కాలం సాక్షి! మానవుడు ఘోరంగా నష్టపోయాడు. అయితే సత్యాన్ని విశ్వసించి (తదనుగుణంగా) సత్కార్యాలు చేస్తూ, సత్యం, సహనాలను గురించి పరస్పరం ఉపదేశించుకునేవారు మటుకు ఏమాతం నష్టపోరు. (అస్ర్: 1-3)
క్షణాలు, నిమిషాలు, గంటలు, పూటలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు.... యుగాలు, కల్పాలు- ఇలా కాలం అనేక రూపాల్లో కనిపిస్తుంది. కాలం పరిణామశీలం. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని పుట్టుకలకు, అన్ని బతుకులకు, అన్ని ప్రశయాలకు కాలమే సమాధానం. కాలమే మూలం.
మనిషి మహా ఆత్రగాడు
మనిషి కాలం కలిసి వచ్చినప్పుడు, లాభం కలిగినప్పుడు మంచి కాలమనీ, కష్టం వచ్చినప్పుడు చెడు కాలం అని, కాలాన్ని నిర్వచిస్తూ ఉంటాడు. ఇది అతని నైజం! ఎవరు ఏమనుకున్నా, కాలం తన పని తాను చేసుకొంటూపోతూనే ఉంటుంది.
మానవునికి మేమేదైనా అనుగ్రహిస్తే అతను మాకు విముఖుడయి పోతాడు. పైగా అహంకారంతో విర్రవీగుతాడు. కాని అదే కష్టమొచ్చినప్పుడు సుదీర్ఘప్రార్థనలు చేస్తాడు. (హా మీమ్: 51)
మానవుడు సహనం లేనివాడుగా సృజించబడ్డాడు. ఏదైనా కాస్త ఆపద వస్తే చాలు, కంగారుపడిపోతాడు. సంపద ఒనగూడినప్పుడు పిసినారితనం వహిస్తాడు. (అల్-మారిజ్: 19-21)
మానవుడ్ని అతని ప్రభువు పరీక్షించే నిమిత్తం గౌరవం, ఇతర భాగ్యాలు ప్రసా దించినప్పుడు అతను (పొంగిపోయి) “నా ప్రభువు నన్ను గౌరవనీయుడిగా చేశాడు” అంటాడు. (మరో విధమైన) పరీక్ష నిమిత్తం లేమికి గురిచేసినప్పుడు అతను (నిరాశతో క్రుంగిపోయి) “నా ప్రభువు నన్ను అవమానం పాల్జేశాడు” అంటాడు. (మానవుడు గౌరవ ప్రతిష్ఠలకు సిరిసంపదలే కొలమానం అనుకుంటున్నాడు). ఎంతమాత్రం కాదు. (ఫజ్ర్: 15-16)
మానవుడు (ముందుచూపు లేకుండా) మేలుకు బదులు కీడు కోరు కుంటున్నాడు. అతను నిజంగా చాలా తొందరపాటు కలవాడు. (బనీ ఇస్రాయీల్: 11)
యదార్థం ఏమిటంటే...
(సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆమాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షిం చడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈవిధంగా చేశాడు. అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్ ఇమ్రాన్: 139-141)
అమూల్య వరాలు అమ్మానాన్నలు
మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు. ఇష్టపడినప్పుడు వసంతం రాదు. చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించదు. ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. తల్లిదండ్రుల జీవితం పిల్లల జననంతోనే అంతమైపోతుంది. ఆపైన వాళ్లకంటూ ఒక జీవితం ఉండదు. పిల్లల జీవితమే వాళ్ల జీవితం. పిల్లల కోసమే కష్టపడతారు. పిల్లల కోసమే సంపాదిస్తారు. పిల్లల కడుపు నిండితే తమ కడుపు నిండిందని భావించి తృప్తిగా బతుకుతారు. కొందరు పిల్లలకు అది అలుసవుతుంది. చిన్నప్పటి నుంచి చనువిచ్చి ఉంటారు కనుక కొందరు పిల్లలకు చిన్నచూపు ఏర్పడుతుంది. ఎన్నోసార్లు నిస్సహాయంగా ఆధారపడుతారు కదా... అందుకని కొందరు పిల్లలకు అహంకారం వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం వహిస్తారు. కాలికి చేతికి అడ్డం అని భావించి ఏ వృద్ధాశ్రమంలోనో వదిలిపెడతారు. మరికొందరు దయ తలిచి దారి ఖర్చులు కలిసొస్తాయని ఏకంగా వల్లకాటిలోనే వదిలిపెడతారు. ధర్మాత్ముని కంట కన్నీరు రాలిన చోట క్షామం పుడుతుందట. కాదు - తల్లిదండ్రుల కంట కన్నీరు ఒలికిన చోట కాటకం పుడుతుంది. కరువు కబళిస్తుంది. అశాంతి చెరలేగి జాతినే ముంచెత్తుతుంది. ఇది తెలుసుకునేది ఎంతమంది. గంటల తరబడి చాటింగ్లో.. డేటింగ్లో.. ప్లబ్బుల్లో .. క్లబ్బుల్లో.. టిక్ టాక్ మొదలయిన సామాజిక మాధ్యమాలలో గడిపే నేటి తరంలో - అమ్మా... అన్నం తిన్నావా అని రోజుకు ఒకసారైనా ప్రేమగా పలకరించే సంతానం ఎంతమంది? నాన్నా... నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శించే పుత్రోత్తములు ఎంత మంది?
నేటి తరం వైఖరి ఎలా ఉందంటే, ఇప్పుడు మాకూ రెక్కలొచ్చాయి... భర్తలు/భార్యలు వచ్చారు.... పిల్లలు పుట్టారు... మా గొడవ మేం చూసుకోవడానికే సమయం సరిపోవట్లేదు... ఇంక ఈ ముసలి బతుకులతో ఎలా వేగేది? అని తడబడకుండానే అనేస్తుండటం మనం గమనిస్తాం. ఇలా అనే సంతానానికి ఎన్ని బెత్తం దెబ్బలు కొట్టాలి? ఎన్ని బడితె పూజలు చేయించాలి? పక్కిల్లే అత్తవారిల్లు. పక్కింట్లో ఉంటూనే - పదిహేను రోజులు - భార్య మరణించి ఏ దిక్కూ లేని నాన్నకు పట్టెడన్నం పెట్ట బుద్ది కలగని పాడుబుద్ధి సంతానానికి వారి మరణానంతరం ఏడ్చే హక్కుంటుందా? ప్రపంచాన్నే తృణప్రాయంగా భావించి పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇచ్చే అమ్మానాన్న ఎక్కడ? నెలకి ఇంతని విసిరేసి ప్రపంచాన్నే తల్లిదండ్రులకు ధారబోశాము అని విర్రవీగే వికృత సంతానమెక్కడ?
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
అని పెద్దలన్న మాట ఎంత నిజం!
నిరాశ కూడదు
ఇక జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది. పొందినప్పుడు కాదు. వచ్చినవి. పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాం. అవకాశాలు తమంతటతాముగా మన చెంత చేరవు. వాటి కోసం అన్వేషించాలి. తపించాలి. శ్రమించాలి. అందిన అవకాశాలను చేజిక్కించుకుని కార్యనిర్వహణలో విజయం సాధించాలి.
అవకాశాలు కలిసిరావడానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడు అంటే ఎవరో కాదు. కిందపడ్డ ప్రతీసారి లేచి నిలబడేవాడు. ఎదురుదెబ్బలు, కష్టనష్టాలు, అవరోధాలు- జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ప్రతీ సమస్య వెనకా ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందడుగు వేస్తాడు.
చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోందని, అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని, కొందరు మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుంది. అల్లాహ్ కు ఎవరిమీదా పక్షపాతం ఉండదు. ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారు. కష్టే ఫలి. -
(అతనికి చెప్పు: పాప)భారం మోసేవాడెవడూ ఇతరుల (పాప)భారం మోయలేడు. (33-38) మానవుడు దేని కోసం కృషిచేస్తాడో అదే అతనికి లభిస్తుంది. అతని కృషికి త్వర లోనే గుర్తింపు లభిస్తుంది. అతనికి దాని ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది. (నజ్మ్: 39-40)
సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా ఏ తీరం దొరకని ఈ పయనం ఎంత దూరమో.... ఎంత కాలమో... ఎలా ఇలా ఆగడం ఇలా ఎలా సాగటం అని నిరాశ చెందనవసరం లేదు \నిస్పృహకు లోనవ్వాల్సిన పనీ లేదు.
ప్రవక్త (స) విధేయతే పరమావధి
ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్త వ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికీ తప్పక అల్లాహ్ సహాయం తోడవుతుంది. అప్పుడు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థప్రయోజనాలకు కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవకార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి.
అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) - దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత ప్రజలే తమ వద్దకు రావాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి అని ఉన్న చోట కూర్చొని ఎదురు చూడలేదు. కనిపించే వ్యక్తిని ఆయన ప్రేమగా పలుకరించారు. అగుపడ్డ ప్రతి తెగ, బృందం వద్దకు వారు పిలువక పోయినా తానే వెళ్లారు. అలా ఆయనోసారి భోంచేస్తున్నారు - అటుగా ఓ బృందంగా వెళ్లడం ఆయన గమనించారు. ఆహరం వదిలేసి బిరబిరా వారి వెనక వెళ్ళసాగారు, అది గమనించిన సతీమణి - స్వామీ! ప్రశాంతంగా భోజనం పూర్తి చేసుకొని వెళ్ళొచ్చుగా అని చెప్పగా - ఓ నా ప్రాణ సఖీ! రేపు ప్రళయ దినాన - అల్లాహ్, నీ గుమ్మం ముందు నుండే ఓ బృందం వెళ్ళింది - నువ్వెందుకు వారికి ధర్మ సందేశాన్ని అందజేయలేదు అని అని నిలదీస్తే నేనేమని జవాబివ్వాలి? - అలా ఆయన లోక కల్యాణాన్ని, ప్రజా శ్రేయాన్ని విపరీతంగా కోరుకున్నారు గనుకనే - ఆయన అనుకున్నది సాధించుకోగలిగారు, దానికి పూర్తి అల్లాహ్ మద్దతూ లభించింది.
మనమూ దారి గుండా వెళుతుంటాము. గోడ మీద వ్రాయబడి ఓ మంచి మాట మనల్ని ప్రేరేపిస్తుంది. అంతెందుకు - పల్లీలు తిన్నాక అవి చుట్టిన పొట్లంలోని పలుకులు మనల్ని ఆకట్టుకుంటాయి. మనకు మంచి చేయాలన్న సంకల్పం ఉండాలే గాని మార్గాలు అనేకం ముందుంటాయి. మనం వ్రాసిన ఓక మంచి వ్యాసం కావచ్చు, పంచిన ఓ మంచి కరపత్రం కావచ్చు - అది చదివిన వెయ్యి మందిలో ఒకరిద్దరూ ప్రేరణ పొందినా దానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. మహనీయ ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు; "నీ మూలంగా అల్లాహ్ ఒకే ఒక్క వ్యక్తిని సన్మార్గం చూపినా - అది నీ పాలిట ప్రపంచ సకల సంపదలకంటే ఎంతో ఉన్నతమైనది" (తబ్రానీ)
వారికిలా చెప్పు: “మీరు నిజంగా అల్లాహ్ ను ప్రేమిస్తుంటే నన్ను అనుసరించండి; అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు; మీ పాపాలు క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించే వాడు, కరుణించేవాడు. (ఆల్ ఇమ్రాన్: 31)
” వారికి (ఈ సంగతి కూడా) చెప్పు: “ఆలాహ్ కు , దైవప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ మీరు (నిర్లక్ష్యంతో) ముఖం తిప్పుకుంటే గుర్తుంచుకోండి- ప్రవక్తపై మోపబడిన బాధ్యతకు ప్రవక్త బాధ్యుడవుతాడు. కాని మీపై ఉన్న బాధ్యతకు మీరే బాధ్యులవుతారు ( నూర్: 53-54)
ఆత్మావలోకన సమయం ఆసన్నమయ్యింది
"ఈ 364 రోజులు మనం ఏమైపోయాము? ఉన్నట్టుండి నూతన సంవసర సంబరాలు అంబరాన్ని అంటడం దేన్నీ సూచిస్తోంది? మనలోని ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. చనిపోయాక ఏం జరుగుతుందనే విషయం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు. కానీ నిజంగా మనం దీన్ని ఎంత తీవ్రంగా తెలుసుకోవాలను కుంటున్నాము? ‘మరణం తర్వాత ఏమవుతుంది? మన సృష్టికి మూలం ఏమిటి?’, కారణం ఏమిటి? అన్న ప్రశలన్నింటికీ ఇస్లాం చక్కటి సమాధానం ఇచ్చింది. మరి ఏళ్ళు గడిచిపోతున్నా - మన ముందరే మన ఆప్తులయిన ఎందరో కాటికి ఏగుతున్నా మనం మాత్రం చలనం లేని పాషాణాలుగా మారి ఎదో బతుకుతున్నామంటే బతుకుతున్నామన్నట్టు యాంత్రికంగా బతికేస్తున్నాము. ఆ విషయానికొస్తే కొన్ని సందర్భాలలో రాళ్లు కూడా కరుగుతాయి కానీ మనం కరగడం లేదు, మరగ కాచిన నూనెలో పడేసి వేంచేస్తేగాని మార్పు రాదన్నట్లుంది మన వ్యవహారం.
అయితే అంతటి గొప్ప మహిమ చూసినా మీలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా మీ హృదయాలు పాషాణాల్లా కఠినమైపోయాయి. కాదు, అంతకంటే కూడా కఠినమయి పోయాయి. పాషాణాలలో కొన్నిటి నుంచి నీటిఊటలు ఉబికి వస్తాయి. మరికొన్ని పగిలి పోయి వాటి నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఇంకా కొన్ని రాళ్ళయితే అల్లాహ్ భీతితో కంపించి క్రింద పడిపోతాయి. అల్లాహ్ మీ చేష్టలను గమనించడం లేదని భావించకండి. (బఖరః - 74)
దేని కోసం ఎదురు చూస్తున్నాము?
“కనుక అల్లాహ్ (మార్గం) వైపునకు పరుగెత్తండి. నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చిన సందేశహరుడ్ని. (జారియాత్: 50)
మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గసీమ వైపుక్కూడా పరుగెత్తండి. అది భయభక్తులు కలవారి కోసం సిద్ధం చేయబడి ఉంది. (ఆల్ఇమ్రాన్: 133)
విశ్వాసులారా! రెండింతలు, నాల్గింతలు పెరిగే ఈ వడ్డీని తినడం ఇకనైనా మాను కోండి. అల్లాహ్ కు భయపడండి, మీ జీవితాలు సార్థకమవుతాయి. సత్యతిరస్కారుల కోసం సిద్ధం చేయబడిన నరకాగ్ని నుండి తప్పించుకోండి. అల్లాహ్ కు , ఆయన ప్రవక్తకు విధేయులయి ఉండండి, మీరు కరుణించబడతారు. (ఆల్ఇమ్రాన్130-132)
తాను మంచి చేయాలి అని అనుకునే వ్యక్తి దాని కోసం తొందర పడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారినయినా పడవచ్చు లేదా తన వాహనాన్ని అయినా పోగొట్టు కోవచ్చు. లేదా ఇంకా ఏదయినా ఆటంకం ఏర్పడవచ్చు.
విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు. మీరలా కాకూడదు సుమా! వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత అల్లాహ్ దానికి తిరిగి జీవంపోస్తున్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మా సూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (హదీద్: 16-17)
ముందస్తు ప్రణాళిక ముఖ్యం
మనం ఏ పని చెయ్యాలన్నా రేపటి పని ఈ రోజు చెయ్యి. ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి అని చెప్తూ వుంటాం. అలాగే సమయాభావాన్ని కూడా పాటించితే మనం ఎన్నో సమస్యలనుండి బయట పడగలం. విద్యార్థులు "పరీక్షలు ఇంకా చాలా రోజులు ఉన్నాయిగా ఇప్పటినుండే ఎందుకు చదవడం? తీరా పరీక్షల సమయంలో చదివిందంతా మరిచి పోతాం" అంటూ చివరి రోజు వరకు పుస్తకం తియ్యరు. తీరా చూస్తే అప్పడు ఏ జ్వరమో ఇంకేదో సమస్య వచ్చి పరీక్షలు సరిగ్గా వ్రాయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు.
మనం ఏ పని చెయ్యాలన్నా రేపటి పని ఈ రోజు చెయ్యి. ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి అని చెప్తూ వుంటాం. అలాగే సమయాభావాన్ని కూడా పాటించితే మనం ఎన్నో సమస్యలనుండి బయట పడగలం. విద్యార్థులు "పరీక్షలు ఇంకా చాలా రోజులు ఉన్నాయిగా ఇప్పటినుండే ఎందుకు చదవడం? తీరా పరీక్షల టైమ్లో చదివిందంతా మరిచి పోతాం" అంటూ చివరి రోజు వరకు పుస్తకం తియ్యరు. తీరాచూస్తే అప్పడు ఏ జ్వరమో ఇంకేదో సమస్య వచ్చి పరీక్షలు సరిగ్గా వ్రాయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు.
ఇక ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు చివరి క్షణం వరకు తయారవకుండా మొహం కడుక్కోవడం మొదలు అన్ని పనులు చివరి అరగంటలో చేసేసుకుంటే చాలు అనుకోవడం చూస్తూ వుంటాం. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళల్లో బీపీలు పెరిగిపోయే అవకాశం ఉంది. సమయానికి ఐడెంటిటీ కార్డ్ కనపడక పోవడం, బండిలో పెట్రోల్ లేదని గుర్తు రావడం, ఒకవేళ బస్సులో వెళ్ళేవారైతే ఆ రోజు బస్సు ఆలస్యం అవడం జరిగితే వారి ప్రోగ్రాం అస్తవ్యస్తం అవుతూ వుంటుంది..
ఇంకా దూర ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ట్రైన్, ప్లేన్ బయలు దేరేది మూడు గంటల తర్వాత ఇప్పుడే స్టేషన్లో ఎయిర్పోర్ట్ లో ఎందుకు వేలాడి పోవడం ? అని పనులు మెల్లి మెల్లిగా చేసుకుంటూ ఉంటారు. స్నానాలు త్వరగా ముగించరు. బట్టలు సర్దుకోరు. అసలు ఏ పెట్టిలో బట్టలు పెట్టుకోవాలో లగేజ్ ఎంత తీసుకెళ్ళాలో కూడా చివరి వరకు ప్లాన్ చేసేవాళ్ళు ఉండరు. చివరకు మనం ఎక్కిన క్యాబ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని స్టేషన్కు మనం చేరి ఫ్లాట్ ఫారంలు దాటుకుంటూ వెతుక్కుని వెళ్లేసరికి ఫైన్ కదులుతూ ఉండటం జరుగుతుంది. ఎందుకు ఇలా ప్రయాస ప్రయాణం చేస్తున్నాం? ఒక గంట ముందే స్టేషన్లో ఉండేటట్టు చూసుకుంటే కొంప ఏం మునిగిపోతుంది? ఏదైనా జరగరానిది జరిగి ఏ కాళ్ళు విరక్కోవడమో జరిగితే ఎలా? ఒక్కోసారి ఆలస్యం ప్రాణానికే ప్రమాదం అని తెలుసుకోవాలి. ఇంకెంత మంది పిల్లలతో బయలుదేరి ఎవరు లోపలికి ఎక్కారో ఏ పెట్టిలో ఎక్కారో తెలియని అయోమయ పరిస్తితి.
ఆలస్యం అమృతం విషం
కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనే కొంతమంది తల్లితండ్రులు కూడా పిల్లల పెళ్లికళ్ళ విషయంలో తాత్సారం చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఎం తొందరా? అని అలసత్వం చూపిస్తూ ఉంటారు.
పంట గానీ, ఫలం గానీ కోతకొచ్చిన తర్వాత కొయ్యక పొతే ఎలాగైతే ఎండ, వాన, గాలి, పురుగులు, పక్షులు దాన్ని పాడు చేసేస్తాయో - పెళ్లీడుకొచ్చిన అమ్మాయినిగాని, అబ్బాయినిగాని సమయానికి పెళ్లి చేయకపోతే - అంతర్జాల రూపంలోనూ, మానవ రూపేణా మృగాల రూపంలోనూ కాళనాగులు అనేకం కాటేసేందుకు కాచుకొని ఉంటాయన్న ఎరుక నేటి తల్లిదండ్రులకు ఎంతో అవసరం.
ప్రవక్త (స) ఇలా హెచ్చిరించారు: మీకు నచ్చిన ధర్మపరాయణత, మీరు మెచ్చిన ఉత్తమ గుణగణాలు గల వ్యక్తి - మీ వద్దకు పెళ్లి సంబంధం తీసుకొస్తే అతనికి లేదా ఆమెకి ఇచ్చి పెళ్లి చేసేయండి. మీరు అలా చేయకపోతే, భూమిపై కలహాలు మరియు విస్తృతమైన ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి. (తిర్మిజీ)
ఇంకొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదనలో పడి ముందు ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చుకున్నాకనే ఆ విషయం ఆలోచిద్దాం అనుకునే వారూ ఉంటారు. అటువంటి వారిలో ఒక కారు, ఇల్లు కూడా పెళ్ళికి ముందే ఉండాలని అనుకోవడం ఇప్పుడు చాలా మంది విషయంలో జరుగుతోంది.
ప్రవక్త (స్) ఇలా హితవు పలికారు: యువకుల్లారా! శక్తి గల వారు వెంటనే వివాహం చేసుకోవాలి. అది చూపులను చెడు నుండి ఆపుతుంది, శీలాన్ని కాపాడుతుంది. లైంగిక వాంఛను అదుపులో ఉంచుతుంది. (బుఖారీ, ముస్లిం)
ఇక నూతన దంపతులు పిల్లల విషయంలో "మేము ఇప్పుడే వద్దనుకుంటున్నాం" అంటూ కొన్నాళ్ళు జాలీగా గడిపేస్తారు. ఆ తర్వాత పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుండే వాళ్ళను చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఇలా కొన్నాళు? గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా జీవక్రియలో మార్పులు వచ్చి సంతానోత్పత్తికి సంబంధించిన కణాలు తగ్గుతూ వచ్చి పిల్లలు కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి అని కొన్ని సర్వేలు చెపుతున్నాయి..
వయసు మీద పడిన వారికో హెచ్చరిక
45, అరవై సంవత్సరాలు దాటిన వారికి స్త్రీ అయినా పురుషులైనా ఎనో ఒక ఖనారోగ్య సమస్య తప్పడం లేదు. అయితే చాలా మంది వాటిని సీరియస్సుగా తీసుకోక మెడికల్ షాపుల కెళ్ళి వాళిచ్చిన మందులతో కాలక్షేపం చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం అ వి చాలా సార్లు వికటించి వేరే రోగాలకు దారి తీయడమో లేదా ఉన్న రోగాల తీవ్రతను మరింత పెంచడం జరుగుతూ వుంటుంది. అలాగే ట్రైనింగ్ దశలో ఉన్న మేల్ లేదా ఫిమేల్ నర్సు సలహాలు కూడా చాలా మంది పాటించి ప్రాణాల మీదికి తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక వయసు వచ్చిన వారికి ఏదో రకంగా ఇన్సూరెన్స్ ఉండటం జరుగుతున్నదే. అటువంటి వారు సంవత్సరానికి ఒకసారి పూర్తి మాస్టర్ చెక్ అప్ చేయించుకుంటే రాబోయే రుగ్మతలను అరికట్టడం విషయంలో కాని, ఉన్న రోగాలను కనిపెట్టి సకాలంలో వాటికి వారణోపాయాలను చూపే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏదైనా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందన్న సామెత చాలా విషయాలలో వర్తిస్తుంది.
తొందరపాటు మంచిది కాదు
మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు. 'ఆలస్యం అమృతం విషం' అని, 'నిదానమే ప్రధానం' అని... నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి లక్షణం. తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.
తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలూ జరుగుతుంటాయి. ప్రధానంగా కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు. ఏ పని ముందు, ఏ పని తరవాత అని ప్రశ్నించుకుంటూ ప్రవర్తించడమే రాజనీతి లక్షణం.
చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే. కొన్ని క్షణాలు ఆలోచించి 'ఇలా చేయడం అవసరమా?' అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు. ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి. ఆధ్యాత్మిక శక్తిగల సాధకుడు తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోడు. 'ఉరకకు, ఉరకకు మనసా, ఉరికితే దొరకదు హంస' అన్నారు. ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రంలాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలు పెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది. కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారి తీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందర పడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: "సహనం, నెమ్మది, హుందాగా వ్యవహరించడం అల్లాహ్ అనుగ్రహం. మరియు తొందరపాటు షైతాన్ తరఫు నుండి." (అబూ యాలా)
మంచి విషయాల్లో తొందర విషయం ఎలా ఉన్నా, చెడు విషయాలలో అసలు మంచిది కాదు. కొన్ని సందర్భాలలో మంచి విషయాలలో కూడా తొందర పాటు మంచిది కాదు. ఉదాహరణకు నమాజు, ఖురాన్ పారాయణం మొదలైనవి..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరంలో - మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవాలంటే - అల్లహ్ ఈ ఆదేశమే మనందరికీ శిరోధార్యం!
కనుక ప్రవక్తకు విధేయులయితేనే మీరు సన్మార్గం పొందుతారు. ప్రవక్త బాధ్యత (దైవసందేశాన్ని) స్పష్టంగా అందజేయడమే.” ( నూర్: 54)

No comments:
Post a Comment