఈ మేధోశక్తి ఆధారంగానే ఇతర సృష్టి తాలలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు. వ్యక్తి మరియు సంఘ నిర్మాణానికి దోహదపడే మానవ మేధో అభివృద్ధి, స్వచ్ఛత, రక్షణ కోసం కావాల్సిన సకల విధమైనటువంటి ఏర్పాట్లు ఇస్లాం చేస్తుంది .
మనిషి మేధోశక్తికి నీరుగార్చే, క్షీణింపజేసే, నష్ట పరిచే, మతిని చలిమ్పిజేసే మత్తు పానీయాలను, మాదకద్రవ్యాలను, వెకిలి చేష్టలను ఇస్లాం సంపూర్ణంగా నిషేధిస్తుంది. ఉద్దేశ్యం వ్యక్తి మరియు సమాజం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలన్నదే. ”ఓ విశ్వసించిన ప్రజలారా!నిశ్చయంగా సారాయి,జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం-ఇవన్నీ పరమ జుగుప్సాకరమయి న విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (మాయిదహ్: 90)
ఇస్లాం ధర్మం - విద్యార్జన గురించి గట్టిగా తాకీదు చేస్తుంది. దాన్ని విశ్వాసానికి ఆయువుపట్టుగా భావిస్తుంది. సత్యాన్ని చేరుకునేందుకు
విశ్వం - విశ్వంలోని వింతలూ, విశేషాల గురించి ఆలోచించమని, లోతు పరిశీలన, దీర్ఘ పరిశోధన చేయమంటుంది.
అలాగే ఫలవంతమైన ఆలోచన చేసేలా తద్వారా సత్యాన్ని గుర్తించేలా మేధకు శిక్షణ ఇవ్వాలని ఇస్లాం ప్రేరేపిస్తుంది.
ఇస్లాం మనిషి మేధకు పెద్ద పీట వేస్తుంది. పవిత్ర ఖురాన్‌లోని అనేక వాక్యాలలో విజ్ఞులను, వివేచనాపరులను ఎంతో గౌరవంగా సంబోధించడం జరిగింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు;
(సత్యం గురించి) తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు ఒకటేనా?” అని అడుగు వారిని. (మా)హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు. (అజ్-జుమర్: 9)
“ప్రభూ! నాకు మరింతజ్ఞానం ప్రసాదించు” అని వేడుకో. (తాహా: 114)
4) ధన సంరక్షణ:
ఇస్లాం వ్యక్తిగత యాజమాన్యాన్ని అనుమతిస్తుంది. ఆ క్రమంలో చోటు చేసుకోగల అతిని, అక్రమార్జన విధానాలను, హానికరమైన ప్రభావాలును ఎండగడుతుంది. ఈ కారణంగానే ఇస్లాం - జకాత్, వారసత్వం మరియు సామాజిక సంఘీభావ వ్యవస్థలను స్థాపించింది
ధనాన్ని మానవ మనుగడకు అవసరమైన వాటిలో ఒకటిగా పరిగణించింది. అనుమతించదగిన - హలాల్ పద్ధతిలో దాని సముపార్జనను, దాన్ని వినియోగాన్ని ప్రోత్సహింస్తుంది. అక్రమ పద్ధతిలో, అక్రమ విధానాల ద్వారా, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ధనార్జనను అది నిషేధిస్తుంది. మహితాత్ముడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు;
మీరు భూమి ఉపరితలంపై (నిశ్చింతగా) తిరిగేందుకు ఆయనే దాన్ని అదుపులో ఉంచాడు. దేవుడు ప్రసాదించిన ఉపాధి (ఒనరులు) అనుభవించండి. (అల్-ముల్క్: 15)
ఇస్లాం ధర్మసమ్మతమయిన జోవనోపాధి కొరకు పరిశ్రమించాలని ఉపదేస్తుంది. ధనాన్ని వృధా చేయడాన్ని నిషేధిస్తుంది. అధర్మ విధానాలైన వడ్డీ, దోపిడి, దొంగతనాల ద్వారా సంపాదించడాన్ని హరామ్ గా ఖరారు చేస్తుంది. ఇవి ఒక ఆరోగ్య సమాజానికి గొడ్డలి పెట్టుగా ఉంటాయి గనక.
దుబారాఖర్చు చేయకండి. దుబారాఖర్చు చేసేవారు షైతాన్ సోదరులుగా పరిగణించబడతారు. షైతాన్ తన ప్రభువుకు కృతఘ్నుడైపోయాడు. (బనీ_ఇస్రాయీల్: 26-27)
అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు. వడ్డీని అధర్మకార్యంగా నిర్ణయించాడు. (అల్-బఖరహ్: 275)
అల్లాహ్ వడ్డీని తుదముట్టిస్తాడు. దానధర్మాలకు వృద్ధివికాసాలు కలిగిస్తాడు. కృతఘ్నుడు, పాపాత్ముడయినవాడ్ని అల్లాహ్ ఎన్నటికీ ప్రేమించడు. (అల్-బఖరహ్: 276)
మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించకండి. (అల్-బఖరహ్: 188)
5) సంతాన సంరక్షణ
సంతాన సంరక్షణ అంటే భూమిపై మానవ జాతిని సంరక్షించడం, సంతాన ఉత్పత్తి ద్వారా మానవ మనుగడను కొనసాగించడం. ఆ నిమిత్తం ఇస్లాం కొన్ని సూత్రాలు మరియు చట్టాలను రూపొందించింది, వాటిలో ముఖ్యమైనవి:
వివాహం: ఏ కుటుంబ పట్టునయితే పిల్లలు పెరిగి పెద్దవుతారో ఆ కుటుంబ పునాదిని ఇస్లాం వివాహమనే పవిత్ర బంధం పునాదిగా నిర్మించగోరుతుంది. ఇస్లాం ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి వివాహాన్ని కోరుకుంటుంది. ఇది సంతానాన్ని మరియు వంశాన్ని సంరక్షింస్తుంది. తద్వారా మానవ మనుగడ సజావుగా కొనసాగదమే కాక, ఆదర్శ మానవ నాగరికత, గొప్ప నైతికత, మంచి విలువల వెలుగులో వర్ధిల్లుతుంది.
యువకుల పెంపకంపై శ్రద్ధ వహించడం: దీనికి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి కావాల్సిన సుశిక్షణను అందించాలి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు, భావి తరాలను మంచి పునాదులపై స్థాపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటుంది.
6) మాన రక్షణ:
ప్రజల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, వారి వంశాన్ని తూలనాడే చర్యలకు పాల్పడకుండా ఉండాలని నొక్కి వక్కాణిస్తుంది. అలా చేయడాన్కి ఘోరపాపంగా పరిగణిస్తుంది. ప్రజల మానం మర్యాదలకు భంగం కలిగించే - వ్యభిచారం, అత్యాచారం. అపహరణ, ప్రాణ హత్య వంటి వాటిని ఘోర పాపాలుగా పరిగణిస్తుంది.
వారు ఒక్క అల్లాహ్ ను తప్ప మరెవరినీ ప్రార్థించరు.అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఏమాత్రం పాల్పడరు. ఈ పాడు పనులు చేసేవాడు మటుకు తన పాపఫలం అనుభవిస్తాడు. (అల్-ఫుర్_ఖాన్: 68)
మాన రక్షణ అనేది వ్యక్తిగత విషయాల మీద పరదా ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది. ఆ నిమిత్తం అవసరమైన సౌశీల్యత, పవిత్రతలను ప్రజా జీవితంలో పెద్ద పీట వేయాలి. ఇది ఇస్లామీయ శాస్త్ర ముఖ్య ఉద్దేశ్యాల్లోనిది. ఇందులో ప్రజా ప్రయోజనాలతోపాటు, ప్రజలకు మేలు కలిగించే ప్రతిదీ వారికి అందుబాటులో ఉండేలా,వారికి కీడు కలిగించే ప్రతిదీ వారి నుండి దూరం ఉంచేలా ఇస్లాం కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేస్తుంది. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ప్రతి ముస్లిం - అతని రక్తం, దానం, మానం - మరో ముస్లింకి నిషిద్ధం. (ముస్లిం హదీసు గ్రంథం)
దైవ ప్రవక్త (స) ఇలా తెలియజేశారు: హలాల్ (ధర్మసమ్మతమైన) విషయాలేవో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. హరామ్ (నిషిద్ధ) విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. అయితే ఆ రెండింటిమధ్య అనుమానాస్పద విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలీదు. కాబట్టి అనుమానాస్పద విషయాలకు దూరంగా ఉన్నవాడు తన ధర్మాన్ని, గౌరవాన్నీ కాపాడుకున్నవాడవుతాడు, దీనికి భిన్నంగా నుమానాస్పద విషయాల జోలికి పోయినవాడు నిషిద్ధ విషయాల్లో పడిపోయే ప్రమాదముంది. అతడు గరిక గట్టుపై పశువుల్ని మేపుకుంటున్న కాపరి లాంటివాడని చెప్పవచ్చు. అతని పశువులు (ఏ క్షణంలోనయినా) గట్టుదాటి ప్రక్కనున్న పొలంలోకి వెళ్ళి మేసే ప్రమాదముంటుంది. వినండి! ప్రతి రాజుకీ నిర్ణీత సరిహద్దులుంటాయి.అలాగే అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించిన విషయాలే. వినండి! మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది పాడయితే మొత్తం మానవ శరీరమే పాడయిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం. (బుఖారీ - ముస్లిం)


No comments:
Post a Comment