Saturday, August 24, 2024
నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం - The ever-falling cloud of mercy is the Qur'an
నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం
దివ్య ఖుర్ఆన్ ఎడారి లాంటి జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే స్వచ్ఛమైన అద్వితీయ జలనిధి. స్వర్గ సౌధాల వైపునకు నిజ ఆరాధ్యుడు చూపే సవ్యమైన బాట. నిజ దైవానికి దాసుని మధ్య అవినాభావ, అవిభాజ్య బంధాన్ని బలపరిచే అల్లాహ్ త్రాడు దివ్య ఖుర్ఆన్. మరణానంతరం అమరత్వాన్ని, జీవించి ఉండగా అమృతత్వాన్ని ఆవిష్కరింపజేసే అక్షర సత్య జలధార దివ్య ఖుర్ఆన్. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే దిక్సూచి దివ్య ఖుర్ఆన్. బంధాలను, అనుబంధనాలను అద్భుతంగా మలిచే మహోధృత తరంగాల వాణి దివ్య ఖుర్ఆన్. మానవాళి మొత్తానికి జీవనాడి దివ్య ఖుర్ఆన్. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత దివ్య ఖుర్ఆన్. ఆదరిస్తే అద్భుత శిఖరాల మీద కూర్చో బెట్టే గ్రంథరాజం దివ్య ఖుర్ఆన్. సమాధిలోనూ, పరలోకంలోనూ మనకు కొండంత అండగా నిలిచి, మన పక్షాన వాదించి అల్లాహ్ ను ఒప్పించి మరీ మనకు కీర్తి కిరీటాలను తొడిగించే మధ్యవర్తిత్వ దూత దివ్య ఖుర్ఆన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథానుగ్రాహానికి మించిన వరం మరొకటి లేదు, రాదు.
”కరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్ నేర్పాడు”. (అర్రహ్మాన్:1,2)
సూరతుర్రహ్మాన్‌లో అల్లాహ్ తన అనుగ్రహాలెన్నినో పేర్కొన్నాడు. వాటన్నింటిలో అగ్ర స్థానం ఖుర్‌ఆన్‌కు ఇచ్చి, దానికి మించిన మహదాను గ్రహం మరోకటి లేదు అని స్పష్ట పర్చాడు. అంతే కాదు ఖుర్‌ఆన్ అవతరణను కారుణ్య ప్రభువయిన అల్లాహ్ తన కారుణ్యంగా, ప్రత్యేక బహుమానంగా పేర్కొన్నాడు: మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (యూనుస్: 57-58)
అందుకే అన్నింటికన్నా ముందు మనిషి ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవాలన్నది పండితుల మాట. ఎందుకంటే అది నిలువెత్తు కారుణ్య గ్రంథం గనక. స్వచ్ఛమయిన అల్లాహ్ వాక్కు గనక. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”. (అన్నహ్ల్: 89)
రహ్మత్ అర్థాలు:
పూర్తి ఖుర్‌ఆన్‌లో – ‘రహ్మత్’ అన్న పదం 268 సార్లు ప్రస్తావించబడింది. ఖుర్‌ఆన్ ప్రారంభమే ‘బిస్మల్లాహిర్రహ్మానిహ్రీమ్’ – అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్ పేరుతో అన్న వాక్యంతో మొదలువు తుంది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్ అల్లాహ్ గుణంగా పేర్కొన బడింది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్ స్వర్గం అన్న అర్థంలో వాడబడింది. ఖుర్‌ఆన్ లో రహ్మత్ దైవదౌత్య భావనలో పేర్కొన బడింది.రహ్మత్ వర్షం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్ దైవానుగ్రహం అన్న భావంలో వాడబడింది. రహ్మత్ ఉపాధి అన్న అర్థంలో వాడ బడింది. రహ్మత్ సహాయం, విజయం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్ శీలం అన్న భావంలో ఉపయోగించ బడింది. రహ్మత్ పుణ్యం అన్న అర్థంలో తీసుకో బడింది. రహ్మత్ దుఆ స్వీకరణ అన్న భావంలో చెప్ప బడింది. ఇంతటి కరుణామృతం నిండిన ఖుర్‌ఆన్ ఒక జాతికో, ప్రాంతానికో, భాషకో పరిమితం అయితే ఏంత అన్యాయం? కనుకనే అది సమసమ్త మానవుల పాలిట మార్గదర్శక గ్రంథం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్: 57)
ఖుర్‌ఆన్ సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి కానుకగా అవతరింపజేయ బడిన కారుణ్యం గనకనే ప్రతి ముస్లిం ఖుర్‌ఆన్ శ్వాసించేంతగా ప్రేమిస్తాడు. శ్వాసించడమా, ఖుర్‌ఆన్ పారాయణం చేయడమా? అన్న మీమాంస ఎదురయితే ఖుర్‌ఆన్ చదువుతూ శ్వాస వీడాలని కోరుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం తొలి శ్వాస ఖుర్‌ఆన్ తుది శ్వాస ఖుర్‌ఆన్. జీవితన కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య కాలం. కానీ ఒక ముస్లింకు మాత్రం ఖుర్‌ఆన్ ఆదేశాల నీడలో జీవించిన కాలం.
ఖుర్‌ఆన్ వల్ల ప్రాప్తించే కరుణ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) మాటల్లో:
”అల్లహ్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలోంచి గోప్యంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు ఎన్నిటికీ నష్టం వాటిల్లని వర్తకాన్ని ఆశిస్తున్నారు”. (ఫాతిర్: 29)
”ఖుర్‌ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్: 204)
”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం)
”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్ లామ్ మీవ్’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం”. (తిర్మిజీ)
ఓ సందర్భంలో ‘అల్లాహ్‌కు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్ అహ్మద్)
”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ)
”ఏ సమూహమయినా సరే అల్లాహ్ గృహాల్లోని ఓ గృహం (మస్జిద్)లో సమావేశమయి ఖుర్‌ఆన్ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంటారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్ వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం)
స్వయంగా హదీస్ ఖుద్సీలో అల్లాహ్ అన్న మాట - ”ఎవరినయితే ఖుర్‌ఆన్ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవసరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ)
”ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్ కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కాంతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. (ముస్నద్ అహ్మద్) సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’.
ఖుర్‌ఆన్ గురించి ప్రముఖుల అభిప్రాయం:
”ఖుర్‌ఆన్ అది అల్లాహ్ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధి. అది అల్లాహ్ మరియు ఆయన దాసుల మధ్య ఒప్పందం. అది శాశ్వత అల్లాహ్ శాసనం. అది సర్వకాల, సర్వావస్థలయందు పనికి వచ్చే ఆకాశ దస్తూరీ’ అన్నారు ఇబ్నుల్ ఖయ్యిమ్ (ర).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”అల్లాహ్ తనను ప్రేమించాలని ఎవరయితే కోరుకుంటున్నారో వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఒకవేళ అతను ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తుంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అభిమానించినట్లే. మరెవరయితే ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తారో వారిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) ప్రేమిస్తారు”. (తబ్రానీ)
కొన్ని సూరాల ప్రాశస్త్యం:
”ఓ సహాబీ ప్రవక్త (స) వారితో ఇలా అన్నాడు: ‘నేను ఈ సూరాను – ఖుల్ హువల్లాహు అహద్ – ఇష్ట పడుతున్నాను’. అది విన్న ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా దాని పట్ల నీ ప్రేమ నిన్ను స్వర్గంలో ప్రవేశింప జేస్తుంది”. (తిర్మిజీ)
”ఎవరయితే సూరతుల్ కహఫ్ ప్రారంభంలోని పది ఆయతులను కంఠంస్థం చెసుకుంటారో (వేరోక ఉల్లేఖనంలో చివరి పది ఆయతులను అని ఉంది) వారు దజ్జాల్ మహా ఉపద్రవం నుండి కాపాడ బడతారు”. (ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారి కథనం – ‘జిబ్రీల్ (అ) ప్రవక్త (స) వారి సన్నిధిలో కూర్చుని ఉండగా తన పై భాగం నుండి ఓ శబ్దాన్ని విని తలను పైకెత్తి ఇలా అన్నారు: ”ఇది ఆకాశ తలుపుల్లోని ఓ తలుపు. ఈ రోజు అది తెరవబడింది, ఈ రోజు తప్ప మునుపెన్నడూ దాన్ని తెరవడం జరుగ లేదు. దాని గుండా ఓ దైవదూత దిగి వచ్చాడు. అది చూసి అయన మళ్ళీ ఇలా అన్నారు: ”ఈ దైవ దూత ఈ రోజు తప్ప మునుపెన్నడూ అవనిపై కాలు మోపలేదు”. అలా వచ్చిన ఆ దైవదూత సలామ్ చేసి ఇలా అన్నాడు: ‘ఓ దైవప్రవక్తా! నేను మిమ్మల్ని రెండు జ్యోతులకు సంబంధించిన శుభవార్తను అందజేస్తున్నాను. వాటిని మీకు పూర్వం గతించిన ఏ ప్రవక్తకూ ప్రసాదించడం జరుగలేదు. ఒకటి ఖుర్‌ఆన్ మున్నుడి – ఫాతిహా సూరహ్.మరొకటి సూరతుల్ బఖరహ్ చివరి ఆయతులు. వాటిలో ఏ ఒక్క అక్షరాన్ని మీ పఠించినా అది మీకు ప్రసాదించ బడుతుంది”. (ముస్లిం)
గమనిక: నేడు ఇస్లాం సంబంధించిన ప్రతి దాన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో రుజు చేయాలనుకునే కొందరి స్వధర్మ అవగాహనా రాహిత్య వ్యాఖ్యానం ఖుర్‌ఆన్‌ను కూడా తాకుతూ ఉండటం మిక్కిలి విచారకరం! దాని వల్ల ఖుర్‌ఆన్‌కు ఎటువంటి హాని జరగక పోయినా, సామాన్య జనం మాత్రం మోసపోతున్నారు. అదే సూరతుల్ ఫాతిహాను వేదాలలో ఉన్నట్టుగా నమ్మ బలకడం. వారు అల్లాహ్‌కు భయ పడాలి. వారి ఈ వాదన నీతిని నిలబెడుతుందో, కూల దోస్తుందో ఆలోచించాలి. రేపు ప్రళయ దినాన ”ఏమిటి మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా?” (తౌబహ్: 65) అని అల్లాహ్ నిలదీస్తే ఏమని సమాధానమిస్తారో? ఒక్కసారి యేచించాలి. ఇది ముమ్మాటికి బసీరత్‌తో కూడిన ధర్మబోధ కాదు. ఇస్లాం సత్యతను, ఖుర్‌ఆన్ స్వఛ్చతను నిరూపించడానికి ఖుర్‌ఆన్ ఒక్కటే చాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఔత్సాహికులైన కొందరు యువకులు సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకొని ఏరుకున్న జ్ఞానంతో మహనీయుల జీవితాలను ఎగతాళి చేసుతున్నారు. వారి బురద బుద్ధులకు బోధ పడని ప్రవక్త (స) వారి హదీసులను తూర్పార బడుతున్నారు. అసలు దేని గురించి పూర్వాపరాలు తెలుసుకోకుండానే వాగుడుకాయలు తాము గొప్ప వాక్చాతుర్యం గలవారమని హూంకరిస్తున్నారు, అహంకరిస్తున్నారు. స్వతాహా తాము త్రోవ తప్పడమే కాక అనేమంది యువ రచయితలను, రచయిత్రిలను త్రోవ తప్పిస్తున్నారు. ఖుర్ఆన్ చేస్తున్న హెచ్చరికను వారు గమనించాలి!
మరికొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం, (జ్ఞాన)కాంతి ప్రసాదించే గ్రంథం లేకుండానే ప్రజలను పెడదారి పట్టించడానికి అల్లాహ్ విషయంలో గుండెలు విరుచుకొని మరీ వాదిస్తుంటారు. అలాంటివాడికి ప్రపంచంలో అవమానం, అప్రతిష్ఠలే మిగులుతాయి. ప్రళయదినాన మేమతనికి నరకాగ్ని యాతనలు చవిచూపిస్తాం. “ఇదే నీకోసం, నీ చేజేతులా సంపాదించి పంపుకున్నదాని ఫలితం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు” (అని అతనికి చెప్పబడుతుంది). (అల్-హజ్: 8-10)
అల్లాహ్ పేరు మీద ఏం మాట్లాడినా సత్యం, న్యాయమే మాట్లాడాలని దైవగ్రంథం గురించి వారి చేత ప్రమాణం చేయించ లేదా? వారు గ్రంథంలోని విషయాలు చదివి ఉన్నారు. (అయినా వితండవాదం చేస్తూ దేవుడు తమను క్షమిస్తాడని భ్రమపడుతున్నారు. కాని)అల్లాహ్ కు భయపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండేవారికే పరలోక (స్వర్గ) ధామం శోభిస్తుంది. ఆమాత్రం మీరు గ్రహించలేరా? (అల్-ఆరాఫ్: 169)
విశ్వాసులారా! మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు అల్లాహ్ ప్రవక్త ముందు బిగ్గరగా మాట్లాడకండి. (దీనివల్ల) మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు. అల్లాహ్ ప్రవక్త ఎదుట (వినయంతో) కంఠస్వరం తగ్గించి మాట్లాడేవారే నిజమైన దైవభీతిపరులు. భయభక్తుల కోసం అల్లహ్గ్ వారి హృదయాలు పరీక్షించి చూశాడు. వారికి మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. (అల్-హుజూరాత్: 2-3)
ఖుర్‌ఆన్ ఎవరి యెడల ఎలాంటి కరుణను కనబరుస్తుంది:
”ఓ ముహమ్మద్ (స)! మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరిమపజేసింది నువ్వు కష్టాల్లో పడటానికి కాదు”. (తాహా: 2)
లోతైన గొయ్యిలో పడి ఉన్న ఓ వ్యక్తి కొందరు కాపాడారు అంటే కారణం కరుణే. ఆ విషయానికొస్తే మనిషి పాలిట ఇహపరాల్లో ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. అది మనిషిని అంధ విశ్వాసాల భయంకర ఊబి నుండి కాపాడి సరైన మార్గం మీద నడిపించడమే కాకుండా, నడవడానికి కావాల్సినంత కాంతిని, దర్శకత్వాన్ని అందించి, ప్రభువు ప్రసన్నతను అనుగ్రహించి ఇహంలో విజేతగా, పరంలో సాఫల్యవంతునిగా చేసి నిలబెడుతుంది. ”అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి మరియు స్పష్టమయిన గ్రంథం వచ్చేసింది. దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతని అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అభీష్టం మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి వైపునకు తీసుకు వస్తాడు. రుజుమార్గం వైపునకు వారికి దర్శకత్వం వహిస్తాడు”. (మాయిదహ్: 15,16)
హృదయ కారుణ్యం ఖుర్‌ఆన్:
”దాన్ని విన్నప్పుడు తమ ప్రభువుకు భయ పడే ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇంకా వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం పట్ల మెత్త బడి పోతాయి ”. (అజ్జుమర్: 23)
కలకంఠి పాలిట కారుణ్యం ఖుర్‌ఆన్:
తరాల తరబడి స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆమెకు న్యాయంం జరిగేలా చూడటం కరుణ అయితే స్త్రీ పాలిట ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. మానవ చరిత్రలో స్త్రీ పుట్టుకకు శుభవార్త పేర్కొని, దాన్నో శాసనంగా ఖరారు చేసిన ఏకైక గ్రంథం ఖుర్ ఆన్. ”వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే…”. (నహ్ల్: 58) స్త్రీల హక్కులకు సంబంధించి 176 ఆయతులతో కూడి ఓ పూర్తి అధ్యాయయమే ‘నిసా’- మహిళలు ఖుర్‌ఆన్‌లో ఉంది. అంటే కాదు విశ్వాస జగత్తుకి ఆదర్శం స్త్రీలలో కూడా ఉంది అని ఘంటాపథంగా చెప్పిన ఉద్గ్రంథం ఖురాన్.
విశ్వాసుల విషయంలో అల్లాహ్ ఫిరౌన్‌భార్య గాధను దృష్టాంతంగా పేర్కొంటు న్నాడు. ఆమె (అల్లాహ్ ను ప్రార్థిస్తూ) “ప్రభూ! నాకోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహం నిర్మించు. నన్ను ఫిరౌన్ బారినుండి, అతని (దుష్ట)కర్మల (కీడు)నుండి కాపాడు. (ఈ) దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు” అని అన్నది. అలాగే అల్లాహ్ ఇమ్రాన్ కుమార్తె మర్యంని కూడా ఉదాహరణగా పేర్కొంటు న్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్న పరమ శీలవతి. మేము మావైపు నుండి ఆమె (గర్భం)లోకి ఒక ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు బోధనలను, ఆయన గ్రంథాలను విశ్వసించి, దైవవిధేయులలో చేరిపోయింది. (అత్-తహ్రీమ్: 11, 12) ఇలా చెప్పు కుంటూ పోతే ఖుర్‌ఆన్ కరుణ నోచుకోని జీవి ఈ జగాన లేదు.
చివరి మాట:
తొలకరి జల్లుతో మృత భూమి ఎలా సజీవమవుతుందో, అందులోని వృక్షాలు ఎలా చిగురిస్తాయో అలాగే ఖుర్‌ఆన్ కారుణ్య జల్లుతో మృత హృదయాలు జీవం పోసుకుంటాయి. అది జాతి జడత్వాన్ని జాడించి, చేవ కోల్పోయిన సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది. అదెలా అంటే రహ్మహ్ – కారుణ్యంతో పాటు ఖుర్‌ఆన్‌కు గల మరో పేరు రూహ్ – ఆత్మ.
నేడు ప్రపంచమంతా సమస్యల సుడిగుండంగా తయారయింది, మనిషి అలా తయారు చేసుకున్నాడు. ఈ వలయాన్ని ఛేదించి మానవ జాతులకు స్వేచ్ఛను, ముక్తిని ప్రసాదించే శక్తి గ్రంథ పరంగా ఒక్క ఖుర్‌ఆన్‌కు మాత్రమే ఉంది. నేడు ఖుర్‌ఆన్‌ను ఎంతగానో అభిమానించే ముస్లింలు, వ్యక్తులయినా, ప్రభుత్వాలయినా ఈ అనంత ‘కరుణా నిధి’ ద్వారా మానవాళికి కారుణ్యాన్ని పంచడంలో దాదాపు విఫలమయ్యారు అని చెప్పొచ్చు. నాటి ముస్లింలు ఖుర్‌ఆన్‌నే శ్వాసించి, ఖుర్‌ఆన్ నీడలోనే జీవించి ధన్యులయ్యారు. నేటి ముస్లింలు ఖుర్‌ఆన్‌ను విస్మరించి, మనోవాంఛలను అనుసరించి దీనులయ్యారు. ఫలితం వారి గతేమో సుగతి, వీరి గతి దుర్గతి.
ఒక్క మాటలో చెప్పాలంటే , ప్రపంచ వ్యాప్తంగా వినబడే నినాదాలుగానీ, కనబడే ఇజాలుగానీ మనిషి సమస్యను మరింత జఠిలం చేసినవే. మానవులకు ఎదురయిన ఉన్న సకల సమస్యలకు పరిష్కారంగా సర్వలోక ప్రభువయిన అల్లాహ్ ఖుర్‌ఆన్ గ్రంథాన్ని అవతరింప జేశాడు. ”అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయ పెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగాను వారి వెంట (ప్రవక్తల వెంట) సత్యబద్ధమయిన గ్రంథాలను పంపాడు”. (అల్ బఖరహ్: 213) అలా అల్లాహ్ అవతరిమపజేసిన గ్రంథాలలో అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్. కాబట్టి ఖుర్‌ఆన్‌ను మానవాళి సమస్యలకు పరిష్కారం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. చేస్తారని ఆశిస్తూ ....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment