Saturday, August 24, 2024
ఖురాన్ బంధువు లక్షణాలు-Characteristics of the relative of the Qur'an
ఖురాన్ బంధువు లక్షణాలు
వారిలో సన్మార్గగాములు కూడా ఉన్నారు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ సూక్తులు పఠిస్తూ ఆయన ముందు సాష్టాంగ పడతారు. అల్లాహ్ ను , పరలోకాన్ని విశ్వసిస్తారు. ప్రజలకు మంచిని బోధిస్తారు. చెడుల నుండి వారిస్తారు. సత్కార్యాలు చేయడంలో పరస్పరం పోటీపడతారు. ఇలాంటివారే సజ్జనులు. వారు ఏ సత్కార్యం చేసినా దాన్ని విస్మరించడం జరగదు. దేవునికి భక్తిపరా యణులు ఎవరో బాగా తెలుసు. (ఆల్ ఇమ్రాన్: 113-115)
అనస్ బిన్ మాలిక్ కథనం దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు కొందరున్నారు. సహాబా అడిగారు - ఓ దైవ ప్రవక్తా ! వారెవరు ? ''వారు ఖుర్ ఆన్ వారు, వారే అల్లాహ్ కు చెందిన వారు మరియు ఆయనకు మిక్కిలి ఇష్టమైనవారు" అని దైవ ప్రవక్త (స) సమాధానమిచ్చారు . (ఇబ్ను మాజహ్)
ఖురాన్ బంధువు అని ఎవరిని అంటారు?
ఖురాన్ గ్రంథ పారాయణమే శ్వాసగా, దాని సాధనే జీవితంగా బతికే వ్యక్తి ఖురాన్ బంధువు అవుతాడు.ఆటను ఖురాన్ పారాయణాన్ని శ్వాసిస్తాడు,. జీవితంగా భావించి అది చూపిం అబాటనే పయనిస్తాడు. అతని ఆలోచన ఖుర్ఆన్ తో మొదలై ఖుర్ఆన్ తోనే ముగుస్తుంది. ఖుర్ఆన్ స్వర్ణకార ధుని ధ్వని - అతని స్వభావం, మాటలు, ప్రవర్తన, పరివర్తన, ఆలోచన, ఆచరణల ద్వారా వ్యక్తమవుతోంది. మహనీయ ముహమ్మద్ (స) వారి నడక, నడవడిక గురించి కొందరు హజ్రత్ ఆయిషా( ర.అ) గారిని ప్రశ్నించినప్పుడు - "కాన ఖులుఖుహు అల్ ఖుర్ఆన్" - "అయన నడవడి ఖుర్ఆన్ గ్రంథానికి ప్రతిబింబంగా ఉండేది" అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్)
ఖుర్ఆన్ తో మన సంబంధం ఎలా ఉండాలి?
దివ్య ఖుర్ఆన్ పారాయణం చేశాము. స్వయంగా పారాయణం చెయ్యడమే కాక, హాఫిజ్ లను నియమించి మరీ ఖర్ఆన్ పఠనాన్ని వీనుల విందుగా విన్నాము. తరావీహ్ నమాజ్ లో రోజూ దాదాపు గంట, గంటన్నర సేపు నిద్ర సుఖాన్ని నిష్కర్షగా త్రోసిపుచ్చి ఈ మహత్కార్యం కొరకే కేటాయించాము. రమజాన్ నెల సాంతం, సమయం దొరికినప్పుడల్లా పరమ పవిత్రమయిన ఆ ఉద్గ్రంథ పఠనం చేశాము. సకల లోకాలకు ప్రభువయిన అల్లాహ్ తన దాసులయిన మానవుల కోసం, తన ప్రేమకు ప్రతీకగా, తన ప్రీతిపథానికి ప్రమిదగా, మానవ హృదయ నిశీథికి ప్రత్యూషగా, మానవాంతర్య రుగ్మత నివారిణిగా, దివి నుండి దింపిన దివ్య ఔషది అది. ఆ పరమ దివ్య గ్రంధాన్ని మధుర మకరంద ధారలు జాలువారుతుండగా దివ్యంగా శ్రావ్యంగా గానం చేశాము. ఆ గ్రంధరాజాన్ని కాంతులు వెదజల్లే కళావై భవం తొణకిసలాడగా బంగరు సిరాతో వ్రాయించాము. ఆ మహాగ్రంథ పత్రాలను ప్రాణప్రదంగా, పవిత్రంగా, భక్తి ప్రపత్తులతో తల పైన మోశాము, కళ్ళ కద్దుకున్నాము, భద్రపరిచాము. దాని ఎడల గౌరవభావాన్ని, భయభక్తుల్ని, ప్రేమాదరణల్ని ఎన్ని విధాల వ్యక్తం చెయ్యాలో అన్ని విధాలా ప్రదర్శించాము. ఇంకేం చెయ్యాలి? అనొచ్చు చాలా మంది.
నిజమే, ఇదంతా చెయ్యవలసిందే. కాని మీరు విద్యార్థులయితే మీ పాఠ్యపుస్తకాలను ఇలాగే అర్థం చేసుకోకుండా 'పారాయణం' చేస్తారా? మీరు కొనే దిన, వార, మాసపత్రికల్ని ఇలాగే 'అనుసంధానం' చేసి భద్ర పరుస్తారా? మీకు మీ కార్యాలయాల నుండి అందే ఆదేశ పత్రాలను సువర్ణాక్షరాలతో వ్రాయించి మీ కుడ్యాలంకరణ కొరకు వినియోగించుకుంటారా? న్యాయస్థానం మీకు దండన విధిస్తూ తీర్పు ఇస్తున్నప్పుడు 'ఆహా! న్యాయమూర్తి కంఠం ఎంత కర్ణ పేయంగా ఉంది! ఎన్ని సంగీత సౌరభాలు విరజిమ్ముతోంది!!' అని సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలుతారా? మీరే చెప్పండి, ఖుర్ఆన్ పట్ల మన వైఖరిని ఎలా అభివర్ణించాలో !? . దివ్య ఖుర్ఆన్ మన స్వామి పంపిన సందేశం; మార్గదర్శక గ్రంథం; జీవన నియమావళి; ఆంక్షలూ అనుమతులున్న ప్రవర్తనా నిబంధనావళి; ఆర్థిక సూత్రావళి; శిక్షాస్మృతి; శాసన గ్రంథం; రాజ్యాంగ పత్రం. గుడ్డిగా పారాయణం చెయ్యడానికి బట్టీయం వెయ్యడానికి కాదు, నేత్ర కవాటాలను తెరచి, మనోచేతనను జాగృతం చేసి మనం అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి అరుదెంచిన ఫర్మానా అది. ఇహంలోనూ, పరంలోనూ మన మార్గం సుగమం చెయ్యడమే దాని పరమార్ధం. మనం ఆలోచించడానికి, అనుసరించడానికి సిద్ధంగా లేమా? "వీరు కుర్ఆనపట్ల చింతన చెయ్యలేదా, లేక వీరి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (ముహమ్మద్: 24) అంతేగా మరి, ఇలాంటి మహత్తర జ్ఞాననిధి ద్వారా ప్రాప్తమైన సూచనలను గురించి లోతుగా ఆలోచన, అనుశీలన జరపకపోతే హృదయాలకు తాళాలు పడినట్లే కదా అర్థం! (వెన్నెల తెరలు పుస్తకం నుండి పై రెండు పేరాలు)
ఖుర్ఆన్ మన నుండి ఏమి కోరుతుంది?
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : '' మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు . (అంతేకాదు ) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక,దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది " . (అల్ బఖర 121)
'' పఠించవలసిన విధంగా పఠిస్తారు " అన్న వాక్యానికి పలు అర్థాలున్నాయి.
* ఈ మహద్గ్రంథాన్ని బాగా చదువుతారు. శ్రద్ధతో ,ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్బంగా స్వర్గప్రస్తావన వస్తే స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్ ను వేడుకుంటారు . నరక ప్రస్తావన వస్తే దాని బారి నుంచి రక్క్షించమని ప్రార్థిస్తారు.
* ఈ గ్రంథరాజంలో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన అంశాలను ధర్మసమ్మతంగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మాంగానే భావిస్తారు. అంతేగాని (యూదుల మాదిరిగా ) ప్రక్షిప్తాలకు పాల్పడటంగానీ , తప్పుడు అన్వయింపులు చేయటం గానీ చేయరు .
* ఈ మాగ్నాకార్టాలో పొందుపరచబడివున్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు.
* ఈ అంతిమ గ్రంథంలో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని (ముహ్కామాత్ ను ) అమలు చేస్తారు, అస్పష్టంగా ఉన్న (ముతషాబిహాత్) విషయాలను విశ్వసిస్తారు, అర్థం కాని విషయాలను గురించి విద్వాంసులను అడిగి తెలుసుకుంటారు.
* ఈ అద్వితీయ గ్రంథంలోని ఒక్కో విషయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. అందలి ప్రతి విషయాన్నీ గుండెలకు హత్తుకొని, తన్మయం చెందుతూ, తాదాత్మయానికి లోనవుతారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు కన్నీరు మున్నీరవుతూ సజ్దాలో పడిపోతారు" . (మర్యం: 58) అల్లాహ్ వచనాలను విన్నప్పుడు భక్తితో కళ్ళు చెమర్చటం , విలపిస్తూ సజ్దాలో పడిపోవటం ఖుర్ఆన్ బంధువు ముఖ్య లక్షణం.
చూడండి, అల్లాహ్ ఏమంటున్నాడో:
" ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాల పై చింతన చేసేటందుకు , బుద్ధి జీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపునకు పంపాము" . (సూరా సాద్ :29)
" నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించినప్పుడు , అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు''. (అల్ అన్ ఫాల్ : 2)
" మరియు ఇది మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది". (అల్ అన్ ఆమ్ : 155)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment