ఇస్లామీయ వాణిజ్యపు ప్రాథమిక సూత్రాలు
మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ఇస్లాం ధర్మానికి మాత్రమే ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సత్య స్థిర ధర్మం అన్నారు. జీవ కోఠిలో అనాదిగా ఉన్న విధేయతా విధానమే ఇస్లాం కాబట్టి దీన్ని అల్లాహ్ ధర్మమని, ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు ఎంతో నిష్టగా పాటించిన జీవం సంవిధానమే ఇస్లాం గనక దేన్నీ ప్రవక్తల ధర్మమని అన్నారు.
ధర్మమార్గాన ఉపాధి సంపాదించడం ప్రతి ఒక్కరి విధి. ఇస్లామ్ దీన్ని గురించి నొక్కి చెప్పింది. అల్లాహ్ ప్రవక్తలు, సందేశహరులు, పుణ్యాత్ములు ధర్మ మార్గాన్నే ఉపాధి సంపాదించేవారు. ఉపాధి రెండు విధాలుగా సంపాదించ వచ్చు. ఒకటి ధర్మమార్గాన, మరొకటి అధర్మమార్గాన. అధర్మమార్గాన ఉపాధి సంపాదించడం మహాపాపం. ధర్మ సంపాదనలో ఎంతో శుభం ఉంది. ఇందులో ఉభయలోకాల శుభాలు ఉన్నాయి. ధర్మ సంపాదన చేసేవారు ప్రజల దృష్టిలో ప్రియులు. అతన్ని అందరూ ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అల్లాహ్ కూడా అతన్ని ప్రేమిస్తాడు.
ఖురాన్ లో ఇలా ఉంది;
విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడి నప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరు గెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. " మీరు గనక తెలుసుకో గలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.
నమాజ్ ముగిసిన తరువాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి దైవానుగ్రహం (ఉపాధి) అన్వేషించవచ్చు. (ఆ సందర్భంలో కూడా) అల్లాహ్ ను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు సాఫల్యభాగ్యం లభించవచ్చు.
వారు వ్యాపారసంరంభం, వినోదం చూడగానే నిన్ను నిలబడ వదిలేసి వాటి వైపు పరుగెత్తారు. వారికిలా చెప్పు: “ఈ వ్యాపారం, వినోదాలకంటే దేవుని దగ్గర ఉన్నవి అనేక రెట్లు శ్రేష్ఠమైనవి. దేవుడు అందరికంటే అత్యంత శ్రేష్ఠమైన ఉపాధిప్రదాత.” (ఖురాన్ -62: 8-11)
పై ఆయతుల్లో అయిదు విషయాల ప్రస్తావన ఉంది.
1) క్రయవిక్రయాలన్నింటిపై నమాజుకున్న ప్రాధాన్యత.
2) వాణిజ్య, వ్యాపార విశిష్టత
3) ధర్మం పట్ల అశ్రద్ధ, అలక్ష్యం,ఏమరుపాటు, విస్మరణ మంచిది కాదు.
4) ప్రాపంచిక ప్రయోజనాలకన్నా పారలౌకిక శుభాలు గొప్పవి.
5) కారకాలు కాదు అసలు కారకుడు అల్లాహ్ మాత్రమే.ఆయనే నిజమైన ఉపాధిప్రదాత.
వృత్తి ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది. ప్రవృత్తి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.
కమ్మరి వారు, మాదిగ వారు,స్వర్ణకారులు, వడ్ల వారు, ముదిరాజు/బెస్త వారు, రాజకులు, మేర వారు, గొల్ల వారు, కాపు వారు, గౌండ్ల వారు, కోమటి వారు. ఇందులో ఏ వృత్తి అధర్మం కానంత వరకూ తప్పు కాదు.
లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరూ హలాల్ జీవనోపాధి కోసం పరిశ్రమించారు. కొందరు కూలీలుగా, మరికొందరు వడ్రంగులుగా, మరికొందరు మేకలు మేపే పని చేశారు. స్వయంగా మహనీయ ముహమ్మద్ (స) సయితం - అజ్యాద్ పర్వతాలపై ప్రజల మేకలను మేపారు.ఆయన వ్యాపారం చేశాడు. ఆయన నుబువ్వత్ కి పూర్వం - హజ్రత్ ఖదీజా (ర.అ) గారి సామగ్రితో సిరియా దేశానికి రెండుసార్లు ప్రయాణించాడు. ఆయన వ్యవసాయ పనులు కూడా చేసేవారు, మదీనా పరిసరాల్లో జురూఫ్ అనే ప్రదేశం ఉంది, అక్కడ ఆయన వ్యవసాయ పనులు చేశారు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ కథనం - దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: హలాల్ జీవనోపాధిని ఆర్జించడం ఒక విధి తర్వాత. విధి. (అల్-సునన్ అల్-కుబ్రా, బైహకీ హదీస్ నం: 16695)
మొదటి విధి అంటే, అర్కానుల్ ఇస్లాం. నమాజు, రోజా, జకాత్,హజ్జ్. ఈ విధుల తర్వాత తప్పనిసరి విధి హలాల్ జీవనోపాధి.
నమాజ్ ముగిసిన తరువాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి దైవానుగ్రహం (ఉపాధి) అన్వేషించవచ్చు. అన్న అల్లాహ్ ఆదేశాన్ని శిరసా వహిస్తూ - అర్రాక్ బిన్ మాలిక్ (రహ్మ) శుక్రవారం ప్రార్థన పూర్తయ్యాక మసీదు తలుపు వద్ద నిలబడి ఇలా అనేవారు; ఓ అల్లాహ్ నేను నీ పిలుపు విని నీ సన్నిధికి వచ్చి వాలాను. నువ్వు విధిగావించిన నమాజును పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నీ ఆదేశానుసారమే భూమిలో హలాల్ జీవనోపాధి కోసం సంచరించబోతున్నాను. ఓ అల్లాహ్! నాకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించు నువ్వు ఉపాధిప్రదాతల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైన ఉపాధిప్రదాతవు. (తఫ్సీర్ ఇబ్న్ కసీర్)
ధర్మ సంపాదన విశిష్టత
ఏ వ్యక్తి అయితే - నిరపేక్షతా కోసం - పేదరికం నుండి కాపాడబడాలని, ఒకరి ముందర చేయి చాచే దౌర్భాగ్య స్థితిని తనకు రాకూడదని, తన పరివారాన్ని మంచిగా చూసుకోవాలని, ఇరుగుపొరుగు వారి యెడల దయతో వ్యవహరించాలని - ధర్మసమ్మతమైన జీవనోపాధిని అన్వేషిస్తాడో - రేపు ప్రళయ దినాన ఆటను అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు -- అతని మొహం పున్నమి చంద్రుని వలే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. (షబ్ అల్-ఇమాన్ బైహకీ హదీథ్ నంబర్: 9889. రచయిత ఇబ్న్ అబీ షైబా హదీథ్: 22186)
మిఖ్‌దాద్ బిన్ మ’అది కరబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన చేతి సంపాదనతో చేసిన భోజనం కంటే మంచి భోజనం మనిషి ఎప్పుడూ చేయలేదు. దైవప్రవక్త, దావూద్ (అ) తన స్వహస్తాలతో పనిచేసి సంపాదించి భుజించే వారు.” (బు’ఖారీ)
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సంపాదించే వాటిలో మీచేతి సంపాదనే అన్నిటి కంటే గొప్పది. అంటే చేతి సంపాదనే అన్నిటి కంటే ఉత్తమ సంపాదన. మీ సంతానం కూడా మీ సంపాదనే. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
అధర్మ సంపాదన వద్దు
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు. అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం నరకంలో వెళ్ళటానికే తగినది.” (అ’హ్మద్, తిర్మిజి’, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు ఒక కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ కాలంలో మనిషి తాను ఆర్జించే సంపద ధర్మసమ్మత మైనదా లేక అధర్మమైనదా? అనే విషయాన్ని పట్టించుకోరు.” (బు’ఖారీ)
అధర్మ సంపాదన అనర్థాలు
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ పరమ పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ వస్తువులనే స్వీకరిస్తాడు. అల్లాహ్ (త) తన సందేశ హరులకు ఆదేశించినట్లే విశ్వాసులకూ ఆదేశించాడు: ”ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమయిన ఉపాధిని తినండి. సత్కార్యాలను ఆచరించండి.” (సూ. అల్-ముఅ’మినూన్, 23:51) అదేవిధంగా విశ్వాసులనుద్దేశించి, ”…ఓ విశ్వాసులారా! మేము మీకు జీవనో పాధిగా ఇచ్చిన పరిశుధ్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి …” (సూ. అల్ బఖరహ్, 2:172) ఆపైన ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఒకడు బహు దూరాన్నుండి ప్రయాణం చేసి కాబా పుణ్యస్థలానికి వస్తాడు, ధూళిలో పూర్తిగా మునిగి ఉంటాడు. వంటినిండా దుమ్ము పట్టి ఉంటుంది. అతడు తన రెండు చేతులూ చాచి, ”ఓ నా ప్రభూ! నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు” అని వేడుకుంటాడు. వాస్తవానికి అతడు తినేది అధర్మమైనది. అతడు త్రాగేదీ అధర్మమైనది. అతడు ధరించింది సయితం అధర్మమైనది. అధర్మ ఉపాధి ద్వారానే అతడి జీవితం గడుస్తుంది. మరి అతడి దు’ఆ ఎలా స్వీకరించబడుతుంది . (ముస్లిమ్)
వాణిజ్య విశిష్టత
రా’ఫె బిన్ ‘ఖదైజ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఏ సంపాదన అన్నిటికంటే పరిశుద్ధమైనదని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ మనిషి తన చేత్తో సంపాదించి తినటం, దగా మోసం లేని వ్యాపారం,” అని అన్నారు. (అ’హ్మద్)
అబూ-స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నీతీ నిజాయితీ గల వ్యాపారి తీర్పుదినం నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసంలో ఉంటాడు. (తిర్మిజి’, దారు ఖుత్నీ)
అల్లాహ్ దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: మీరు వ్యాపారాన్ని మీ వృత్తిగా చేసుకోండి, ఎందుకంటే - (మనిషి జీవనోపాధికి సంబంధించిన) పది భాగాలలో తొమ్మిది భాగాలను ఒక్క వ్యాపారం కలిగి ఉంటుంది. (ఇహ్యా అల్-ఉలూమ్: 2/62)
బుఖారీ యొక్క ప్రసిద్ధ షర్హ్ ఉమ్దత్ అల్-ఖారీలో, అల్లామా ఐని ఇలా అన్నారు: అల్లాహ్ వ్యాపార అనుమతినిచ్చాడు. తన అనుహ్రాహాన్ని అన్వేషించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సహాబాలో మహా ఉద్దందులు వ్యాపారాన్ని తమ వృత్తిగా చేసుకున్నవారే.
ఇమామ్ అహ్మద్ బిన్ హన్బల్‌ను కొందరు అడిగారు, ఒక వ్యక్తి వద్ద నాలుగు దిర్హామ్‌లు ఉన్నాయి, వాటిలో ఒకటి వ్యాపారం నుండి సంపాదించింది. ఒకటి సోదరుడి నుండి బహుమతిగా లభించింది. ఒకటి విద్య వేతనంగా లభించింది. మరొకటి ప్రభుత్వ ఖజానా నుండి లభించింది. వీటిలో ఉత్తమమైనది ఏది? అని. దానికాయన ఇలా జవాబిచ్చాడు: బట్టల వ్యాపారం ద్వారా సంపాదించిన దిర్హమ్. (అల్-అదాబ్ అల్-షరియా మరియు మన్హా అల్-మరైయా: 3/269)
హజ్రత్ ఉమర్ (ర) సోమరుల్ని ఉద్దేశించి - మీరు ధర్మ సంపాదన కోసం శ్రమించకుండా ఒకే చోటు కూర్చుని 'ఓ అల్లాహ్! నాకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించు" అని అడగటం సబబు కాదు. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఏమీ వెండి బంగారాలు వర్షించవు కదా! (ఇహ్యా అల్-ఉలూమ్: 2/62)
వ్యాపార సమయం
ఉదయాన్నే పని ప్రారంభించడం శుభ సూచకం. ''దేవా! నా సముదాయం కోసం - వారి పగటి తొలి వేళలో శుభాన్ని ప్రసాదించు". అని ప్రవక్త (స) వేసుకునేవారు. సఖర్ గామిదీ అనే గొప్ప వ్యాపారవేత్త - తన వర్తక బృందాన్ని ఉదయం తెల్లవారుజామునే సాగనంపేవారు. ఫలితంగా గొప్ప లాభాల్ని గడించి - ప్రశిద్ధ వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచారు. (అబూ దావూద్ హదీస్: 2609. తిర్మిది హదీస్: 1212. ఇబ్న్ మాజా హదీస్: 2236)
ఆదర్శ వ్యాపారి లక్షణం
నమాజ్స్థాపన, జకాత్ చెల్లింపు (వగైరా) విధుల నిర్వహణ నుండి (ఐహిక వ్యామోహం,) వ్యాపార వ్యవహారాలు వారిని ఎన్నటికీ విస్మరింపజేయలేవు. వారు గుండెలు అదిరిపోయే, కనుగుడ్లు స్తంభించే ప్రళయదినం గురించి భయ పడతారు. అల్లాహ్ తమ సత్కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు తన ప్రత్యేక అనుగ్రహంతో మరింతభాగ్యం ప్రసాదిస్తాడన్న ఆశతోనే (వారీ విధులన్నీ పాటిస్తుంటారు). అల్లాహ్ తాను తలచిన వారికి అపరిమితంగా అనుగ్రహిస్తాడు. (నూర్: 37-38)
వ్యాపార లావాదేవీలు జీవిత అవసరాల్లోని ప్రధానమైన అవసరం. ఇవి లేకుండా జీవితం నడవదు. ప్రతి దేశంలో ప్రతి జాతిలో వ్యాపారస్తులు ఉంటారు. వీరు ప్రాపంచిక లావాదేవీల్లో చాలా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వారు కేవలం ధనం కూడబెట్టటంలో ఉంటారు. వారికి కేవలం లాభం పట్ల మాత్రమే ఆశక్తి ఉంటుంది. ధర్మం అధర్మం అనేది ఏమాత్రం ఆలోచించరు. అయితే ఒక ముస్లిమ్ వ్యాపారికి ధర్మాధర్మాల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. అధర్మ మార్గాలను వదలి ధర్మమార్గాలను అనుసరించాలి.
వ్యాపారవేత్తలు రెండు రకాలు
1) నిజాయితీగా వ్యాపారం చేసేవాడు అనేక ప్రాము ఖ్యతలు కలిగి ఉంటాడు. ఇటువంటివారు ప్రవక్తలు, పుణ్యాత్ముల సహవాసంలో లేపబడతారు. ఇహ్‌యా ఉల్ ఉలూమ్‌లో ఇలా ఉంది. ప్రవక్త (స), అనుచరులు కూర్చొని ఉన్నారు. ఒక వీర అనుచరుడ్ని చూచారు. ఉదయాన్నే తన వ్యాపారంలో నిమగ్నమయి పోయాడు. అది చూచిన ప్రజలు ”ఇతని యవ్వనం దైవమార్గంలో గడిపితే ఎంత బాగుండేది” అని అన్నారు. అది విని ప్రవక్త (స) ఇలా అనకండి, ఎందు కంటే ఒకవేళ ఈ పని తనకోసం, ఇతరుల నిరపేక్షా కొరకు చేస్తే, ఇదీ ఒక విధమైన జిహాద్ అవుతుంది. ఒకవేళ భార్యాబిడ్డల కొరకు చేసినా అప్పుడు కూడా దైవమార్గంలో జిహాద్ చేసినట్లే అని అన్నారు.
అబూ-స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నీతీ నిజాయితీ గల వ్యాపారి తీర్పుదినం నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసంలో ఉంటాడు. (తిర్మిజి’, దారు ఖుత్నీ)
2) ‘ఉబైద్ బిన్ రఫా’అహ్ (ర) తన తండ్రిగారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు వ్యాపారులను అవిధేయులు, పాపాత్ములు, దుర్మా ర్గుల సహవాసంలో లేపడం జరుగుతుంది. కాని దైవ భీతితో, సత్కార్యాలు చేస్తూ, సత్యం పలికే వ్యాపారులు తప్ప. (తిర్మిజి’, ఇబ్నె-మాజహ్, దారమి)
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ”ఎవరైనా అధర్మ సంపాదనలో నుండి దానధర్మాలు చేస్తే అల్లాహ్(త) స్వీకరించడు. అధర్మ సంపాదనను తాను ఉపయోగించినా శుభం కలగదు, అధర్మ సంపాదన సంపాదించి వదలివెళితే నరక కారకం అవుతుంది, అల్లాహ్ (త) చెడును చెడుద్వారా తొలగించడు, చెడును మంచి ద్వారా తొలగిస్తాడు, అపరిశుద్ధత అపరిశుద్ధాన్ని దూరం చేయలేదు, అని ప్రవచించారు.” (అ’హ్మద్, షర్’హ్ సున్నహ్)
ఇమామ్ అబూ హనీఫా (రహ్మ) గారి అపూర్వ సంఘటన
అలీ బిన్ హఫ్స్ బజాజ్ ఉల్లేఖనం - నా తండ్రి హఫ్స్ బిన్ అబ్ద్ అల్-రహ్మాన్ అబూ హనీఫాకు వ్యాపార భాగస్వామి. ఇమామ్ అబూ హనీఫా ఆయనకు సరుకులు ఇచ్చి పంపేవారు. వస్తువులను పంపిన తర్వాత, ఫలానా ఫలానా వస్త్రంలో లోపం ఉందని, దానిని విక్రయించేటప్పుడు, లోపాన్ని చూపి విక్రయించాలని హెచ్చరించారు. కానీ మా నాన్న లోపాన్ని కొనుగోలుదారుకు తెలియజేయడం మర్చిపోయారు, అమ్మేశారు. తర్వాత తిరిగి ఇద్దామంటే కొనుగోలుదారు చిరునామా తెలియలేదు. ఇమామ్ అబూ హనీఫా (రహ్మ)కు ఈ విషయం తెలిసినప్పుడు, ఆయన ఆ నాగటూ మొత్తని దానం చేసేశారు. ఆయన దానం చేసిన ఆ నగదు అక్షరాలా ముప్పై వేల దిర్హామ్‌లు. (తజిక్రత్ అల్-నుమాన్: పేజి 208)
కొలతల్లో తూనికల్లో తగ్గించి ఇవ్వడం మహా భయంకర ఆర్ధిక నేరం
తూకం తగ్గించేవారికి వినాశం తప్పదు. వారు ప్రజల నుండి (సరుకు) తీసుకునే టప్పుడు పూర్తిగా తూచి లేక కొలచి తీసుకుంటారు; ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక భయంకర దినాన తాము లేపి ప్రవేశపెట్టబడతామని వారికి తెలియదా? ఆరోజు యావత్తు మానవులు విశ్వప్రభువు ముందు (తలలు వంచి) నిలబడతారు. (వారు తమ దుష్కార్యాలకు జవాబుచెప్పుకోవలసిన పనిలేదని భావిస్తున్నారా?) ఎంతమాత్రం కాదు. దురాత్ముల కర్మల వివరాలు కారాగారం చిట్టాలో ఉంటాయి. కారాగారం చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖిత గ్రంథం. తీర్పుదినాన్ని తిరస్కరించే ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. హద్దులు మీరే పాపాత్ముడు తప్ప దాన్నెవరూ తిరస్కరించరు. (అల్-ముతఫ్ఫిఫీన్: 1-9)
ఎందుకంటే తూనికల్లో, కొలతల్లో ప్రజలకు మోసం జరుగు తుంది. వారి హక్కుల్లో ద్రోహం జరుగుతుంది. సరిగా తూయటం, కొలవటం అమానతు వంటిది. అమానతులో ఖియానత్ చేసేవారికి కఠిన శిక్షలు ఉన్నాయి. ప్రపంచంలో కరువుకు గురవుతారు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఓ ముహాజిరులారా! మీరు ఐదు విషయాలకు గురయితే మీకు ఎటువంటి మంచి లభించదు. మీరు వాటికి గురికావటం నుండి నేను అల్లాహ్(త)ను శరణుకోరుతున్నాను. 1. ఏ జాతిలో విచ్చలవిడిగా అశ్లీలం వ్యాపిస్తుందో, సిగ్గు లజ్జ లేకుండా పోతుందో ఆ జాతి ప్లేగు మరియు ఇతర ప్రమాదకరమైన రోగాలకు, అంతకు ముందులేని వ్యాధులకు గురవు తుంది. 2. ప్రజలు తూనికల్లో కొలతల్లో హెచ్చుతగ్గులు చేస్తే కరవుకాటకాలకు కఠిన హృదయులైన పాలకుల అత్యాచారాలకు గురవుతారు. 3. ‘జకాత్ ఇవ్వడం మానివేస్తే ఆకాశం నుండి వర్షం పడటం ఆగిపోతుంది. ఒకవేళ జంతువులే లేకపోతే ఒక్క చుక్క వర్షం కూడా పడి ఉండేది కాదు. 4. అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను హీనదృష్టితో చూచేవారిని శత్రువులకు గురిచేస్తారు. వారు వీరి ధనసంపదలను దోచుకుంటారు. 5. అదేవిధంగా పండితులు, నాయకులు అల్లాహ్ గ్రంథం ప్రకారం తీర్పులు చేయకపోతే పరస్పర పోరాటాలు ఉద్భవిస్తాయి. (ఇబ్నె మాజహ్, తర్’గీబ్ తర్’హీబ్) మరో ఉల్లేఖనంలో ఉంది, ”తూనికల్లో, కొలతల్లో హెచ్చుతగ్గులు చేసే జాతిపై అల్లాహ్ (త) ఉపాధిని ఆపివేస్తాడు.” (తర్’గీబ్)
వ్యవహారాల్లో కొలతలకు, తూని కలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొలతలు, తూనికలు సరిగా ఉంటే ప్రతివ్యక్తి సంతోషిస్తాడు. అల్లాహ్ (త) కూడా సంతోషిస్తాడు. హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు అసహ్యించు కుంటారు. తూనికలు, కొలతల అసలు ఉద్దేశం ప్రతి ఒక్కరికీ వారి హక్కు పూర్తిగా ఇప్పించటమే. ఎటువంటి అన్యాయం జరక్కుండా ఉండటమే. ఖుర్‌ఆన్‌లో దీన్ని గురించి ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది.
ఈ తూనిక వల్లే మానవుని వాక్కర్మలు ఒకటిగా ఉంటాయి. వీటివల్లే విశ్వ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. కొలతల్లో, తూనికల్లో హెచ్చుతగ్గులు చేయడం వాస్తవంగా ఇతరుల హక్కులను కొల్లగొట్టడమే. కొందరు ఇచ్చేటప్పుడు తగ్గిస్తారు. తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటారు. ఇటువంటి వారు ఇతరుల ఆస్తులకు అన్యాయంగా ఆక్రమణకు పాల్పడతారు. ప్రాచీన జాతుల్లో షు’ఐబ్ (అ) జాతి ఒకటి. ఈ జాతి వ్యాపారం చేసేది. షు’ఐబ్ (అ) ఈ జాతిని సంస్కరణ గురించే పంపడం జరిగింది.
మేము మద్యన్ ప్రజల వద్దకు వారి సోదరుడు షుఐబ్‌ను పంపాము. అతను తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మీ దగ్గరకు మీప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం వచ్చింది కనుక మీరు తూనికలు, కొలతలు పూర్తిగా పాటించండి. ప్రజలకు రావలసిన సరుకు తగ్గించి ఇవ్వకండి. ధరణిలో శాంతీసామరస్యాలు ఏర్పడ్డాక అరాచకం సృష్టించకండి. మీరు విశ్వాసులైతే (విషయం గ్రహించండి), అందులోనే మీ శ్రేయస్సు ఉంది.” (అల్-ఆరాఫ్: 85)
షుఐబ్ బోధ వారికి ఏమాత్రం తలకెక్కలేదు.) వారతడ్ని తిరస్కరించారు. చివరికి వారిపై ఛాయాకృత ఉపద్రవం వచ్చిపడింది. అదొక భీకరదినాన (వచ్చిపడిన) శిక్ష. ఈ ఉదంతంలో కూడా గొప్పసూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించే జనం కాదు. ఏమైనా నీప్రభువు గొప్ప శక్తిసంపన్నుడు, అమిత దయామయుడు. (అష్-షుఅరా: 181-191)
అబద్దపు ఒట్టుతో వస్తువును విక్రయించడం నేరం
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అధికంగా ప్రమాణాలు చేయటం వల్ల సరకు అమ్ముడవుతుంది. కాని శుభం నశిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
అబూ-జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ముగ్గురు వ్యక్తుల పట్ల అల్లాహ్ (త) ఆగ్రహంతో, వారితో మాట్లాడడు, వారివైపు చూడడు, వారిని పాపాల నుండి పరిశుద్ధపరచడు. వారి కొరకు కఠిన శిక్ష ఉంటుంది. ఈ ‘హదీసు’ కథకుడు, అబూ-జ’ర్ (ర), ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఈ నష్టపోయే దురదృష్టవంతులు ఎవరు’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), 1. అహంకారం వల్ల చీల మండల క్రింద వరకు తన పైజామాను వ్రేలాడగట్టే వాడు, 2. ఉపకారం చేసి ఎత్తి పొడిచే వాడు, 3. అసత్య ప్రమాణంచేసి తన సరకును అమ్మే వాడు అని ప్రవచించారు. (ముస్లిమ్)
వ్యాపారులు విరివిరిగా దానధర్మాలు చేయాలి
ఖైస్ బిన్ అబూ ‘గర్’జహ్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో మేము వ్యాపారులము, ‘సమాసిరహ్ ‘ అని పిలువబడే వారం. అంటే మమ్మల్ని తాజిర్ అన కుండా సమాసిరహ్ అనేవారు. దీని అర్థం దళారి (ఏజంటు). ఒకసారి ప్రవక్త (స) మా ప్రక్క నుండి వెళుతూ మాకు ఒక మంచి పేరు పెట్టారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ వ్యాపార సంఘ ప్రతినిధులారా! మీ వ్యాపారంలో వ్యర్థ ప్రేలాపనలు, అశ్లీల పలుకులు, అసత్య ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీరు దాన ధర్మాలను కూడా చేర్చుకోండి. అంటే వ్యాపార సరకుల్లో నుండి దానధర్మాలు చేస్తూ ఉండండి. అవి మీ పాపాలకు పరిహారంగా పనికి వస్తాయి.” (అబూ-దావూద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె-మాజహ్)
ఇచ్చిపుచ్చుకోవడంలో మెతక వైఖరి అవసరం
ప్రతి విషయంలో నీతి, నిజాయితీ, సత్యసంధత, ఇంకా సద్ప్రవర్తన సున్నితత్వం మంచిగా మాట్లాడటం కూడా తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే దుర్మార్గులతో, చెడు స్వభావం గల వారితో ప్రజలు ఎటువంటి వ్యవహారం చేయరు. సద్ప్రవర్తన కష్టాలన్నిటినీ సులభతరం చేసి వేస్తుంది. అతన్ని అందరూ ప్రేమిస్తారు. నోరు మంచిదైతే ఊళ్లే ఏలవచ్చు.’ కొనుగోలు దారులతో మృదువుగా వినయ వినమ్రతలతో సహనం ఓర్పులతో ప్రవర్తించాలి. దీన్నే ముసాహలత్ అంటారు. అంటే చూడనట్టు ప్రవర్తించాలి. కొనుగోలు దారు ఇది కూడా ఒక రకమైన సత్కార్యమే.
హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పూర్వీకుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు. మరణదూత అతని వద్దకు ప్రాణం తీయడానికి వచ్చాడు. ఆ వ్యక్తితో, ‘నీవేదైనా సత్కార్యం చేసి ఉన్నావా?’ అని ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి, ‘నాకు గుర్తులేదు,’ అని అన్నాడు. ఆ వ్యక్తితో, ‘నువ్వు బాగా ఆలోచించు. ఏదైనా గుర్తుకు రావచ్చు,’ అని అనటం జరిగింది. ఆ వ్యక్తి మళ్ళీ, ‘నాకు గుర్తుకు రావటం లేదు, అయితే నాకు కేవలం ఈ మాత్రం గుర్తుంది. అదేమిటంటే నేను అమ్మినపుడు కొన్నపుడు వారి పట్ల మంచిగా ప్రవ ర్తించే వాడిని. వారికి ఉపకారం చేసేవాడిని. నేను అడిగి నపుడు మంచి స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా మరికొంత వ్యవధి ఇచ్చే వాడిని. కష్టాల్లో ఉన్నవాడిని క్షమించే వాడిని.’ అల్లాహ్ (త) ఆ సత్కార్యం ద్వారా ఆ వ్యక్తిని స్వర్గంలోకి పంపాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
వ్యాపారంలో సత్యం పాత్ర ప్రధానమైనది. అసత్యానికి, మోసానికి పాల్పడరాదు. వ్యాపార లావా దేవీల్లో ఎంతమాత్రం అసత్యం, మోసం పనికిరావు. ప్రవక్త (స) ప్రవచనం, నిజాయితీగల వ్యాపారి ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల సహవాసం కలిగి ఉంటాడు. (తిర్మిజి’). మరో ఉల్లేఖనంలో ”అమ్మేవారికి, కొనేవారికి వారు విడిపోనంత వరకు అనుమతి ఉంది. ఒకవేళ ఇద్దరూ సత్యం పలికితే, వస్తువుల లోపాలను బయటపెడితే ఇద్దరికీ శుభం కలుగుతుంది. ఒకవేళ దాచి, అసత్యం పలికితే వారి వ్యాపారంలో శుభం ఉండదు.”
ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రతిగా అల్లాహ్ వారికి రక్షణగా ఉంటాడు. . ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వారికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, స్వర్గ లోక ప్రాప్తి కలుగుతాయి. ‘ఇస్లాం ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’. ఇస్లాం ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడు, విస్మరించిన వ్యక్తి మహా రాజైనా అల్లాహ్ దృష్టిలో అల్పాతి అల్పుడే. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.
మానవజీవితానికి పరమ ప్రయోజనమైన ఇహపరాల మోక్షం.కేవలం ఇస్లాం ధర్మంతోనే సాధ్యం. తొలి ప్రాధాన్యత ధర్మానికే, తొలి స్థానం ధర్మానిదే. అంటే, సంపాదన అయినా, సంసారమయినా, ఆర్ధిక విధానాలైనా, రాజకీయ తీరుతెన్నులైనా, జాతీయం అయినా, అంతర్జాతీయం అయినా - ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః…!



No comments:
Post a Comment