Thursday, August 22, 2024

సహనం స్వర్గానికి, సాఫల్యానికి సోపానం - Patience is the stairway to heaven, to success part 01

ఓ  విశ్వసించిన ప్రజలారా! సహనం పాటించండి. మిధ్యావాదుల ముందు ధైర్యసాహసాలు ప్రదర్శించండి. ధర్మసేవ కోసం నడుం బిగించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడే మీరు (ఇహపరాల్లో) కృతార్థులవుతారని ఆశించగలరు. (ఆల్-ఎ-ఇమ్రాన్: 200)




అధినాయకత్వానికి ఆనవాలు సహనం

సహనం అనేది స్థితప్రజ్ఞకు సూచిక. ఎక్కడ ఈ గుణం ఉంటుందో అక్కడ మేధా వికాసం ఉంటుంది. చరిత్రను తిరగరాసిన మహామహులంతా తమ  నడకలోనడతలో నడవడికలో సహనాన్నివినయాన్ని ప్రదర్శించినవారే. ఈ గుణాలు విజేతల లక్షణాలని ఖుర్సఆన్ చెబుతుంది:

వారు (కష్టాలు ఎదురైనప్పుడు) సహనం వహిస్తూమా సూక్తులు విశ్వసిస్తున్నంత కాలం మేము వారిలో మా ఆజ్ఞల ప్రకారం వారికి మార్గ దర్శకత్వం వహించే నాయకుల్ని ఉద్భవింపజేశాం. (అస్-సజ్దా: 24)



సహనం ఒక నిగ్రహశక్తి. మానసిక పరిపక్వత గల స్థితి. ఈ గుణం కలిగినవారు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటారు. వారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు.సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది. మనిషి ఆవేశపడకుండా ఆపుతుంది. మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. అలాగే మనిషి కోపావేశంలో ఉన్నప్పుడుఈ కోపం షైతాన్ దుష్ప్రేరణ వల్ల వచ్చిందని భావించిదాన్నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ఆవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీమ్ అనే  ఈ మేల్కొలుపే అతని క్రోధానికి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. చీటికీ మాటికీ ఆగ్రహోదగ్రులై  నిప్పులు చెరుగుతూ అదుపుతప్పి ప్రవర్తించేవారు ప్రవక్త మహనీయులు చెప్పిన  'తఅవ్వుజ్' (శరణు వేడే) సూక్తిని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సహనంతోనే విజయం సహనలోనే విజయం

దైవ ప్రవక్త (స) అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గరినుద్దేశించి ఇలా అన్నారుబాబూ! నీవు అల్లాహ్ (హక్కులను) గుర్తుంచుకోనీవు ఆయన్ని నీ ముందున్నట్లు గ్రహిస్తావు. ఆనంద ఘడియల్లో నువ్వు అల్లాహ్ ను  జ్ఞాపకముంచుకో. ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపక ముంచుకుంటాడు. (అంటే నిన్ను ఆ కష్టాలనుండి గట్టెక్కిస్తాడు) నీ నుండి తప్పిపోయింది నీకు చేకూరేది కాదనీనీకు చేకూరింది నీ నుండి తప్పిపోయేది కాదని తెలుసుకో! ఇంకా ఈ విషయం కూడా తెలుసుకో! (దైవ) సహాయం సహనం వెంటే ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది. కష్టంతోపాటే సుఖం ఉంటుంది.” (తిర్మిజీ)

సహనం ఒక అమూల్య సంపద. అందుకే ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ప్రతి మనిషికీ తన దైనందిన వ్యవహారాల్లో ఎన్నో గడ్డు పరిస్థితులు,  సమస్యల సునామీలు  ఎదురవుతుంటాయి. ఇది ప్రకృతి సహజం. ఆ సందర్భాల్లో మనిషి నిగ్రహశక్తిని పాటించాలి. స్థిత ప్రజ్ఞతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక జ్ఞానంవివేకం సహనానికి ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఈ సహజ గుణం ఎన్నో దుర్మార్గాలను ఆపుతుంది. కాబట్టి   ఒకరు మన యెడల అణుచుతంగా వ్యవహరించినా మనం మాత్రం   పగను పెంచుకోకూడదు. దాన్ని అధిగమించడమే  శుభం. ఎందుకంటేపగతో పగ ఎప్పుడూ చల్లారదు. నిప్పుతో నిప్పు ఎప్పుడూశాంతించదు.

 అసహనం వల్ల క్షణికావేశం కలుగుతుంది. క్షణికావేశం వల్లే ఎన్నో అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. ఆవేశ కావేషాలు మనిషి నాశనానికి కారణమవుతాయి. ఇస్రాయీల్ సంతతికి చెందిన ప్రజలు -ఎలాంటి కాయ కష్టం లేకుండానే అల్లాహ్  లభించే మన్ మరియు సల్వా అనే అద్భుత ఆహార  సంతృప్తి చెందక,అసహనానికి లోనై -  “మూసా! మేమిక ఒకే విధమైన ఈ తిండి తింటూ వుండలేము. మాకోసం నేల నుండి ఉత్పత్తి అయ్యే కూరగాయలుదోసకాయలువెల్లుల్లిగోధుమలుపప్పు ధాన్యాలుఉల్లిపాయలు మొదలైన ఆహార పదార్థాలు పండింపజేయమని నీ ప్రభువును ప్రార్థించు.”  (అల్-బఖరా: 61)  అన్న తర్వాత వారి పట్టిన దుర్గతికి చరిత్రే సాక్షి!   సహనంశాంతం- మనిషిని అత్యున్నత శిఖరాలకు చేరిస్తేఅసహనం అసంతృప్తిఅనుగ్రహాల యెడల కృతఘ్నత మనిషిని  చేస్తుంది.

సహనం సమర్థుడి అత్యున్నత ఆభరణం.

ఒక లక్ష్యం సాధించాలనుకున్నప్పుడుమనో నిబ్బరం కోల్పోకుండా ధైర్యస్థైర్యాలు కనబరచడంనిదానంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం కూడా సహనమే. అలాంటి సహనమే సత్ఫలితాలను ఇస్తుంది. అశించింది లభించకపోతే సహనం కోల్పోవడం కొందరి నైజం. ఇది తిరోగమనానికి సంకేతం. ఓర్పు వహించి నేర్పుతో ప్రయత్నిస్తే కోరుకున్న ఫలితాలు తప్పక లభిస్తాయి.

సహనంతో వ్యవహరిస్తూ (ప్రత్యర్థిని) క్షమించగలిగితే (ఎంతో మంచిది). ఇది ఎంతో ధైర్యసాహసాలతో కూడిన పని. (షూరా: 43)

 సహనం మనిషిని మహాత్ముణ్ణి  చేస్తుంది. సామాన్యుణ్ని మాన్యుణ్ని చేస్తుంది. సత్యాన్ని చూపిస్తుంది. మనిషిని చరిత్రలో నిలబెడుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహనంతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం దానంతట అదే వరిస్తుంది. అందుకే ఈ విలువైన సహన గుణం మనందరికీ మేలిమి  ఆభరణమవాలి. ఆ నిమిత్తం పనికొచ్చే కొన్ని విషయాలను  తెలుసుకుందాం!

No comments:

Post a Comment