నిజమైన మతధర్మ ప్రమాణాలు ఏమిటి?
భూమిపై ఎన్ని మతాలు, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో తెలుసా? వెబ్సైట్ (ది రిజిస్టర్) గణాంకాల ప్రకారం, వాటి సంఖ్య 4,300 మతాలు. యాదార్థమేమిటంటే, నిజం ఎప్పుడూ ఒక్కటే, అనేకం కాదు, కాజాలదు.
ఆయా మతస్థులను, ఆయా సిద్ధాంతాలను అనుసరించే వారిని - మీరు ఎందుకు ఈ బాటన నడుస్తున్నారు? అడిగితె దానికి అందరూ ఇచ్చే సమాధానం మేము మా తాతముత్తాతలు ఒక సంప్రదాయం పాటిస్తుండగా చూశాం గనక, మేము వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటున్నాము అని. దానికి ఆధారంగా ప్రామాణికత లేని కొన్ని కథలను, మత పెద్దల మాటలను, వార్తలను పేర్కొంటారు. వారిలాంటి మానవులే వ్రాసిన గ్రంథాలను,సూత్రీకరించిన సిద్ధాంతాలను గుడ్డిగా నమ్ముతారు. వారు నమ్మిన వాటినే తరతరాలుగా నమ్మ బలుకుతూ వస్తున్నారు.
అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండని అంటే “కాదు, మా తాత ముత్తాతలు అనుసరించినదాన్నే అనుసరిస్తాం” అంటారు వారు. మరి వారి తాతముత్తా తలు తెలివిహీనులైనా, సన్మార్గంలో లేకపోయినా (వారినే గుడ్డిగా అనుసరిస్తారా)? కాపరి పిలుపు తప్ప మరేపిలుపూ వినలేని పశువుల్లా వుంది (ఈ) తిరస్కారుల ధోరణి. వారు (సత్యం వినలేని) బధిరులు, (సత్యం పలకలేని) మూగలు, (సత్యం కానలేని) అంధులు. అందువల్ల వారికిక ఏ విషయమూ తలకెక్కదు. (అల్-బఖరహ్: 170-171)
ఇక్కడ ఇస్లాం ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుంది. సురక్షిత ఆకాశ గ్రంథం కలిగిన ఏకేశ్వరోపాసన (తౌహీద్వి) ధర్మం ఇస్లాం. ఖుర్ఆన్ మనిషి రచన కాదు. విషయ పరిజ్ఞానంలో స్థితప్రజ్ఞులయినవారు ఈ గ్రంథాన్ని వంశపారంపర్యంగా వారి హృదయాలలో భద్ర పరచుకుంటూ, మొత్తం ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసుకుంటూ వస్తున్నారు. ఇది గ్రంథ రూపమలోనూ లిఖించ బడి సురక్షితంగా ఉంది, అలాగే కోట్లాది ప్రజల హృదయాలలో సురక్షితంగా ఉంది. అదే విధంగా ప్రవక్త (స) ప్రబోధనలు మరియు ఖుర్ఆన్ వచనాలు మధ్య స్పష్టమైన తేడాను గమనిస్తారు. ప్రపంచంలో పవిత్ర గ్రంథం ,అని చెప్పబడే ఏ ఇతర గ్రంధమైనా, ఒక్క ఖుర్ఆన్ గ్రంథాన్ని మినహాయించి - మార్పుచేర్పులకు గురి కాకుండా ఉందా? మొదటి అక్షరం మొదలు చివరి అక్షరం వరకూ కోట్లాది ప్రజలచే కంఠస్థం చేయబడి ఉందా? తన మత ప్రవక్త ద్వారా పూర్తి ప్రమాణాలతో సహా రూఢీ అయిన, ఎలాంటి సందేహాలకు, సంకోచాలు, సంశయాలకు, శంకలకు తావు లేని ధర్మం ఒక్క ఇస్లాం తప్ప ఈ భూమండలం మీద మరేదైనా ఉందా?
సత్యధర్మాన్ని స్పష్ట పరిచే కొన్ని ప్రమాణాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము. ఏ ఇద్దరు బుద్ధిమంతులు ఈ విషయాలను వ్యతిరేకించరు.
సత్యధర్మం: దాని మూలం ఖచ్చితంగా ప్రజలందరి సృష్టికర్త తరఫు నుండి అయి ఉండాలి. ఆయనే స్వయంగా ప్రజలను తనను మాత్రమే ఆరాధించాలని చెప్పి ఉండాలి. తమ నిజ సృష్టికర్తతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు దానిని ప్రతిపాదించడానికి వీలు లేదు. ఒకవేళ మనిషిని ఒక యంత్రంతో పోల్చితే - ఆ యంత్రకర్తకే కదా దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుంది? ఆ విధంగా మనిషిని చేసిన ఆ నిజ రూపకర్తయే సత్యధర్మ దాత, నిర్మాత. ఆ రకంగా ఇస్లాం మాత్రమే సత్యధర్మము. ఎందుకంటే, ప్రజలకు సంబంధించి ప్రాపంచిక వ్యవహారాలైనా,పారలౌకిక విషయాలైనా అన్నింటిని చక్కబెట్టడానికి వారిని పుట్టించిన వారి ప్రభువు వారికి మహాద్భుతమైన ఓ గ్రంథరాజాన్ని ప్రసాధించాడు గనక. అదే పవిత్ర ఖుర్ఆన్.
సత్యధర్మం : ఎలాంటి ప్రక్షిప్తాలకు, మార్పుచేర్పులకు, పరస్పర విరుద్ధ విషయాలకు, లోటుపాట్లకు ఆస్కారం లేని, అసంపూర్ణ అంశాలకు తావు లేని, తావు ఇవ్వనిధై ఉంటుంది.
ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతు అధ్యయనం చెయ్యరా? ఒకవేళ ఇది అల్లాహ్ నుండి గాకుండా మరెవరి నుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది కదా! (అన్-నిసా: 82)
సత్యధర్మం: ఇసుమంత శంకకు, పిసరంత సందేహానికి తావు ఇవ్వని సత్య ప్రమాణాల మీద, బలమైన ఆధారాల మీద నిర్మితమై ఉంటుంది. అది తన పట్ల మనిషి నమ్మకాన్ని మరింత దృఢతరం చేస్తుందే గానే, సంశయాల సుడిగుండంలో నెట్టేసి, నట్టేటా ముంచేయదు. మనిషిని అతని మానాన వదిలేయదు. స్వచ్ఛమైన బుద్ధి దాని ప్రతి విషయంతో ఏకీభవిస్తుందే గానీ, విభేదించదు, వ్యతిరేకించదు. మీమాట నిజమైతే దానికి ప్రమాణం తీసుకురండి” అని అడుగు. (అల్-బఖరా: 111) అంటూ మాట సత్యతకు ప్రామాణికతను కోరుతుంది ఇస్లాం.
సత్యధర్మం: అది ప్రజలందరి ధర్మం. అది జాతిని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్నిబట్టి, రంగును బట్టి, రూపును బట్టి వేరువేరుగా ఉండదు. అది కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకు, మతపీష్వాలకు, భిక్షువులకు, పాస్టర్లు, ఫాదర్లకు మాత్రమే తెలిసిన రహస్యాల మీద ఆధార పడిన మతధర్మమై ఉండదు. ఎలాంటి మధ్యవర్తిత్వం, ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా మిమ్మల్ని మీ నిజ ప్రభువుతో జోడించే ధర్మమే సత్యధర్మం. కొందరు ముస్లింలలో కానవచ్చే దర్గాల దుష్కృతికి ఇస్లాం సత్య ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు. కూటి కోసం కోటి విద్యల్లో ఇదో ముదనష్టపు విద్య అంతే.
సత్యధర్మం: తన గ్రంథాన్ని వక్రీకరణల పాలు చెయ్యదు. దాని మూలాన్ని పోగొట్టుకోదు. భూ ప్రపంచంలో ఒక్క ఇస్లాం తప్ప తన పవిత్ర గ్రంథాన్ని వక్రీకరించకుండా కాపాడిన మతధర్మం మరొకటి లేదు.
సత్యధర్మం: అది న్యాయశీల ధర్మం. అది ప్రజల ధన, మాన, ప్రాణాలను, హక్కులను కాపాడుతుంది. అది సామాజిక న్యాయాన్ని నిజం చేసి చూపిస్తుంది. శిక్షా బహుమానాలు ద్వారా అది న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
సత్యధర్మం: అది సంపూర్ణ జీవన సంవిధానం. జీవితానికి సంబంధించిన అన్ని రంగాలను, అన్ని అంగాలను తనలో విలీన పరుచుకొని ఉంటుంది. అది మనిషి భౌతిక, ఆధ్యాత్మిక సకల అవసరాలను తీరుస్తుంది. అది దేశకాలాలకు అతీతంగా జాతులన్నింటికీ, సముదాయాలన్నింటికీ ప్రయోజనకరమైనది. అందరూ సులభంగా పాటించగలిగే ధర్మం.
సత్యధర్మం: సద్గుణాలను బోధిస్తుంది, దుర్గుణాలను నిరోధిస్తుంది.
సత్యధర్మం: శాస్త్రీయ పరిజ్ఞానాన్ని (సైన్స్)ను సమర్థిస్తుంది. తరతరాల చరిత్ర పరిణామంలో - చోటు చేసుకున్న శాస్త్రీయ పరిశోధలను ఖుర్ఆన్ లోని వచనాల ద్వారా లోకమే నివ్వరబోయేలా అది ధృవీకరించింది.
సత్యధర్మం: అది ప్రపంచ ప్రజల మధ్య చాలా వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే మతధర్మం ఇస్లాం.
No comments:
Post a Comment