మానవులారా! మీ ఆరాధ్యదైవం ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడయిన ఆ దేవుడు తప్ప (మీకు) మరో సత్య దేవుడు లేనేలేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ళ చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుంచి కురిపించే వర్షపునీటిలో, తద్వారా ఆయన మృతభూమికి జీవంపోసే (చెట్లూ చామల్ని పచ్చదనంచేసే) పనిలో, పుడమిపై పలువిధాల జీవరాసుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో, గాలుల సంచారంలో, నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని ఆస్తిత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని తెలిపే) అనేకనేక నిదర్శనాలు ఉన్నాయి. (బకరః : 163-164)
గల గల పారే సెలయేరులు మిల మీల మెరిసే తారకలు అందమైన పూదోటలు హాయిగొలిపే పిల్ల తెమ్మెరలు ఎగసిపడే కడలి కెరటాలు సాగిపోయే నీలిమేఘాలు కోయిల పాటల వసంతాలు మట్టి వాసనల వర్షాలు కొండల్లో దూకే జలపాతాలు కోనల్లో దాగే అందాలు ప్రకృతే భూలోక స్వర్గ సీమ. అదే విశ్వ సృష్టికర్త ఉనికిని తెలియజేసే అసలు చిరునామా!
ప్రకృతి ఎప్పుడు వృధాగా ఉండదు. అది దాని ఉనికినిలోనికి వచ్చిన వాటి ని గురించిన సత్యాన్ని, మంచితనాన్ని, సౌందర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతిరోజు ప్రకృతి దేవుని మహిమను నూతనంగా, తాజాగా ప్రకటిస్తుంది. ఆ సృష్టి అందాన్ని రూపించిన సృష్టికర్తను చూస్తున్నామా, లేదా ఊరికనే అలా చూసి దాటి పోతున్నామా ?
సృష్టి పరిమళాలు నాసికలకు తగిలినప్పుడు, ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు - సబ్హానల్లాహ్, అల్హందు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ - అల్లాహు అక్బర్ అన్న స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే!. సొగసులు పరిమళించే పువ్వు యొక్క తేజస్సును, లేలేత కిరణాలతో మెరుస్తున్న సూర్యోదయ వైభవాన్ని, ఎగిసిపడుతున్న ధ్వని రాగాల సముద్ర కెరటాలను, పక్షుల కువకువలను, ఆకాశాన్ని తాకే చెట్ల వంటి అపురూపాలను మనం చూసినప్పుడు మన హృదయం ఆరాధనాతో నిండిపోవాలి. కృతఙ్ఞతతో మన మాది పొంగిపొర్లాలి.
బొట్లుబొట్లుగా జారే నీటిబిందువులు, కరిగే మంచు ధారల కలయికలు ఏకమై, పర్వతాల దిగువ నున్న అందమైన జలపాతాలుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి, చిన్నచిన్న విషయాలలో కృతజ్ఞత మన రోజువారి జీవితంలో చూడగలిగితే మనం జీవించే జీవితకాలమంతా అల్లాహ్ సౌందర్యంగా అపురూపంగా చేయగలడు. ప్రతి విషయంలో అల్లాహ్ ను స్తుతించే భాగ్య జీవితాలుగా, పుణ్య ప్రాణులుగా ఆయన మనందరినీ స్థిరపరచి ఆశీర్వదించుగాక!
ఎండాకాలం అంటే కొందరికి మనసు నిండే కాలం. వైశాఖమంటే మండే ఎండలు, చల్లని నీళ్ళు. పల్లెటూళ్ళలో కొత్తావకాయ పచ్చళ్ళు,తాటాకు పందిళ్ళు, పెళ్ళి సందళ్ళు. పిల్లలకైతే వేసవి సెలవలు, అమ్మమ్మల వూళ్ళు, కొత్త ఆటలు, స్నేహాలు. ఎండల్లో ఆడొద్దని, వడదెబ్బని అమ్మ చెప్పినా రెట్టించిన ఉత్సాహం తో వీధుల్లోకి పరుగులు - నిజంగానే కొందరికి ఎండాకాలం అంటే మనసు నిండే కాలం.
కానీ - బయట ఎండలో - వయసు భారాన్ని లెక్కచేయని - ఇస్తిరి పెట్టి ముసలివాడు - బొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు. - ఎండ పేలిపోతున్న - కరు వ్యాపారుల బండి నీడ పట్టుకు కదలదు - శ్వాస ఆగిపోతున్న - బతుకు పోరాటం ఆగదు - చూపులు తిప్పుకుని - చల్లని వాకిళ్ళ వైపు చూస్తే చాలు - గడపలో నీటి కోసం పక్షులు, పిల్లులు, కాకులు, కుక్కలు పిడచగట్టుకుపోయిన నాలుకలతో అలసిసొలసి ఉండటం చూసి మనస్సును తరుక్కుపోతుంది. ..తేమ (ప్రాణం) ఉన్న ప్రతి జీవిలోనూ పుణ్యం ఉంటుంది అని పశు పక్ష్యాదులు పరమ శ్రేయోభిలాషి మాటలు జ్ఞప్తికి రాక మానవు. ”ఈ మూగ జీవాల విషయంలో అల్లాహ్‌కు భయ పడండి” అని మందలించారు. దాహంతో ఉన్న ఓ కుక్క దాహాన్ని తీర్చిన ఓ వ్యభిచారిణిని అల్లాహ్ మన్నించి స్వర్గాన్ని ప్రసాదించాడని, పిల్లిని చిత్రహింసలుపెట్టి చంపిన ఓ స్త్రీని అల్లాహ్ నరకం పాలు చేశాడు అని జంతువుల హక్కుల్ని ఎవరూ తెలియజేయనంత కరుణామయ పద్ధతిలో తెలియజేశారు కారుణ్యమూర్తి ముహమ్మద్ (స).
ఎండా కాలం అనగానే మనకు గుర్తుకొచ్చేది - ఐస్ గడ్డ. అవును మంచు గడ్డ మన జీవితం - మంచు గడ్డలు అమ్మే వ్యక్తి ఎం కోరుకుంటాడు. ఇది కరిగిపోక ముందే అమ్మేయ్యాలి, అమ్ముడుపోవాలి అనేగా... మన జీవితం కూడా అంతే. ఆరు ఋతువులతో, అన్ని సౌకర్యాలతో అలరారినా - అంతంత మాత్రపు అవసరాలతో అతలాకుతల్మయినా - మనము రాజైనా, రౌతైనా, రైతైనా ఎదోకరోజు అందమైన మన ఈ జీవితం మనం ఎంత వద్దనుకున్నా అంతమయిపోక మానదు.
జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది / గువ్వల్లే బతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చిపెడుతుందని / తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది
మనిషి చిత్తం బహు విచిత్రమయినది. అతనికి ఏది ఒక పట్టాన నచ్చదు. ' పుర్రెకో బుద్ధి - జిహ్వకో రుచి ' - లోకో భిన్న రుచిః . ఒక మనిషికి రుచించినది ఇంకొకడికి రుచించదు ఇంకా చెప్పాలంటే కొన్ని సమయాలలో అసహ్యించుకుంటారు కూడా . . జగమెరిగిన సత్యమిది . ఇంపైన వాసనలను తన చుట్టూ ప్రసరింపజేసి అందరినీ ఆకర్షించే సంపెంగ వద్దకు తుమ్మెద చేరదట . సంపెంగ పుష్పాల మకరందాన్ని అది గ్రోలదట, కొందరికి - చెట్లు చిగురించి పూలు పూచే వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం అంటే ఇష్టం. మరికొందరికి - ఎండలు మెండుగా ఉండే గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం.అంటే మక్కువ. ఇంకొందరికి - వర్షాలు ఎక్కువుగా కురిసే వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. అంటే పిచ్చి. మిగిలిన కొందరికి - చెట్లు ఆకులు రాలే శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం అంటే మనసు. అందుకే - ఒక ఋతువులో మరో ఋతువును గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనల్ని పుట్టించిన అల్లాహ్కు మన మనస్తత్వం తెలుసు గనక - ఇస్లామీయ ఆరాధనలను ప్రకృతి అంట సహజంగా, వైవిధ్యంగా చేశాడు. ఆ విషయం ఇస్లామీయ ఆరాధనలు సునిశితంగా పరిశీలిస్తే యిట్టె అర్థమయి పోతుంది.
సూర్యుడు కాంతి మరియు వేడికి మూలం అయితే; అందులో ఒక పాఠం మరియు సంకేతం ఉంది. దాని అఖండ సృష్టి మహాద్భుతం. అయినా అది ప్రతి రోజు పరమ దయగల అల్లాహ్ కు సాష్టాంగపడుతుంది. ఆయన అనుమతితో తప్ప ఉదయించదు. ఆయన ఆయన లేనిదే అస్తమించదు కూడా. ఒక్క సూర్యమే కాదు సృష్టిలోని చరాచరాలన్నీ ఆలాహ్ సమక్షంలో - వాటికి శోభించే రీతిలో సాజిదా చేస్తాయి. ఇదే యదార్థాన్ని అల్లాహ్ ఇలా తెలియజేశాడు.
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ ముందు సాష్టాంగపడుతున్న విషయం నీవు గమనించలేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, అనేకమంది మానవులు, (దైవ)శిక్షకు అర్హులైపోయిన చాలా మంది మానవులు కూడా (సాష్టాంగపడుతున్నారు). అల్లాహ్ ఒక వ్యక్తిని నీచుడిగా, అల్పునిగా చేయదలచుకుంటే, ఇక అతడ్ని ఎవరూ గౌరవించరు.అల్లాహ్ తాను తలచిన పని తప్పకుండా చేస్తాడు. (హజ్: 18)
వారు అల్లాహ్ సృష్టించిన ఏ వస్తువునీ పరికించి చూడలేదా? ఆ వస్తువుల నీడలు కుడి ఎడమల వైపు పడుతూ అల్లాహ్ ముందు ఎలా సాష్టాంగపడుతున్నాయో గమనించరా? ఈవిధంగా సృష్టిలోని అణువణువూ (దేవునిపట్ల) తన వినమ్రత వ్యక్తపరుస్తోంది. భూమ్యాకాశాల్లోని సమస్త జీవకోటి, దైవదూతలు అల్లాహ్ ముందు వినమ్రులై తలవంచుతున్నారు. వారు ఎలాంటి అహంకారం చూపకుండా పైనున్న తమ ప్రభువుకు భయపడుతుంటారు; తమకు జారీచేసే ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. (నహల్ : 48-50)
సృష్టి సాంతం ఇంతలా అల్లాహ్ కు విధేయత చూపుతుంటే - సృష్టిశ్రేష్ఠుడయిన మానవుడు మాత్రం ఇష్టా రాజ్యంగా జీవితున్నాడు. అతని ఈ వైఖరిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తున్నాడు: ఓ మానవుడా! దయామయుడైన నీ ప్రభువుని గురించి నిన్నేవిషయం మోసంలో పడ వేసింది? ఆయన నిన్ను పుట్టించి, నీ అవయవాలు పొందికగా అమర్చాడు. నిన్ను తగిన విధంగా రూపొందించాడు. తాను తలచిన రీతిలో నిన్ను (అందంగా) మలిచాడు. (ఇన్ఫితార్: 6-8)
“ఏవిటీ, నిన్ను మట్టితో నీచమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? (అల్-కహఫ్: 37)
కొన్ని ముఖ్యమైన అంశాలు
1) వేసవిలో మగమారాజులు అర్థ నగ్నంగా ఉండటం మానుకోవాలి. పురుష పుంగవులు ఎందరో తమ తొడలు తెరిచి కూర్చుంటారు, ఇది ముమ్మాటికీ గర్హనీయం. పరదా మహిళకే కాదు మగవారికి కూడా ఉంటుందన్న యదార్థాన్ని గుర్తించాలి. అలాగే కొంత మంది మహిళలు, అమ్మాయిలు తమ ఇళ్లలోని మహ్రమ్ (పరాయి) పురుషుల ముందు ఛాతీపై దుపట్టా ధరించరు. ఇది కూడా ముమ్మాటికి సంస్కారానికి విరుద్ధమే!
2) ఫజ్ర్ ప్రార్థనను మిస్ చేయవద్దు: వేసవిలో రాత్రులు చిన్నవిగ, పగళ్లు పెద్దవిగా ఉంటాయి. నిద్ర సరిపోవడం లేదు అన్న సాకుతో ఫజ్ర్ నమాజును వేళకు చేయకపోవడం సమంజసం కాదు. అస్సలాతు ఖైరుమ్ మీనన్ నౌమ్ - హాయి నిద్ర కన్నా నమాజు గొప్పది అన్న ముఅజ్జిన్ పిలుపును మనం అల్లాహ్ ఇస్తున్న పిలుపుగా గ్రహించిన నాడు ఫజ్ర్ కోసం లేవడం చాల సులభమైపోతుంది.
3) ఎండా కాలంలో బయట ఎండలు మండిపోతున్నాయి అంటూ జుహర్ నమాజును వాయిదా వేసుకోవడమే, ఇంటి దగ్గరే చేసుకోవడమో చేస్తూ ఉంటారు. మరి కొందరయితే, ఇది ఎండ కాదు అల్లాహ్ శిక్ష అని నోరు జారుతుంటారు. ఇది తప్పు. ఎండా శిక్ష కాదు జీవకోటికి నిలువెత్తు రక్ష. అల్లహ్ ఏమంటున్నాడో కూడా కాస్త గమనించండి!
వెనుక ఉండిపోయినవారు, దైవ ప్రవక్త (సఅసం) వెళ్ళిన తరువాత, తాము ఆ విధంగా (ఇంట్లో) ఉండిపోయినందుకు సంబరపడ్డారు. అల్లాహ్ మార్గంలో తమ ధన ప్రాణాలొడ్డి పోరాడటం వారికి బొత్తిగా ఇష్టం లేదు. పైపెచ్చు "ఇంత తీవ్రమైన ఎండవేడిలో బయలుదేరకండి" అని అన్నారు. (ఓ ప్రవక్తా!) "నరకాగ్ని ఇంత కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది" అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు! (తౌబహ్: 81)
నరకాగ్ని తాపం ముందు ఈ వేసవి తాపం లెక్కలోకి రాదన్న సంగతిమనకు తెలిస్తే మనం ఎంతమాత్రం వెనుక ఉండేవారం కాదు. ప్రపంచంలోని ఈ వేడి నరకాగ్ని వేడిలో 70వ భాగం అని, ప్రపంచంలోని ఎండవేడికన్నా నరకాగ్ని వేడి 69 రెట్లు అధికంగా ఉంటుందని హదీసు ద్వారా తెలుస్తోంది (సహీహ్ బుఖారీ)
4) నీడ ఉన్న ప్రాంతాలను రక్షించండి, నీడనిచ్చే చెట్ల క్రింద మలమూత్ర విసర్జన చేయడం, చెత్తాచెదారం విసిరేయడం సబబు కాదు. పైగా మన ఈ చేష్ట వాళ్ళ అల్లాహ్ అభిశాపానికి గురవుతాము అన్న స్పృహ మనకుంది తీరాలి. ఎక్కువ మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పెంచి ప్రకృఏ పులకించేలా చేయాలి.
5) చెమట వాసనతో మసీదుకు వెళ్లవద్దు - ముస్లింలోని ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఉల్లి, వెల్లుల్లి తిన్నవారు మా మస్జిద్ దరిదాపులకు కూడా రారాదు. ఎందుకంటే మనుషులు వేటి మూలంగా ఇబ్బంది పడతారో దైవ దూతలు కూడా వాటి మూలంగా ఇబ్బంది పడతారు.
ఉల్లి, వెల్లుల్లి లాంటి దుర్వాసన కలిగిన వస్తువులు పచ్చిగా ఉన్నవాటిని నమాజ్కు ముందు మస్జిద్కు వెళ్ళేటప్పుడు తినరాదు. దానివల్ల తోటి నమాజీలకు, దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉల్లి, వెల్లుల్లి అసలు తిననేకూడదని దీని భావం ఎంతమాత్రం కాదు. దాదాపు ప్రతి కూరలోనూ వీటి అవసరం ఉంటుంది. పచ్చివి తిని వెళ్ళకూడదు. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏమిటంటే, హలాల్ అయిన ఉల్లి, వెల్లుల్లి వంటి కూరగాయలే తిని వెళ్ళకూడదు అంటే, ఆరోగ్యానికి హానికరమైన, క్యాన్సర్ కి కీలక కారణమైన ఖైనీ, పాన్ పరాగ్, బీడీ, సిగరెట్ తాగి, తిన్న తర్వాత వెళ్లడం ఎంత గర్హనీయమో ఒక్క సారి ఆలోచించండి!
6) చల్లటి నీరు త్రాపించండి, వీలైతే వాటర్ కూలర్ ఏర్పాటు చేయండి! మరింత సౌకర్యం, గల సంపన్నులు విరివిరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక్, మంచి నీటి బావులు త్రవ్వి సమాజానికి, సంఘానికి అంకితం చేయడాం ఎంతో హర్షణీయం.
7) పునరుత్థాన దినం యొక్క భయానక విషయాలను గుర్తుంచుకోవాలి. :
ఎండాకాలం వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రళయకాలపు భయానకతను గుర్తుంచుకోవాలి. ఈ రోజు సూర్యుడు వేల మైళ్ల దూరంలో ఉన్నాడు కానీ దాని వేడిని భరించలేనంతగా ఉంది కానీ యాభై వేల సంవత్సరాల సుదీర్ఘంగా ఉండే ఆ రోజు ఏమి జరుగుతుండో ఎప్పుడైనా ఆలోచించామా? సూర్యుడు ఒక మైలు దూరంలో వస్తాడు, నేల ఇనుము నేలగా మార్చివేయబడుతుంది అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో యోచించామా?
ఏ ఎండకు ఆ గొడుగు
పొద్దున్న వచ్చే ఎండ తూర్పు దిశనుండీ, మిట్టమధ్యాహ్నపు ఎండ నడినెత్తిమీద, సాయంకాలపు ఎండ పడమటిదిక్కునుండి తగులుతుంది కాబట్టి ఆయాసమయాలలో గొడుగును ఎటువైపు తిప్పిఉంచితే ఎండ తగలకుండా ఉంటుందో అటువైపు తిప్పిఉంచటాన్ని ఏ ఎండకు ఆ గొడుగు పట్టటమనే వాడుకను "" ఏ సందర్భానికి తగినట్లు ఆ విధంగా వ్యవహరించటం "" అనే అర్థం వచ్చేలా వాడటం వలన ఓ సామెత గా మారిపోయింది. ఇక రానురానూ, ఒకేమాట మీద నిలబడకుండా సందర్భానుసారంగా ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ స్వప్రయోజనాల కనుగుణంగా ప్రవర్తించే వైఖరిని సూచించటానికి ""ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం"" అనే వాడుక చిట్టచివరికి స్థిరపడిపోయింది.
తాపం అనేక రకాలు - కానక తాపం, కామ తాపం... ఇక వయసు వేడి వలపు వాడిని దాటుకుంటూ ఎక్కడి రావాలో అక్కడికి వచ్చేసాం. ‘ఎన్నికల వేడి’ అంటారు కదా. అది ఎన్నికలయ్యాక చల్లారిపోయింది.. మళ్లీ ఏవో ఎన్నికలు వచ్చే దాకా అంతా చల్లదనమే. పోలింగ్ పాలకుల తలరాత మార్చింది, . కొత్త వాళ్లు అధికారంలోకి వచ్చారు. అధిక శాతం . పాత వాళ్లే కొనసాతున్నారు. ఇకపై అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది.
చలి కాచుకునేందుకు మధ్య మధ్యలో మత కలహాలనీ, ప్రాంతీయ అభిమానం అనీ, జాతి అని, కులం అని, వర్గం అన, వర్ణం అని తగాదాల మంటలు రేపడమూ పరిపాటిగా జరిగిపోతూనేవుంటుంది. ఇస్లామీయ శాస్త్ర అధ్యయనం చేయకుండానే - ఇది చేసేయాలి, అది సరి చేసేయాలి అంటారు. మస్జీద్ లు ఇప్పటికీ తగులబడుతూనే ఉన్నాయి ... మూక హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో - 13 మూక హత్యలు చోటు చేసుకోగా, మరణించిన వారిలో 9 ముస్లింలు,1 క్రైస్తవ మహిళ, 3 దళితులూ, ఉన్నారు. ఇవే కాకుండా ఎన్నో మూక దాడులు, బుల్డోజర్లతో ఇల్లు కూలదోయటాలు జరిగాయి. జరుగుతున్నాయి.. మానవ చరిత్రలో మహామహులు మట్టిలో కలిసిపోయారు... స్వల్ప వ్యాధిలో అధికారంలో ఉండే ఈ నీచ రాజకీయనాయకులు ఎంత. వేసవి మంటలు ఆరిపోయినా -- ఈ పాపిష్టి రాజకీయ నాయకుల కడుపు మంటలు చల్లారడం లేదు. సమీప కాలంలో చల్లారేలా కనబడ్డం లేదు.
ఎవరి వేడి ఎలా ఉన్నా, సగటు పౌరుని పౌరుష తాపం చల్లబడకూడదు. కానీ దేశ పరిష్టితులు దీనికి పూర్తి భిన్నంగా అగుపడుతున్నాయి. ఓ కవి - మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు..అన్న మాటలు అక్షరసత్యాలుగా కనిపిస్తున్నాయి. చీమలకు చక్కెర.. పాములకు పాలు పోసి జీవకారుణ్యమే జీవితం అని చెప్పుకొంటూ పోజులిచ్చే మనుషులు.. తన కళ్లెదుటే మరొక మనిషిని హత్య చేస్తున్నా పట్టించుకోకుండా పక్కకు జారుకుంటున్నారు. ఎవరైనా కాకిని, పిల్లిని సతాయిస్తే - వీడియో తీసి కాకి పట్ల క్రూరంగా వ్యవహరించిన కఠిన హృదయుడు, పిల్లి పట్ల కర్కశంగా వ్యవహరించిన పాషాణ మనస్కుడు అని ట్యాగ్ చేసే జనం - రక్త మాంసాలున్న సాటి మనిషిని ముక్కలుముక్కలుగా నరుకుతున్నా ఎందుకు నోరెత్తడం లేదు, అడుగెత్తి అడుగేసి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు చూసినప్పుడు - కాకుల్లో ఉన్న స్పూర్తి మనుషుల్లో లేకపోయే అనిపిస్తోంది.
చివరిగా -
భారత దేశం అనే చెట్టు కొమ్మకు పూచిన పువ్వులం మనమందరం - అనురాగం మనదవ్వాలి.ఒక గూటిని వెలిగిన దివ్వెలం మనమందరం - మమకారం మన సొంతం అవ్వాలి. జగమంతా కుటుంబం మనది అన్నంత కాకపోయినా కనీసం భారత దేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న సద్భావం ఉంటేనే మన గతి సద్గతి కాగలదు. కాదు కుదరదు అంటే, పగ ప్రతీకారాలు, భాష, ప్రాంత, మత దురభిమానాల తాప తాకిడి మానవత్వం నిలువెత్తు నిప్పు కుంపటిగా మారడం తథ్యం. అల్లాహ్ అందరినీ రక్షించుగాక!
కాబట్టి - కత్తితో ఛేధించలేనిది..కరుణతో ఛేధించాలి / కక్షతో కాని పని..క్షమాబిక్షతో సాధించాలి / తెలిసి తెలియక కాలు జారితే / చెయూత నిచ్చి నిలపాలి
మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి / లోపాలు లేని వారు ఎవరో చూపండి !
వెళుతూ .. వెళుతూ ...
అర్థం కానీ మిస్టరీ అనుకునే జీవితాన్ని అర్థవంతమైన హిస్టరీగా ఎందుకు మలచుకోకూడదు? ఒక్క సారి ఆలోచించండి!
No comments:
Post a Comment