(సరే,) దైవప్రవక్త (వారి కోరికను మన్నించి) “అల్లాహ్ మీకు తాలూత్‌ని రాజుగా నియమించాడు” అని తెలియజేశాడు. అది విని వారు (ధనగర్వంతో విర్రవీగుతూ) “రాచరికం చేయడానికి మేమే ఎక్కువ అర్హులం, హక్కుదారులం గాని, అతనెలా అవుతాడు? అతను ఏమంత స్థితిపరుడు కూడా కాదే?” అన్నారు.
అప్పుడు దైవప్రవక్త ఇలా అన్నాడు: “అల్లాహ్ మీకు బదులు అతడ్నే (ఈ పనికోసం) ఎంచుకున్నాడు. ఆయన అతనికి (కార్యసాధనకు కావలసిన) బుద్ధిబలాన్ని, కండబలాన్ని కూడా పుష్కలంగా ప్రసాదించాడు. అల్లాహ్ తాను తలచుకున్న వారికి రాజ్యాధికారం ప్రసాదిస్తాడు. ఆయన విశాలదృష్టి కలవాడు, సర్వం తెలిసినవాడు.” (అల్-బఖరహ్ - 247)
పాలకులు అంటే అధికారపీఠాలపై కూర్చొని ప్రజలను పాలించే అధినాయకులు. పాలితులు అంటే అధినాయకుల పాలనలో జీవించే ప్రజలు. పాలకులు, ప్రజలు భూమండలానికి వన్నె తెచ్చే విధంగా ఉంటే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తులూ ఉద్యోగాలూ క్రమాభ్యుదయాన్ని సాధిస్తాయి అంటారు.
ప్రజలు ఎప్పుడూ పాలకులను గమనిస్తుంటారు. వారు చేసే పనులను ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే నీతికోవిదులు 'యధా రాజా తథా ప్రజాః' అని చెప్పారు. అంటే రాజు ఏది చేస్తే అదే నీతి అనుకొని అనుకరిస్తారు. అందుకే ప్రజలకొక నీతి, పాలకులకొక నీతి ఉండవు. ఉండకూడదు. చట్టాలు ఎవరికీ చుట్టాలు కావు. సామాన్యజనుడు తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో, పాలకుడు తప్పు చేస్తే అదే శిక్షపడాలి!
సమానత్వం, సౌభ్రాతృత్వాల స్థాపనకై మహనీయ ముహమ్మద్ (స) ఇచ్చిన సందేశం ఆయన సహచరుల మనసుపై చెరగని ముద్ర వేసింది. "అజ్ఞాన కాలపు అహంభావాలు నా పాదాల క్రింద ఉన్నాయి" అని ఆయన ప్రవచించటం ద్వారా గానీ, "ఒక నల్లవానికి తెల్లవానిపై గానీ, ఒక తెల్లవానికి ఒక నల్లవానిపై గానీ ఎలాంటి శ్రేష్టతకు, అధిక్యతకు ఆస్కారం లేదు" అని నొక్కి వక్కాణించటం వల్ల గానీ అనుయాయుల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న అసమానతా భావాలు పటాపంచలై పోయాయి. మనసులోని మాటను వెలిబుచ్చేటప్పుడు ఒక సగటు ముస్లిం కూడా సమకాలీన చక్రవర్తికి జడిసేవాడు కాదు. అలాగే చక్రవర్తి సైతం సామాన్య జనులు నిలిచే బోనులో నిలబడి జవాబు చెప్పుకోవడానికి కించిత్ అసహనానికి గురయ్యేవాడు కాడు.
ద్వితీయ ఖలీపా హజ్రత్ ఉమర్ (ర) పరిపాలనలో ఉబై బిన్ కాబ్ (ర) న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ రోజుల్లోనే స్వయంగా ఖలీఫాకు వ్యతిరేకంగా కేసు నమోదయింది. ఒక నిందుతునిగా ఖలీఫా న్యాయస్థానంలో నిలబడవలసి వచ్చింది. ఖలీఫా న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం న్యాయమూర్తి ఉబై (ర) లేచి నిలబడ్డారు. ఈ ధోరణి ఖలీఫాకు నచ్చలేదు. "న్యాయాధీశా! ఇది మీ పక్షపాత వైఖరికి మొదటి నిదర్శనం" అని మొహం మీదే చెప్పేశారు. ఖలీఫాపై మోపబడిన ఆరోపణలకు గాను సాక్ష్యాధారాలు కోరబడ్డాయి. సాక్ష్యాధారాలను సమర్పించటంలో ఆరోపించేవారు విఫలురయ్యారు. ఇస్లామీయ షరీయతు ప్రకారం ఆరోపణకర్త సాక్ష్యాధారాలను సమర్పించలేనప్పుడు నిందితుని చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇప్పుడు ఈ కేసు ప్రకారం ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) చేత 'ప్రమాణం' చేయించాలి. ఈ పరిస్థితి రాకుండా వదలిపెట్టమని న్యాయమూర్తి ఆరోపణకర్తను కోరారు. "ఇది మీ పక్షపాత వైఖరికి రెండవ నిదర్శనం" అని ఖలీఫా అన్నారు.
హజ్రత్ ఉమర్ (ర) ఖలీఫాగా ఉన్న కాలంలోనే గసాఫీ శ్రీమంతుడొకడు ఇస్లాం స్వీకరించాడు. అతనిపేరు ఏహెమ్. ఇస్లాం పుచ్చుకున్న తర్వాత అతను మదీనా నగరంలో స్థిరపడ్డాడు. ముస్లింగానైతే మారాడుగాని ఇస్లాంను ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేదు. కాబా గృహ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తుండగా ఒక వ్యక్తి కాలు అతని ఫై అంగ వస్త్రంపై పడింది. ఈ మాత్రం దానికి అతను రెచ్చిపోయాడు. . చాచి చెంప దెబ్బ కొట్టాడు. ఈ కేసు ఖలీఫా వద్దకు వచ్చింది. తప్పు ఏహెమ్ ది అని తేలింది. తను కొట్టిన పల్లెటూరి వ్యక్తికి క్షమాపణ చెప్పాలని ఖలీఫా ఆదేశించారు. అందుకు ఏహెం అహం అడ్డం వచ్చింది. తనకు రెండు రోజుల గడువు ఇవ్వమని కోరాడు. ఈ రెండు రోజుల్లోపే అక్కడ్నుంచి పరారై ధర్మభ్రష్టుడైపోయాడు. ఆ శ్రీమంతుడు పలాయనం చిత్తగించినందుకు ఖలీఫా ఏ మాత్రం చింతించలేదు సరికదా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చే సద్బిద్ధిని తనకు ప్రసాదించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ నాడు అందరూ సామాజిక న్యాయం గురించీ, చట్ట సమానత్వం గురించీ అందమైన ఉపన్యాసాలిస్తారు. ప్రజాస్వామికపు విలువల గురించి అదరగొట్టేస్తూ ఉంటారు. కాని పాలకులకు పాలితులకు, సామాన్యులకు అధికారులకు మధ్య ఒకే రకమయిన న్యాయం క్రియాత్మకంగా అమల్లో ఉందా? చట్ట సమత్వం అనేది అందరికీ సమానంగా వర్తిస్తున్నదా? దీనికి ఎవరయినా 'అవును' అని గుండెపై చేయి పెట్టుకుని సమాధానం ఇవ్వగలరా? భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పిలువబడుతోంది. నిజానికి అలా పిలువబడే హక్కు దానికి ఉంది కూడా. అయితే దేశంలో సగటు పౌరునికీ - పాలకునికీ ఒకే రకమైన న్యాయం లభిస్తున్నదా? అంటే 'లేద'నే జవాబు వస్తుంది. కాని అంతిమ దైవ ప్రవక్త (స) మనకు అందజేసిన శాసనాంగంలో ఇలాంటి హెచ్చుతగ్గులు లేవు. ఆయన (స) ప్రియ శిష్యులు తమ భావితరాల వారి కోసం అడుగుజాడల్లోనూ, నెలకొల్పిన ఆదర్శాల్లోనూ తారతమ్యాలు, నిమోన్నతలు మచ్చుకైనా కానరావు. ఇక్కడ వదలి వెళ్ళిన చట్టం దృష్టిలో అందరూ సమానులే. హజ్రత్ ఉమర్ (ర) తన పరిపాలనా కాలంలో సాక్షాత్తు గవర్నర్లనే బాహాటంగా శిక్షించారు.
పాలనాధికారం అంటే 'చేతితో గొడుగు పట్టుకొని నడవడం' వంటిది. ఎండ నుంచి, వాన నుంచి తనను కాపాడుకోవడానికి మనిషి గొడుగును చేతిలో పట్టుకొంటాడు. గొడుగును తాను మోస్తే, గొడుగు తనకు అండగా ఉంటుందనేది మూల సూత్రం. గొడుగు రాజ్యం వంటిది. దాన్ని చక్కగా పట్టుకోవాలి పాలకుడు. చక్కగా పట్టుకోవడం అంటే జారవిడవకుండా, పట్టు సడలకుండా రాజ్యంలోని జనవాహినిని తనకు అనుకూలంగా మార్చుకోవడం. అదే ప్రజలు తిరస్కరిస్తే క్షణాల్లో పదవిని కోల్పోతాడు. పాలకులు గ్రహించవలసిన ప్రధానాంశం ఇది.
పాలకులు సాధారణంగా తమకు ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు, దాన్ని అధిగమించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ఆశ్రయిస్తారు. అయితే ఇవన్నీ ప్రజల మేలు కోసం చేస్తేనే సత్ఫలితాలను ఇస్తాయి. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, తమ ఆక్రమాలను కప్పివేయడం కోసం, మంచివారిని అణచడం కోసం వినియోగిస్తే అపకీర్తిని మూటగట్టుకొంటారు. అందుకే పాలకుడు నీతిమంతుడై ఉండాలి. ధర్మాన్ని కాపాడాలి. పారదర్శకంగా పనులు చేయాలి. రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే శత్రువులను దునుమాడి పారదోలడమే శౌర్యం. రాజనీతిని చక్కగా తెలుసుకొని, ప్రజల సర్వతోముఖ వికాసానికి దోహదం చేసే ప్రణాళికలను రచించి, అమలు చేయడమే జ్ఞానం. స్వార్థచింతన లేకుండా నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం సేవలను అందించడమే సేవానిరతి. ఈ మూడు లక్షణాలు కలిగినవారే పాలించడానికి అర్హులు: ప్రజల మేలు తన మేలుగా, ప్రజల సౌఖ్యమే తన సౌఖ్యంగా, ప్రజల సమ్మతమే తన సమ్మతిగా, ప్రజల హితమే తమ హితంగా పాలకులు భావించాలలి.
మరి నేటి మన పరిష్టితి ఎలా ఉందంటే,
ఖుద్ గలత్ హోకర్ ఖుద్ కొ సహీ..!
సాబిత్ కర్‌నా ఇతనా ముష్కిల్ నహీ హోతా
జిత్‌నా సహీ, హోకర్, ఖుద్‌కొ సహీ.., సాబిత్ కర్‌నా-
తప్పు చేసి, చేసిన పని సరైనదేనని నిరూపించుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. సరైన పని చేసి, చేసింది సరైనదే అని నిరూపించుకోవడం. ఈ రోజుల్లో చాలా కష్టం!
‘ఇది భారత్! ఇండియా కాదు’ అని అంటాడొకడు. తాజ్‌మహల్‌ను తేజోమహల్ అని అంటానంటాడొకడు. అసలు యహుదీ..అనే పదమే తప్పు, దాన్ని యాదవ అని అనాలని అంటాడు ఇంకొకడు. ఇక మరో మహానుభావుడు - ఆస్ట్రేలియాను అస్త్రాలయా అని పిలవాలంటాడు. ఇంతమంది అపర మేథావులు ఈ దేశంలో పుట్టుకు రావడానికి మూల కారణం - పరిపాలనా పగ్గాలు ప్రక్క త్రోవ పట్టాయి అనడానికి ప్రబల తార్కాణం.
గాజాలో జాతిహననం
చరిత్ర పుటలను తిరగేస్తే- ప్రజలను పాశవికంగా పొట్టనపెట్టుకున్న పాలకుల వికృత స్వరూపాలెన్నో కనపడతాయి. నాటి నియంతల పైశాచికత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నెతన్యాహూ సారథ్యంలోని ఇజ్రాయెల్ దళాలు నేడు జాతిహననానికి పాల్పడుతున్నాయి.
చరిత్ర పుటలను తిరగేస్తే- ప్రజలను పాశవికంగా పొట్టనపెట్టుకున్న పాలకుల వికృత స్వరూపాలెన్నో కనపడతాయి. నాటి నియంతల పైశాచికత్వాన్ని పుణికిపుచ్చుకొన్న నెతన్యాహూ సారథ్యంలోని ఇజ్రాయెల్ దళాలు నేడు జాతిహననానికి పాల్పడుతున్నాయి. గాజా నేలనంతా అవి నెత్తుటితో తడిపేస్తున్నాయి. 'విజయం సాధించేంత వరకు యుద్ధం చేస్తాం... మమ్మల్ని ఎవరూ ఆపలేరుంటూ నెతన్యాహూ ఘీంకరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం అవునన్నా కాదన్నా, కదనాన్ని కొనసాగించి తీరతామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి జబ్బచరుస్తున్నారు.
పసిపిల్లల నునులేత శరీరాలను నుజ్జునుజ్జు చేయడం యుద్ధమా? అమాయకులూ నిరాయుధులపైన భీకర బాంబుల వర్షం కురిపించడం ఆత్మరక్షణ కోసమా? తలదాచుకునేందుకు సురక్షిత స్థలమంటూ దేన్నీ మిగల్చకుండా లక్షల సంఖ్యలో జనాన్ని వేటాడటం- ఉగ్రవాదంపై పోరాటమా? కానేకాదు. మతఛాందస దురహంకారపూరితులైన ఇజ్రాయెలీ నాయకులు దురుద్దేశపూర్వకంగా చేస్తున్న హేయ నరమేధమిది!
పొతే, భారతదేశ విభజన తర్వాత భారత మంత్రివర్గంలో ప్రసంగిస్తూ, మిస్టర్ గాంధీ (ముస్లిమేతరు అయినప్పటికీ) హజ్రత్ అబూ బకర్ మరియు ఉమర్‌లకు నివాళులర్పించారు మరియు మీరు అబూ బకర్ మరియు ఉమర్‌లను అనుసరిస్తే, మీరు విజయవంతమైన పాలకులుగా నిరూపించబడతారని మంత్రులతో అన్నారు.
నేడు, ప్రియమైన దేశంలో ప్రతిచోటా అధర్మం రాజ్యమేలుతోంది, బంధుప్రీతి, క్రూరత్వం మరియు విమర్శకుల నుండి క్రూరత్వం, నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, హత్య, దొంగతనం, లంచం మరియు దోపిడీ. రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక అస్థిరత పెచ్చుమీరిపోతున్నది.
లోకంలోని సమస్త శాస్త్రాలు, విజ్ఞానాలు బోధిస్తున్నది ఒక్కటే అదే సుపరిపాలన. దీని కోసమే ప్రాణాలను తృణప్రాయంగా ఆర్పించిన మహనీయులెందరో గత చరిత్రలో దర్శనమిస్తారు. సృష్టి శ్రేష్ఠునిగా పుట్టిన మనిషికి ప్రజలను పాలించే అధికారం దక్కడం గొప్ప అదృష్టం. ఇలాంటి అదృష్టాన్ని తుచ్ఛమైన సుఖాలకోసం, శాశ్వతంగాని సంపదల కోసం, మరణానంతరం వెంటరాని ఆస్తుల కోసం పాలకులు పెడదారులు పట్టడం సరికాదు. మనిషి నూరేళ్లు బతికితే గొప్ప. అందులో సగం జీవితం ఆక్రమార్జనలకు, అశాంతిమయ జీవనానికీ వెచ్చిస్తే బతుకుకు అర్థం ఉండదు. పాలకులు కడిగిన ముత్యాల్లాగా కల్మషం అంటకుండా నీతిమంతంగా బతకాలి!
న్యాయ రహిత సమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవన సమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థం జేసుకొనే చైతన్యం వుండదు. అసమానతల వల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అన్యాయ వ్యవస్థే. విద్యావంతులైనవారే ఇటువంటి మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో అర్థం లేదు.
దండనీతి!
మెలకువతో దండనీతిని అనుసరించాలి. ప్రజలందరినీ రాజు సమానంగా చూసుకోవాలి. అందరిపట్ల దయ కలిగి ఉండాలి. కేవలం శాంతిమంతుడుగా కూడా ఉండకూడదు. పాలకుడు అతి మృదువుగా ఉంటే మావటివాడు ఏనుగును ఎక్కినట్టు దిగువ ఉద్యోగులూ, ప్రజలూ నెత్తికెక్కి కూర్చుంటారు. క్రూరుడైతే అందరూ తిడతారు. కనుక వసంతకాలపు సూర్యుడిలా తగిన మార్దవం, కాఠిన్యం కూడా చూపించాలి. రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యం. దండించేటప్పుడు జాగ్రత్తగా విచారించి మరీ శిక్షించాలి. తన ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు నొప్పి కలిగించకూడదు. బిడ్డను కనబోయే తల్లి తన సంతానానికి అనువైన ఆహారం తిన్నట్టే రాజు కూడా తొందరపడక ప్రజలకెలా అనుకూలమో అలా నడుచుకోవాలి.
రాజన్నవాడు బలహీనుల బలం కావాలి. అనాథలకు అండగా నిలవాలి. అంధులకు కంటిచూపు కావాలి. నడవలేనివారికి నడిచే కాళ్లు కావాలి. సూర్యుడు భూమి నుంచి జీవరసాయనాన్ని గ్రహించి వేనవేల బాహువులతో మళ్లీ ఎలా దాన్ని సువృష్టిగా నేలమీద కురిపిస్తాడో, అలాగే ప్రభువు కూడా ప్రజల సంపదల్లో తమవంతు భాగాన్ని న్యాయంగా స్వీకరిస్తూ అంతకంటే ఎక్కువగా ప్రజలకు మేలు కలిగించాలి. బడుగు ప్రజలను నిరంతరం ఆదుకోవాలనుకునే రాజు ధనం, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకోవాలి. ప్రజల జీవనోపాధి కుంటుపడకుండా జాగ్రత్త పడాలి.
పాలకులు మంచివాళ్లయితే రుతువులన్నీ సక్రమంగా వాటి ధర్మాలను నిర్వర్తించేలా అల్లాహ్ ఆదేశిస్తాడు. భూమి సమృద్ధిగా పంటలనిస్తుంది. మనుషులు సుఖసంతోషాలతో ఉంటారు. పూర్ణాయుష్కులవుతారు. పాలకులు దుర్మార్గులూ, దుష్టులూ అయితే అల్లాహ్ ఆనతో ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది. రుతువులు వాటి ధర్మాలను విడిచి పెడతాయి. వర్షాలు ఉండవు. పంటలు పండవు. మనుషులందరూ ఆకలిదప్పులతో, అనారోగ్యంతో ఈసురోమంటూ ఉంటారు.
ధనాగారాన్ని వృద్ధి చేసుకునే విధానాలేమిటో నిరంతరం పాలకులు అన్వేషిస్తుండాలి. అయితే, మనకు తిండిగింజలు ఎలా వస్తున్నాయో, ఈ నేలను ఎవరు దున్నుతున్నారో, ఈ మట్టిని ఎవరు బంగారం చేస్తున్నారో, మనకూ మన ప్రజలకూ ఎవరు ప్రతిపూటా పట్టెడన్నం పెడుతూ ప్రాణదానం చేస్తున్నారో వాళ్లపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ముఖ్యంగా కర్షకులు, కార్మికులు, వర్తకులు, గోరక్షకుల నుంచే రాజుకు ధనం లభిస్తుంది. ధనధాన్యాలకు ఉత్పత్తి స్థానాలు వారు. వాళ్లను పీడించకూడదు. వాళ్లకు హాని కలిగించకూడదు. వాళ్లు పొలాల్నీ, నదుల్నీ, అడవుల్నీ, ప్రకృతిని నమ్ముకుని బతుకుతూ, మనల్ని బతికిస్తున్నారు. వాళ్లను దయతో చూడాలి. అధికారం ఉన్నది కదా అని మన బలాన్ని సంపదలను చూసి మిడిసి పడకూడదు. రైతులు లోకబాంధవులు. వాళ్లకు నాగలి, కాడి, ఎడ్లు, బండ్లు ఉచితంగా ఇవ్వాలి. సకాలంలో వానలు కురవక పంటలకు నీరు అందక పోయినా, వానలు మిక్కుటమై వాగులూ వంకలూ పొంగి పంటచేలన్నీ నీట మునిగినా, ప్రకృతి కన్నెర్ర చేసినా.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడే పాలకులు ప్రజలకు అండగా నిలబడాలి.

No comments:
Post a Comment