Saturday, August 24, 2024

అన్యోన్య దాంపత్యానికి అమల సాధనాలు

అన్యోన్య దాంపత్యానికి అమల సాధనాలు ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (21) వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు భిన్నంగా ఉండే ఆ ఇరువురూ ఒకటై సుఖసంతోషాలతో జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. పనులను పంచుకుంటూ ప్రేమను పెంచుకోవాలి ఇంటి బాధ్యతలను పంచుకున్నట్లే ఇంటి పనులు కూడా నువ్వూ నేను సగం సగం అనుకుంటూ పూర్తి చేయాలి. మగవాడిని నేనెందుకు చేయాలి లేదా నాకు చేయడం రాదు అని తప్పించుకో కూడదు. చిన్నప్పుడు నేనీ పనులు నేర్చుకోలేదు అంటూ అమ్మాయిలు బద్దకించడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేస్తే తమకు ఎదుటివారి చేయూత లేదు, మొత్తం పనంతా నాపైనే అనే భావన ఇవతలి వారికి కలిగే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఇంట్లో సమానత్వానికి పెద్ద పీట వేయాలి. చిన్న పనిని కూడా పంచుకుంటూ చేస్తే చాలు. ఒకరిపై మరొకరికి మర్యాద, గౌరవం, ప్రేమ పెరిగి, ఇరువురి అనుబంధాన్ని మరింత పెంచుతాయి. ఓ కవి అన్నట్టు - ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరుమొకటై చేయికలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది.
ఓ సారి హజ్రత్ ఆయిషా (ర.అ)ను ప్రవక్త (స) వారిని గురించి ప్రశ్నించగా, ఆమె ఇలా వివరించారు: “ఆయన ఇంటి పనుల్లో 3 నిమగ్నులై ఉండేవారు. తన స్వహస్తాలతో చినిగిన దుస్తులకు అతుకులు వేసేవారు. ఇల్లు ఊడ్చేవారు. పాలు పితికేవారు. బజారు నుంచి సరకులు కొనుక్కువచ్చేవారు. చెప్పులు తెగితే స్వయంగా కుట్టుకునేవారు, నీరు తోడే బొక్కెనకు మరమ్మత్తు చేసేవారు. ఒంటెను తానే కట్టేసేవారు, దానికి మేత వేసేవారు. సేవకునితో కలసి పిండి కలిపేవారు". (సహీహ్ బుఖారీ) ఇంటి పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులను.. ఇరువైపులా పెద్దలను భార్యాభర్తలిద్దరూ అభిమానించాలి. తమ వారిని బాగా చూసుకుంటూ ఎదుటివారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండకూడదు. ఇలా చేస్తే అవతలివారు నొచ్చుకుంటారు. ఒక్కోసారి వారు వెంటనే దాన్ని పైకి చెప్పలేకపోవచ్చు. కానీ ప్రేమ క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. దాని ఫలితంగా పరస్పరం ఆసక్తి క్రమేపీ తగ్గుతుంది. నిజమైన ప్రేమ లేని చోట బంధం బలహీనపడుతుంది. ఇది మరిన్ని దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అలా కాకుండా ఇరువురూ జీవిత భాగస్వామి అమ్మా నాన్నలను కూడా సొంత వారిలానే ప్రేమించగలిగితే సమస్యలకు తావుండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా పెద్దవాళ్లను గౌరవిస్తూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటే వారి అనుభవాలే మనకు చక్కటి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఈ రోజు భార్యాభర్తలు - వారి వారి అత్తామామల్ని, వారి వారి ఆప్తుల్ని, సంబంధీకుల్ని గౌరవిస్తే, రేపు వారికి వారిని గౌరవించే అల్లుళ్లు, కోడళ్ళు వస్తారు. మన ఇళ్లల్లో పని చేసేవారు కూడా కొన్ని సమయాల్లో పెద్దవారి ఉంటారు - వారిని సైతం గౌరవించాలి. మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనకు (దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల సద్వర్తనంతో వ్యవహరించండి. బంధువులు, అనాథలు, నిరుపేదలతో మంచిగా మసలుకోండి. ఇరుగుపొరుగు బంధువులకు, పరిచయంలేని పొరుగువారికి, (మీ దైనందిన కార్యకలాపాలలో) తారసపడే మిత్రులకు, బాటసారులకు, మీ అధీనంలో వున్న బానిసలకు మేలు చేయండి. అల్లాహ్ అహంకారుల్ని, ప్రగల్భాలు పలికేవారిని ఎన్నటికీ ప్రేమించడు. (అన్-నిసా: 36) పరస్పరం దర్పణాలు దంపతులు ''ఒక విశ్వాసి మరో విశ్వాసి కోసం దర్పణం - అద్దం వంటి వాడు" అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్) అన్యోన్యత లేని చోట అనురాగం ఉండదు. అనురాగం లేని చోట ఆనందం అసలే ఉండదు. ‘దర్పణం’ అంటే.. అద్దం! అద్దంలో మన ప్రతిబింబం ఏ రీతిలో కనబడుతుందో, మనని మనం స్పష్టంగా ఎలా చూడగలమో, ఎలా చూస్తామో అలాగే దాంపత్య దర్పణంలో ఇతరులు కూడా స్పష్టంగానూ భార్యాభర్తల జీవితాలను, నడవడికను, వారి అన్యోన్యతను లేదా వారి కయ్యాలను, ప్రవర్తనలనుఅంటే స్పష్టంగా చూడగలుగుతారు. అడ్డం అబద్ధమాడదు, అన్యోన్య దాపత్యంలోనూ అబద్దాలు తావివ్వకూడదు. అద్దం మన రూపాన్నే, మనలోని అందాన్ని, వికారాన్ని మాత్రమే చూపుతుంది. కాబట్టి పరోక్ష నిందాఁకి పాల్పడకూడదు. అద్దం ముందున్నది మాత్రమే చొప్పిస్తోంది. కాబట్టి ఒకరి కూపీలు లాగటం, రంధ్రాన్వేషణ చేయడం మానుకోవాలి. అద్దం అనుమానించాడు, అవమానించదు. కాబట్టి పెనుభూతంగా మారే అనుమానానికి చోటివ్వకూడదు. అద్దం ముందు ఎవరు నిలబడినా, ధనికుడైనా -పేదవారైనా, అత్తయినా - కోడలయినా, మామయినా, అల్లుడయినా, ప్రజలైనా, ప్రముఖులైనా, మనిషైనా - మృగమైనా ఎవరైనా సరే, ఎవరికీ భయపడకుండా, నిర్భయంగా నిజాన్ని వ్యక్త పరురుస్తుంది కాబట్టి ఒక విశ్వాసి అద్దంలాగా మరొక విశ్వాసి పట్ల ధైర్యంగా ఉండాలి. ఏ వ్యక్తిత్వంచేనయినా ప్రభావితం కాకూడదు. భార్యాభర్తలు - ప్రతి ఒక్కరు వారికంటూ ఓ ప్రత్యేకమైన వెన్నుముక వ్యక్తిత్వం ఉండేలా చూసుకోవాలి. అద్దం మనం దాన్ని ఏదైనా అడిగినప్పుడే సమాధానం ఇస్తుంది. అనవసరంగా ఎవరి విషయంలోనూ తల దూర్చదు. భార్యాభర్తలు సయితం ఒండొకరి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని, అతి ఉత్సాహానికి పోయి అనర్థాల్ని కొని తెచ్చుకోకూడదు. భార్యాభర్తల అన్యోన్యతలూ తగవులూ ఎదుటివారికీ, చుట్టూ వున్నవారికి తప్పనిసరిగా టీవీ సీరియల్‌లా, సినిమా రీలుగా కనిపిస్తూనే వుంటాయి. దర్పణంలో మనని మనమే కాక ఇతరులను ఎలా చూస్తామో, ఎలా చూడగలుగుతామో, అలాగే బాహ్య దర్పణం నుండి ఇతరులూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. అందుకని దాంపత్యం అనేది మనకు మాత్రమే కాదు, చూపరులకీ ఆనందంగా, ఆదర్శంగా, ఆహ్లాదంగా అగుపించాలి. వింతగా, వెక్కిరించేలా, వెగటు కలిగించేలా అగుపించకూడదు. సర్దుకుపోతేనే సుఖం దాంపత్య జీవితంలో చిటపటలు, చిర్రుబురులు, చిలిపి తగాదాలు, సరససల్లాపాలు, సంసారంలో సరిగమలు లాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంగతులుంటాయి. వివాహంతో రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనసులు కూడా ఒక్కటవుతాయి. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా, సుఖం దుఃఖం కలిగినా పరస్పర సలహా సంప్రదింపులతో చక్కదిద్దుకోవాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొంటే బంధం బలపడుతుంది. ప్రతిఒక్క విషయం ప్రేమగా చర్చించుకోవాలి. కావాల్సిన సలహాలు, సూచనలు చెబుతూ ఉండాలి. అలాగే స్వీకరించాలి కూడా. అపుడే ఇద్దరిమధ్య ప్రేమ శాశ్వతం అవుతుంది. ఎలాంటి సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇంటి గుట్టును రట్టు చేయకూడదు బయటవారితో... కుటుంబ సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని దంపతులిద్దరే తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. బయటి వారితో చర్చించడం లేదా భాగస్వామి గురించి వారివద్ద చెడుగా మాట్లాడటం చేయకూడదు. మూడో వ్యక్తికి అవకాశం ఇస్తే, సమస్య అవతలివారి చేతిలోకి వెళ్లినట్లే. దాని గురించి మనకు అర్థమైనంతగా వారికి అర్థం కాకపోవచ్చు. ఒకసారి మనం అలా చర్చిస్తే, తిరిగి మళ్లీ ఎదురుచూడొచ్చు. ఇది మరో సమస్యను కొనితెచ్చుకున్నట్లే. ఇరువురూ కలిసి చర్చించుకుని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటే ఆ సమస్య మళ్లీ తలెత్తక పోవచ్చు. వచ్చినా.. దాన్నెలా తీర్చిదిద్దుకోవాలో అనుభవం నేర్పుతుంది. చివరి మాట సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. నిజానికి ఇదే అసలు సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంత పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య ఈ విధమైన అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరవైపోతోంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంలో గౌరవించాలి. ఎందుకంటే, ‘‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’’ (నిసా) అని దైవం ప్రబోధించాడు. భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రవచించారు: ‘‘తమ నడవడికతో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’’(తిర్మిజీ). ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహజీవితమే. స్వేచ్ఛగా ఉండే గృహజీవితంలోనే… మానసిక, నైతిక, ఆర్థిక సంబంధమైన ప్రతి అంశం ముందుకు వస్తుంది. కుటుంబం పట్ల ఔదార్యం, ప్రేమ, దయ కలిగి, కుటుంబానికి మానసిక తృప్తిని, ప్రశాంతతను కలిగిస్తూ ప్రేమాభిమానాలతో ప్రవర్తించినప్పుడే ఒక మనిషి విశ్వాసంలో పరిపూర్ణుడవుతాడు. ప్రతిమనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. స్త్రీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకని చిన్నచిన్న విషయాలను రాద్ధాంతం చేయకూడదు. భార్యలో ఏదైనా చిన్నాచితకా లోపం, బలహీనత కానవస్తే – దానికే మూతి ముడుచుకోకూడదు. ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి. చిన్నచిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో దాంపత్య సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకే ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే దైవం, దైవప్రవక్త హితవుల వెలుగులో జీవితం గడిపితే… ఇహంలో, పరంలో సాఫల్యవంత జీవితం పొందవచ్చు.

ఖురాన్ బంధువు లక్షణాలు-Characteristics of the relative of the Qur'an

ఖురాన్ బంధువు లక్షణాలు వారిలో సన్మార్గగాములు కూడా ఉన్నారు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ సూక్తులు పఠిస్తూ ఆయన ముందు సాష్టాంగ పడతారు. అల్లాహ్ ను , పరలోకాన్ని విశ్వసిస్తారు. ప్రజలకు మంచిని బోధిస్తారు. చెడుల నుండి వారిస్తారు. సత్కార్యాలు చేయడంలో పరస్పరం పోటీపడతారు. ఇలాంటివారే సజ్జనులు. వారు ఏ సత్కార్యం చేసినా దాన్ని విస్మరించడం జరగదు. దేవునికి భక్తిపరా యణులు ఎవరో బాగా తెలుసు. (ఆల్ ఇమ్రాన్: 113-115) అనస్ బిన్ మాలిక్ కథనం దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు కొందరున్నారు. సహాబా అడిగారు - ఓ దైవ ప్రవక్తా ! వారెవరు ? ''వారు ఖుర్ ఆన్ వారు, వారే అల్లాహ్ కు చెందిన వారు మరియు ఆయనకు మిక్కిలి ఇష్టమైనవారు" అని దైవ ప్రవక్త (స) సమాధానమిచ్చారు . (ఇబ్ను మాజహ్) ఖురాన్ బంధువు అని ఎవరిని అంటారు? ఖురాన్ గ్రంథ పారాయణమే శ్వాసగా, దాని సాధనే జీవితంగా బతికే వ్యక్తి ఖురాన్ బంధువు అవుతాడు.ఆటను ఖురాన్ పారాయణాన్ని శ్వాసిస్తాడు,. జీవితంగా భావించి అది చూపిం అబాటనే పయనిస్తాడు. అతని ఆలోచన ఖుర్ఆన్ తో మొదలై ఖుర్ఆన్ తోనే ముగుస్తుంది. ఖుర్ఆన్ స్వర్ణకార ధుని ధ్వని - అతని స్వభావం, మాటలు, ప్రవర్తన, పరివర్తన, ఆలోచన, ఆచరణల ద్వారా వ్యక్తమవుతోంది. మహనీయ ముహమ్మద్ (స) వారి నడక, నడవడిక గురించి కొందరు హజ్రత్ ఆయిషా( ర.అ) గారిని ప్రశ్నించినప్పుడు - "కాన ఖులుఖుహు అల్ ఖుర్ఆన్" - "అయన నడవడి ఖుర్ఆన్ గ్రంథానికి ప్రతిబింబంగా ఉండేది" అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్)
ఖుర్ఆన్ తో మన సంబంధం ఎలా ఉండాలి? దివ్య ఖుర్ఆన్ పారాయణం చేశాము. స్వయంగా పారాయణం చెయ్యడమే కాక, హాఫిజ్ లను నియమించి మరీ ఖర్ఆన్ పఠనాన్ని వీనుల విందుగా విన్నాము. తరావీహ్ నమాజ్ లో రోజూ దాదాపు గంట, గంటన్నర సేపు నిద్ర సుఖాన్ని నిష్కర్షగా త్రోసిపుచ్చి ఈ మహత్కార్యం కొరకే కేటాయించాము. రమజాన్ నెల సాంతం, సమయం దొరికినప్పుడల్లా పరమ పవిత్రమయిన ఆ ఉద్గ్రంథ పఠనం చేశాము. సకల లోకాలకు ప్రభువయిన అల్లాహ్ తన దాసులయిన మానవుల కోసం, తన ప్రేమకు ప్రతీకగా, తన ప్రీతిపథానికి ప్రమిదగా, మానవ హృదయ నిశీథికి ప్రత్యూషగా, మానవాంతర్య రుగ్మత నివారిణిగా, దివి నుండి దింపిన దివ్య ఔషది అది. ఆ పరమ దివ్య గ్రంధాన్ని మధుర మకరంద ధారలు జాలువారుతుండగా దివ్యంగా శ్రావ్యంగా గానం చేశాము. ఆ గ్రంధరాజాన్ని కాంతులు వెదజల్లే కళావై భవం తొణకిసలాడగా బంగరు సిరాతో వ్రాయించాము. ఆ మహాగ్రంథ పత్రాలను ప్రాణప్రదంగా, పవిత్రంగా, భక్తి ప్రపత్తులతో తల పైన మోశాము, కళ్ళ కద్దుకున్నాము, భద్రపరిచాము. దాని ఎడల గౌరవభావాన్ని, భయభక్తుల్ని, ప్రేమాదరణల్ని ఎన్ని విధాల వ్యక్తం చెయ్యాలో అన్ని విధాలా ప్రదర్శించాము. ఇంకేం చెయ్యాలి? అనొచ్చు చాలా మంది. నిజమే, ఇదంతా చెయ్యవలసిందే. కాని మీరు విద్యార్థులయితే మీ పాఠ్యపుస్తకాలను ఇలాగే అర్థం చేసుకోకుండా 'పారాయణం' చేస్తారా? మీరు కొనే దిన, వార, మాసపత్రికల్ని ఇలాగే 'అనుసంధానం' చేసి భద్ర పరుస్తారా? మీకు మీ కార్యాలయాల నుండి అందే ఆదేశ పత్రాలను సువర్ణాక్షరాలతో వ్రాయించి మీ కుడ్యాలంకరణ కొరకు వినియోగించుకుంటారా? న్యాయస్థానం మీకు దండన విధిస్తూ తీర్పు ఇస్తున్నప్పుడు 'ఆహా! న్యాయమూర్తి కంఠం ఎంత కర్ణ పేయంగా ఉంది! ఎన్ని సంగీత సౌరభాలు విరజిమ్ముతోంది!!' అని సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలుతారా? మీరే చెప్పండి, ఖుర్ఆన్ పట్ల మన వైఖరిని ఎలా అభివర్ణించాలో !? . దివ్య ఖుర్ఆన్ మన స్వామి పంపిన సందేశం; మార్గదర్శక గ్రంథం; జీవన నియమావళి; ఆంక్షలూ అనుమతులున్న ప్రవర్తనా నిబంధనావళి; ఆర్థిక సూత్రావళి; శిక్షాస్మృతి; శాసన గ్రంథం; రాజ్యాంగ పత్రం. గుడ్డిగా పారాయణం చెయ్యడానికి బట్టీయం వెయ్యడానికి కాదు, నేత్ర కవాటాలను తెరచి, మనోచేతనను జాగృతం చేసి మనం అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి అరుదెంచిన ఫర్మానా అది. ఇహంలోనూ, పరంలోనూ మన మార్గం సుగమం చెయ్యడమే దాని పరమార్ధం. మనం ఆలోచించడానికి, అనుసరించడానికి సిద్ధంగా లేమా? "వీరు కుర్ఆనపట్ల చింతన చెయ్యలేదా, లేక వీరి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (ముహమ్మద్: 24) అంతేగా మరి, ఇలాంటి మహత్తర జ్ఞాననిధి ద్వారా ప్రాప్తమైన సూచనలను గురించి లోతుగా ఆలోచన, అనుశీలన జరపకపోతే హృదయాలకు తాళాలు పడినట్లే కదా అర్థం! (వెన్నెల తెరలు పుస్తకం నుండి పై రెండు పేరాలు) ఖుర్ఆన్ మన నుండి ఏమి కోరుతుంది? అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : '' మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు . (అంతేకాదు ) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక,దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది " . (అల్ బఖర 121) '' పఠించవలసిన విధంగా పఠిస్తారు " అన్న వాక్యానికి పలు అర్థాలున్నాయి. * ఈ మహద్గ్రంథాన్ని బాగా చదువుతారు. శ్రద్ధతో ,ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్బంగా స్వర్గప్రస్తావన వస్తే స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్ ను వేడుకుంటారు . నరక ప్రస్తావన వస్తే దాని బారి నుంచి రక్క్షించమని ప్రార్థిస్తారు. * ఈ గ్రంథరాజంలో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన అంశాలను ధర్మసమ్మతంగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మాంగానే భావిస్తారు. అంతేగాని (యూదుల మాదిరిగా ) ప్రక్షిప్తాలకు పాల్పడటంగానీ , తప్పుడు అన్వయింపులు చేయటం గానీ చేయరు . * ఈ మాగ్నాకార్టాలో పొందుపరచబడివున్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు. * ఈ అంతిమ గ్రంథంలో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని (ముహ్కామాత్ ను ) అమలు చేస్తారు, అస్పష్టంగా ఉన్న (ముతషాబిహాత్) విషయాలను విశ్వసిస్తారు, అర్థం కాని విషయాలను గురించి విద్వాంసులను అడిగి తెలుసుకుంటారు. * ఈ అద్వితీయ గ్రంథంలోని ఒక్కో విషయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. అందలి ప్రతి విషయాన్నీ గుండెలకు హత్తుకొని, తన్మయం చెందుతూ, తాదాత్మయానికి లోనవుతారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు కన్నీరు మున్నీరవుతూ సజ్దాలో పడిపోతారు" . (మర్యం: 58) అల్లాహ్ వచనాలను విన్నప్పుడు భక్తితో కళ్ళు చెమర్చటం , విలపిస్తూ సజ్దాలో పడిపోవటం ఖుర్ఆన్ బంధువు ముఖ్య లక్షణం. చూడండి, అల్లాహ్ ఏమంటున్నాడో: " ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాల పై చింతన చేసేటందుకు , బుద్ధి జీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపునకు పంపాము" . (సూరా సాద్ :29) " నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించినప్పుడు , అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు''. (అల్ అన్ ఫాల్ : 2) " మరియు ఇది మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది". (అల్ అన్ ఆమ్ : 155)

దాంపత్య జీవితం - అనుమాన భూతం - Marital life - a ghost of doubt

దాంపత్య జీవితం - అనుమాన భూతం భూమి పైన చాలా అందమైన, స్వచ్ఛమైన బంధాలలో వివాహం ఒక్కటి. ఇది ఇద్దరి ఆత్మల యొక్క సంబంధం, వారు జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉంటానని వాగ్దానం చేస్తారు. దాంపత్య జీవితం -అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం. దాంపత్య జీవితం - అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం. కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. ఓ బంధం నిలవాలంటే దానికి పునాది నమ్మకమే.. నమ్మకం లేని చోట బంధం ఎన్నాళ్ళో నిలవదు. భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం, నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు ఖుర్‌ఆన్‌ వచనాల, ప్రవక్త (స) వారి ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను, స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ఓ పల్లెటూరి వ్యక్తి దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''యా రసూలల్లాహ్‌! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు నల్లన'' అని భార్య మీద తనకున్న అనుమానాన్ని వ్యక్త పర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ''రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?'' అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ''బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంద''ని సమాధానమిచ్చాడు. ''అదే విధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది'' అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం) హజత్ర్‌ ఆయిషా (ర) కథనం - ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ''నీకు తెలుసా! ముజజ్జిజ్‌ ముద్‌లజీ ఇప్పుడే జైద్‌ బిన్‌ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ''ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి'' అని అన్నారు (బుఖారీ, ముస్లిం) అంటే - ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది. పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన ముద్లిజ్‌ తెగకు చెందిన ముజజ్జిజ్‌ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త (స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్‌ జైద్‌ (ర) నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్‌ బిన్‌ హారిసా (ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని, దాని గురించి తెలియని ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. దంపతుల్లో అన్యోన్నత పెరగాలంటే 1) పెళ్లికి ముందు దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు కంటాం. ఇతరుల అనుభవాల ఆధారంగా ఏదేదో ఊహించుకుంటాం. దాంతో పెళ్లయ్యాక వాస్తవం ఊహకు ఏ కాస్త దగ్గరగా లేకపోయినా అసంతృప్తికి లోనవుతాం. 2) తక్కువ సమయంలో ఎక్కువ తెలుసుకోవాలనే తత్వం దాంపత్య జీవితంలో పనికి రాదు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుని మసలుకోవటానికి, ఒకరి అభిరుచులు మరొకరికి అర్థం అవ్వడానికి సమయం పడుతుంది. ఇదంతా నెమ్మదిగా జరిగే చర్య. 3) యాంత్రికంగా మసలుకోకుండా ఎదుటి వ్యక్తి సంతృప్తే ప్రధానంగా మసలుకోగలిగితే దంపతులిద్దరూ సమంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒకరి ఆనందం మీద మరొకరు దృష్టి పెడితే మనసులోని అర్థం లేని భయాలు పటాపంచలవుతాయి. ఆత్మవిశ్వాసంతో మెలగగలుగుతారు. ఫలితంగా మీ ప్రతి చర్యా జీవిత భాగస్వామి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. 4) ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లు అవుతున్న వారిలో పెద్ద చదువులు, ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ ఉంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇరువురికి ఆత్మభిమానం కాస్త ఎక్కువగా ఉండొచ్చు. అయినా భాగస్వామి పట్ల ఈగోలు పక్కనపెట్టాలి. దాంతో భాగస్వామి మనసులో స్థానం సంపాదించగలుగుతాం. 5) పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు ఇప్పుడున్నాయి. అయినా ఉన్న తక్కువ సమయంలోనైనా భార్యాభర్తలు ఒకరికోసం మరొకరు సమయాన్ని తప్పకుండా కేటాయించాలి. అప్పుడు వారి బంధం మీద నమ్మకం ఏర్పడుతుంది. నా కోసమంటూ ఓ వ్యక్తి ఉన్నారన్న భావన ఇరువురిలోనూ కలుగుతుంది. 6) ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రాన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అవి గొడవలుకు దారి తీస్తాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కోపంతో అరుస్తున్నా... మరొకరు సైలెంట్‌గా ఉండటం చాలా మంచిది. ఆ సమయంలో ఏం మాట్లాడినా కోపంగా ఉన్న వ్యక్తి మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. కొంత సమయం తీసుకుని, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే మంచిది. ఒక వేళ తప్పుగాని, పొరపాటుగాని జరిగి ఉంటే క్షమించమని అడగటంలో తప్పేమి లేదు. అలా కాదని తగ్గేదే లే అంటే మాత్రం తిప్పలు తప్పవు. 7) పెళ్లైన కొత్తలో దంపతుల మధ్య రహస్యాలు ఉండకూడదని గతంలో జరిగిన ప్రేమ వ్యవహరాలు చెప్పుకున్నా. వాటిని అక్కడితోనే మర్చిపోవాలి. వాటిని మనసులో ఉంచుకుని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించకూడదు. అదే విధంగా అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు. 8) ఎదుటి వ్యక్తి మీద ప్రేమని చూపించడంలో చిన్న చిన్న కానుకలు ఇస్తూ ఉండాలి. లేదా వారి మీద కవితలు లేదా లేఖలు రాయడం, పాటలు పాడటం చేయాలి. నచ్చిన కలర్‌తో దుస్తులు ధరించడం చేస్తూ ఉంటే భాగస్వామికి మరింత దగ్గరయ్యి భార్యభర్తల బంధం బలపడుతుంది. 9) దాంపత్యజీవితంపై ఎన్నో కలలు కంటుంటారు. తమ జీవితం అలా ఉండాలని ఇలా కావాలని ఆశ పడుతుంటారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయరు. అందరు చేసే తప్పులే చేస్తూ సంసారాన్ని కకావికలం చేసుకుంటారు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారం మాత్రం ఈదడం అంత సులువు కాదని తెలుస్తోంది. దాంపత్యం సవ్యంగా సాగాలంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, అభిమానం. వీటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. 10) పరస్పర గౌరవం: వివాహం జీవితంలో భార్యభర్తలు పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. ఒకరి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. పరస్పర ప్రశంసలు, అవగాహనను కలిగి ఉండాలి. ఇవే వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా చేయగలవు.

విశ్వాసి వజ్రాయుధం దుఆ - Believer's diamond weapon dua

విశ్వాసి వజ్రాయుధం దుఆ అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడు కష్టం, సుఖం, అదృష్టం, దురదృష్టం, మిత్రులు శత్రువులు, ఆరోగ్యం, అనారోగ్యం లాంటి సుఖదుఃఖాలెన్నింవిరినో సృష్టించాడు. మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాటికి గురవుతూనే ఉంటాడు. అయితే దేవుడు వాటితోపాటు వాటి నుండి రక్షణ పొందటానికి ఎన్నో పద్ధతులు, ముందు జాగ్రత్తలు కూడా సూచించాడు. వాటిని ఆచరించి మనిషి తన్ను తాను కష్టాల నుండి రక్షించుకోగలడు. మానవులు రోగాలను నయం చేసుకోవటానికి ప్రార్థనలను, మందులను కూడా దేవుడు పుట్టించాడు. అందుకే దైవప్రవక్త (స) ఒకానొక సందర్భంగా ''దేవుడు ప్రతి వ్యాధికీ చికిత్సను, ఔషధాలను పుట్టించాడు'' అని అన్నారు. (బుఖారీ) దుఆలను అల్ల్లాహ్‌ మాత్రమే ఆలకిస్తాడు వాస్తవానికి మానవుల్ని దుఃఖవిచారాలకు, కష్టాలు కడగండ్లకు గురి చేసేవాడూ, తిరిగి వాటి నుండి కాపాడి వారికి సౌఖ్యాన్నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే! సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. అయితే ఈ కష్టాలు, కడగండ్లకు గురైనప్పుడు తనను మొరపెట్టుకునే వారిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు. ఆ విధంగా మొరపెట్టుకోవటాన్నే 'దుఆ' అని అంటారు. ''బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని బాధను దూరం చేసేవాడు ఎవడు?'' (ఖుర్‌ఆన్‌- 27: 62)
పుట్టుక రీత్యా మనిషి అవసరాలు, అక్కరలు కలవాడు. సహజంగానే అతనికి అవసరాలు ఏర్పడుతుంటాయి. అల్లాహ్‌ా మాత్రమే సర్వ సంపన్నుడు, నిరపేక్షాపరుడు. ఆయన ఇలా అంటున్నాడు: ''మానవులారా! మీరందరూ అల్లాహ్‌ అవసరం కలవారే. కాని అల్లాహ్‌ మాత్రం సర్వ సంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు''. (ఖుర్‌ఆన్‌ - 35: 15) అల్ల్లాహ్‌ను తప్ప ఇతరులను ప్రార్థించరాదు మనిషి సహజంగా అవసరాలు కలవాడు అవడం చేత దుఆ తప్ప అతనికి గత్యంతరం లేదు. దుఆ మనిషికి నిత్యావసరం. మానవులు సాటి మానవుల్ని మొరపెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైన పని. స్వయంగా నిస్సహాయుడైన మానవుడు సాటి మానవుల నిస్సహాయతను దూరం చేయలేడు. అల్లాహ్‌ను వదలి పెట్టి ఇతర సజీవినిగాని, నిర్జీవినిగాని మొరపెట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనంటే అలా చేసేవాడు నీళ్ళ ముందు నిలబడి ''వచ్చెయ్యి! నా నోట్లోకి వచ్చెయ్యి'' అని నీళ్ళను పిలిచే మూర్ఖుడితో సమానం. (ఖుర్‌ఆన్‌ - 13: 14). విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్‌ను త్రోసిరాజని సజీవ లేక నిర్జీవ సృష్టిరాసుల్ని మొరపెట్టుకునేవారు ఎంత అవివేకులు?! కొందరయితే కదలలేని, మెదలలేని, కనులు విప్పి చూడలేని, పెదవి విప్పి పలకలేని రాళ్ళను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని వాటిని తమ కష్టాల గురించి మొర పెట్టుకుంటుంటారు. ఈ వైఖరి మరీ దారుణం! సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ ''నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను'' అని ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఆయన దాసులు ఆయన్ని వదలిపెట్టి ఇతర మిథ్యా దైవాల ముందు చేయి చాపటం ఎంత దిగజారుడుతనం?! ఒక ముస్లిం అలాంటి ఘాతుకానికి ఒడిగడితే అది ఇంకా శోచనీయమైన విషయం! 'దుఆ' కూడా ఒక ఆరాధన లాంటిది. ఆరాధనలన్నీ అల్లాహ్‌కే చెల్లుతాయి. అల్లాహ్‌ను వదలి ఇతరుల్ని మొరపెట్టుకోవటం, వారిని సహాయం చేయమని అర్థించటం, వారిని ఆపద మ్రొక్కువారిగా తలపోయటం ''షిర్కె జలీ'' (బహిరంగ బహుదైవారాధన) అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నటికీ క్షమించడు. విశ్వాసి చేతిలో 'దుఆ' ఆయుధం వంటిది. దాని ముందు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా పనికిరాకుండా పోతాయి. హృదయావేదనకు ఉపశమనం, బాధితులకు ఆధారం, భయాందోళనలకు గురయిన వారికి అభయ హస్తం దుఆ! బాధితుని శాపం సప్తాకాశాలనూ చీల్చుకుని వెళుతుంది బాధితుని నోటి నుండి వెలువడే దుఆ అంతరిక్షాన్ని, సప్తాకాశాలనూ చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది. దుఆ ఎన్నడూ త్రోసిపుచ్చబడదు! దాసుడు చేసే దుఆ ఎట్టి పరిస్థితిలోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దుఆ ఒక్కోసారి వెంటనే దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పి పోతాయి. లేదా ఆ దుఆ అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది. ఆత్మ ప్రక్షాళనకు తాళం చెవి ప్రార్థన – దుఆ. దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌కు దుఆ కన్నా మిక్కిలి ఇష్టమయిన వస్తువు మరేదీ లేదు”. (తిర్మిజీ) ఎందుకు దుఆకు మాత్రమే అగ్ర తాంబూలం అంటే, దుఆలో కృతజ్ఞత ఉంటుంది. దుఆలో ఉపకార భావం ఉంటుంది. దుఆలో వినయం ఉంటుంది, దుఆలో విధేయత ఉంటుంది. దుఆలో ఆర్థ్రత ఉంటుంది. దుఆలో అశక్తత ఉంటుంది. దుఆలో ఆశ ఉంటుంది. దుఆలో అంగీకారం ఉంటుంది. దుఆలో భయం ఉంటుంది. దుఆలో భక్తి ఉంటుంది. ప్రార్థన అంటేనే, దాస్య భావన పరాకాష్ట. అది దుఆలో పుష్కలంగా ఉంటుంది. అందుకే ”దుఆ పార్థనా సారాంశం” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ ) ”మేళ్ళన్నింటికీ తాళం చెవి దుఆ” అన్నారు ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మ). హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అంటుండేవారు: ”దుఆ స్వీకరించ బడుతుందా? లేదా? అన్న చింత నాకు లేదు. దుఆ చెయ్యాలన్న ఆలోచన మాత్రమే నాది. నాకు దుఆ చేసే సత్బుద్ధి కలిగిందంటే స్వీకరించబడుతుందన్న సంకేతం దానితోపాటే ఉంటుందన్నది నా బలమయిన నమ్మకం”. (తిర్మిజీ) దైవ ప్రవక్త (స) సదా ఈ దుఆ చేస్తూ ఉండేవారు: ”అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా అంత ఖైరు మన్‌ జక్కాహా” – ఓ అల్లాహ్‌! నా మనసుకి దానికి తఖ్వాను అనుగ్రహించు. దానిని పవిత్రం గావించు. ఆత్మకు పవిత్రను ప్రసాదించడం కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది. నీవే దాని రక్షకుడవు మరియు యజమానివి”. (ముస్లిం)

నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం - The ever-falling cloud of mercy is the Qur'an

నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం దివ్య ఖుర్ఆన్ ఎడారి లాంటి జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే స్వచ్ఛమైన అద్వితీయ జలనిధి. స్వర్గ సౌధాల వైపునకు నిజ ఆరాధ్యుడు చూపే సవ్యమైన బాట. నిజ దైవానికి దాసుని మధ్య అవినాభావ, అవిభాజ్య బంధాన్ని బలపరిచే అల్లాహ్ త్రాడు దివ్య ఖుర్ఆన్. మరణానంతరం అమరత్వాన్ని, జీవించి ఉండగా అమృతత్వాన్ని ఆవిష్కరింపజేసే అక్షర సత్య జలధార దివ్య ఖుర్ఆన్. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే దిక్సూచి దివ్య ఖుర్ఆన్. బంధాలను, అనుబంధనాలను అద్భుతంగా మలిచే మహోధృత తరంగాల వాణి దివ్య ఖుర్ఆన్. మానవాళి మొత్తానికి జీవనాడి దివ్య ఖుర్ఆన్. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత దివ్య ఖుర్ఆన్. ఆదరిస్తే అద్భుత శిఖరాల మీద కూర్చో బెట్టే గ్రంథరాజం దివ్య ఖుర్ఆన్. సమాధిలోనూ, పరలోకంలోనూ మనకు కొండంత అండగా నిలిచి, మన పక్షాన వాదించి అల్లాహ్ ను ఒప్పించి మరీ మనకు కీర్తి కిరీటాలను తొడిగించే మధ్యవర్తిత్వ దూత దివ్య ఖుర్ఆన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథానుగ్రాహానికి మించిన వరం మరొకటి లేదు, రాదు. ”కరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్‌ నేర్పాడు”. (అర్రహ్మాన్‌:1,2)
సూరతుర్రహ్మాన్‌లో అల్లాహ్‌ తన అనుగ్రహాలెన్నినో పేర్కొన్నాడు. వాటన్నింటిలో అగ్ర స్థానం ఖుర్‌ఆన్‌కు ఇచ్చి, దానికి మించిన మహదాను గ్రహం మరోకటి లేదు అని స్పష్ట పర్చాడు. అంతే కాదు ఖుర్‌ఆన్‌ అవతరణను కారుణ్య ప్రభువయిన అల్లాహ్‌ తన కారుణ్యంగా, ప్రత్యేక బహుమానంగా పేర్కొన్నాడు: మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (యూనుస్: 57-58) అందుకే అన్నింటికన్నా ముందు మనిషి ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవాలన్నది పండితుల మాట. ఎందుకంటే అది నిలువెత్తు కారుణ్య గ్రంథం గనక. స్వచ్ఛమయిన అల్లాహ్‌ వాక్కు గనక. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”. (అన్నహ్ల్‌: 89) రహ్మత్‌ అర్థాలు: పూర్తి ఖుర్‌ఆన్‌లో – ‘రహ్మత్‌’ అన్న పదం 268 సార్లు ప్రస్తావించబడింది. ఖుర్‌ఆన్‌ ప్రారంభమే ‘బిస్మల్లాహిర్రహ్మానిహ్రీమ్‌’ – అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ పేరుతో అన్న వాక్యంతో మొదలువు తుంది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ అల్లాహ్‌ గుణంగా పేర్కొన బడింది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ స్వర్గం అన్న అర్థంలో వాడబడింది. ఖుర్‌ఆన్‌ లో రహ్మత్‌ దైవదౌత్య భావనలో పేర్కొన బడింది.రహ్మత్‌ వర్షం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ దైవానుగ్రహం అన్న భావంలో వాడబడింది. రహ్మత్‌ ఉపాధి అన్న అర్థంలో వాడ బడింది. రహ్మత్‌ సహాయం, విజయం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ శీలం అన్న భావంలో ఉపయోగించ బడింది. రహ్మత్‌ పుణ్యం అన్న అర్థంలో తీసుకో బడింది. రహ్మత్‌ దుఆ స్వీకరణ అన్న భావంలో చెప్ప బడింది. ఇంతటి కరుణామృతం నిండిన ఖుర్‌ఆన్‌ ఒక జాతికో, ప్రాంతానికో, భాషకో పరిమితం అయితే ఏంత అన్యాయం? కనుకనే అది సమసమ్త మానవుల పాలిట మార్గదర్శక గ్రంథం. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57) ఖుర్‌ఆన్‌ సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి కానుకగా అవతరింపజేయ బడిన కారుణ్యం గనకనే ప్రతి ముస్లిం ఖుర్‌ఆన్‌ శ్వాసించేంతగా ప్రేమిస్తాడు. శ్వాసించడమా, ఖుర్‌ఆన్ పారాయణం చేయడమా? అన్న మీమాంస ఎదురయితే ఖుర్‌ఆన్‌ చదువుతూ శ్వాస వీడాలని కోరుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం తొలి శ్వాస ఖుర్‌ఆన్‌ తుది శ్వాస ఖుర్‌ఆన్‌. జీవితన కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య కాలం. కానీ ఒక ముస్లింకు మాత్రం ఖుర్‌ఆన్‌ ఆదేశాల నీడలో జీవించిన కాలం. ఖుర్‌ఆన్‌ వల్ల ప్రాప్తించే కరుణ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) మాటల్లో: ”అల్లహ్‌ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలోంచి గోప్యంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు ఎన్నిటికీ నష్టం వాటిల్లని వర్తకాన్ని ఆశిస్తున్నారు”. (ఫాతిర్‌: 29) ”ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్‌: 204) ”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం) ”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్‌ లామ్‌ మీవ్‌’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్‌ ఒక అక్షరం, లామ్‌ ఒక అక్షరం, మీమ్‌ ఒక అక్షరం”. (తిర్మిజీ) ఓ సందర్భంలో ‘అల్లాహ్‌కు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్‌ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌) ”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ) ”ఏ సమూహమయినా సరే అల్లాహ్‌ గృహాల్లోని ఓ గృహం (మస్జిద్‌)లో సమావేశమయి ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంటారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్‌ వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం) స్వయంగా హదీస్ ఖుద్సీలో అల్లాహ్ అన్న మాట - ”ఎవరినయితే ఖుర్‌ఆన్‌ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవసరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ) ”ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కాంతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. (ముస్నద్‌ అహ్మద్‌) సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’. ఖుర్‌ఆన్‌ గురించి ప్రముఖుల అభిప్రాయం: ”ఖుర్‌ఆన్‌ అది అల్లాహ్‌ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధి. అది అల్లాహ్‌ మరియు ఆయన దాసుల మధ్య ఒప్పందం. అది శాశ్వత అల్లాహ్‌ శాసనం. అది సర్వకాల, సర్వావస్థలయందు పనికి వచ్చే ఆకాశ దస్తూరీ’ అన్నారు ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర). హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”అల్లాహ్‌ తనను ప్రేమించాలని ఎవరయితే కోరుకుంటున్నారో వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఒకవేళ అతను ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తుంటే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను అభిమానించినట్లే. మరెవరయితే ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తారో వారిని అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) ప్రేమిస్తారు”. (తబ్రానీ) కొన్ని సూరాల ప్రాశస్త్యం: ”ఓ సహాబీ ప్రవక్త (స) వారితో ఇలా అన్నాడు: ‘నేను ఈ సూరాను – ఖుల్‌ హువల్లాహు అహద్‌ – ఇష్ట పడుతున్నాను’. అది విన్న ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా దాని పట్ల నీ ప్రేమ నిన్ను స్వర్గంలో ప్రవేశింప జేస్తుంది”. (తిర్మిజీ) ”ఎవరయితే సూరతుల్‌ కహఫ్‌ ప్రారంభంలోని పది ఆయతులను కంఠంస్థం చెసుకుంటారో (వేరోక ఉల్లేఖనంలో చివరి పది ఆయతులను అని ఉంది) వారు దజ్జాల్‌ మహా ఉపద్రవం నుండి కాపాడ బడతారు”. (ముస్లిం) హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం – ‘జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వారి సన్నిధిలో కూర్చుని ఉండగా తన పై భాగం నుండి ఓ శబ్దాన్ని విని తలను పైకెత్తి ఇలా అన్నారు: ”ఇది ఆకాశ తలుపుల్లోని ఓ తలుపు. ఈ రోజు అది తెరవబడింది, ఈ రోజు తప్ప మునుపెన్నడూ దాన్ని తెరవడం జరుగ లేదు. దాని గుండా ఓ దైవదూత దిగి వచ్చాడు. అది చూసి అయన మళ్ళీ ఇలా అన్నారు: ”ఈ దైవ దూత ఈ రోజు తప్ప మునుపెన్నడూ అవనిపై కాలు మోపలేదు”. అలా వచ్చిన ఆ దైవదూత సలామ్‌ చేసి ఇలా అన్నాడు: ‘ఓ దైవప్రవక్తా! నేను మిమ్మల్ని రెండు జ్యోతులకు సంబంధించిన శుభవార్తను అందజేస్తున్నాను. వాటిని మీకు పూర్వం గతించిన ఏ ప్రవక్తకూ ప్రసాదించడం జరుగలేదు. ఒకటి ఖుర్‌ఆన్‌ మున్నుడి – ఫాతిహా సూరహ్‌.మరొకటి సూరతుల్‌ బఖరహ్‌ చివరి ఆయతులు. వాటిలో ఏ ఒక్క అక్షరాన్ని మీ పఠించినా అది మీకు ప్రసాదించ బడుతుంది”. (ముస్లిం) గమనిక: నేడు ఇస్లాం సంబంధించిన ప్రతి దాన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో రుజు చేయాలనుకునే కొందరి స్వధర్మ అవగాహనా రాహిత్య వ్యాఖ్యానం ఖుర్‌ఆన్‌ను కూడా తాకుతూ ఉండటం మిక్కిలి విచారకరం! దాని వల్ల ఖుర్‌ఆన్‌కు ఎటువంటి హాని జరగక పోయినా, సామాన్య జనం మాత్రం మోసపోతున్నారు. అదే సూరతుల్‌ ఫాతిహాను వేదాలలో ఉన్నట్టుగా నమ్మ బలకడం. వారు అల్లాహ్‌కు భయ పడాలి. వారి ఈ వాదన నీతిని నిలబెడుతుందో, కూల దోస్తుందో ఆలోచించాలి. రేపు ప్రళయ దినాన ”ఏమిటి మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా?” (తౌబహ్‌: 65) అని అల్లాహ్‌ నిలదీస్తే ఏమని సమాధానమిస్తారో? ఒక్కసారి యేచించాలి. ఇది ముమ్మాటికి బసీరత్‌తో కూడిన ధర్మబోధ కాదు. ఇస్లాం సత్యతను, ఖుర్‌ఆన్‌ స్వఛ్చతను నిరూపించడానికి ఖుర్‌ఆన్‌ ఒక్కటే చాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఔత్సాహికులైన కొందరు యువకులు సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకొని ఏరుకున్న జ్ఞానంతో మహనీయుల జీవితాలను ఎగతాళి చేసుతున్నారు. వారి బురద బుద్ధులకు బోధ పడని ప్రవక్త (స) వారి హదీసులను తూర్పార బడుతున్నారు. అసలు దేని గురించి పూర్వాపరాలు తెలుసుకోకుండానే వాగుడుకాయలు తాము గొప్ప వాక్చాతుర్యం గలవారమని హూంకరిస్తున్నారు, అహంకరిస్తున్నారు. స్వతాహా తాము త్రోవ తప్పడమే కాక అనేమంది యువ రచయితలను, రచయిత్రిలను త్రోవ తప్పిస్తున్నారు. ఖుర్ఆన్ చేస్తున్న హెచ్చరికను వారు గమనించాలి! మరికొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం, (జ్ఞాన)కాంతి ప్రసాదించే గ్రంథం లేకుండానే ప్రజలను పెడదారి పట్టించడానికి అల్లాహ్ విషయంలో గుండెలు విరుచుకొని మరీ వాదిస్తుంటారు. అలాంటివాడికి ప్రపంచంలో అవమానం, అప్రతిష్ఠలే మిగులుతాయి. ప్రళయదినాన మేమతనికి నరకాగ్ని యాతనలు చవిచూపిస్తాం. “ఇదే నీకోసం, నీ చేజేతులా సంపాదించి పంపుకున్నదాని ఫలితం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు” (అని అతనికి చెప్పబడుతుంది). (అల్-హజ్: 8-10) అల్లాహ్ పేరు మీద ఏం మాట్లాడినా సత్యం, న్యాయమే మాట్లాడాలని దైవగ్రంథం గురించి వారి చేత ప్రమాణం చేయించ లేదా? వారు గ్రంథంలోని విషయాలు చదివి ఉన్నారు. (అయినా వితండవాదం చేస్తూ దేవుడు తమను క్షమిస్తాడని భ్రమపడుతున్నారు. కాని)అల్లాహ్ కు భయపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండేవారికే పరలోక (స్వర్గ) ధామం శోభిస్తుంది. ఆమాత్రం మీరు గ్రహించలేరా? (అల్-ఆరాఫ్: 169) విశ్వాసులారా! మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు అల్లాహ్ ప్రవక్త ముందు బిగ్గరగా మాట్లాడకండి. (దీనివల్ల) మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు. అల్లాహ్ ప్రవక్త ఎదుట (వినయంతో) కంఠస్వరం తగ్గించి మాట్లాడేవారే నిజమైన దైవభీతిపరులు. భయభక్తుల కోసం అల్లహ్గ్ వారి హృదయాలు పరీక్షించి చూశాడు. వారికి మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. (అల్-హుజూరాత్: 2-3) ఖుర్‌ఆన్‌ ఎవరి యెడల ఎలాంటి కరుణను కనబరుస్తుంది: ”ఓ ముహమ్మద్‌ (స)! మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరిమపజేసింది నువ్వు కష్టాల్లో పడటానికి కాదు”. (తాహా: 2) లోతైన గొయ్యిలో పడి ఉన్న ఓ వ్యక్తి కొందరు కాపాడారు అంటే కారణం కరుణే. ఆ విషయానికొస్తే మనిషి పాలిట ఇహపరాల్లో ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. అది మనిషిని అంధ విశ్వాసాల భయంకర ఊబి నుండి కాపాడి సరైన మార్గం మీద నడిపించడమే కాకుండా, నడవడానికి కావాల్సినంత కాంతిని, దర్శకత్వాన్ని అందించి, ప్రభువు ప్రసన్నతను అనుగ్రహించి ఇహంలో విజేతగా, పరంలో సాఫల్యవంతునిగా చేసి నిలబెడుతుంది. ”అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి మరియు స్పష్టమయిన గ్రంథం వచ్చేసింది. దాని ద్వారా అల్లాహ్‌ తన ప్రసన్నతని అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అభీష్టం మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి వైపునకు తీసుకు వస్తాడు. రుజుమార్గం వైపునకు వారికి దర్శకత్వం వహిస్తాడు”. (మాయిదహ్‌: 15,16) హృదయ కారుణ్యం ఖుర్‌ఆన్‌: ”దాన్ని విన్నప్పుడు తమ ప్రభువుకు భయ పడే ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇంకా వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం పట్ల మెత్త బడి పోతాయి ”. (అజ్జుమర్‌: 23) కలకంఠి పాలిట కారుణ్యం ఖుర్‌ఆన్‌: తరాల తరబడి స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆమెకు న్యాయంం జరిగేలా చూడటం కరుణ అయితే స్త్రీ పాలిట ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. మానవ చరిత్రలో స్త్రీ పుట్టుకకు శుభవార్త పేర్కొని, దాన్నో శాసనంగా ఖరారు చేసిన ఏకైక గ్రంథం ఖుర్‌ ఆన్‌. ”వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే…”. (నహ్ల్‌: 58) స్త్రీల హక్కులకు సంబంధించి 176 ఆయతులతో కూడి ఓ పూర్తి అధ్యాయయమే ‘నిసా’- మహిళలు ఖుర్‌ఆన్‌లో ఉంది. అంటే కాదు విశ్వాస జగత్తుకి ఆదర్శం స్త్రీలలో కూడా ఉంది అని ఘంటాపథంగా చెప్పిన ఉద్గ్రంథం ఖురాన్. విశ్వాసుల విషయంలో అల్లాహ్ ఫిరౌన్‌భార్య గాధను దృష్టాంతంగా పేర్కొంటు న్నాడు. ఆమె (అల్లాహ్ ను ప్రార్థిస్తూ) “ప్రభూ! నాకోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహం నిర్మించు. నన్ను ఫిరౌన్‌ బారినుండి, అతని (దుష్ట)కర్మల (కీడు)నుండి కాపాడు. (ఈ) దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు” అని అన్నది. అలాగే అల్లాహ్ ఇమ్రాన్‌ కుమార్తె మర్యంని కూడా ఉదాహరణగా పేర్కొంటు న్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్న పరమ శీలవతి. మేము మావైపు నుండి ఆమె (గర్భం)లోకి ఒక ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు బోధనలను, ఆయన గ్రంథాలను విశ్వసించి, దైవవిధేయులలో చేరిపోయింది. (అత్-తహ్రీమ్: 11, 12) ఇలా చెప్పు కుంటూ పోతే ఖుర్‌ఆన్‌ కరుణ నోచుకోని జీవి ఈ జగాన లేదు. చివరి మాట: తొలకరి జల్లుతో మృత భూమి ఎలా సజీవమవుతుందో, అందులోని వృక్షాలు ఎలా చిగురిస్తాయో అలాగే ఖుర్‌ఆన్‌ కారుణ్య జల్లుతో మృత హృదయాలు జీవం పోసుకుంటాయి. అది జాతి జడత్వాన్ని జాడించి, చేవ కోల్పోయిన సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది. అదెలా అంటే రహ్మహ్‌ – కారుణ్యంతో పాటు ఖుర్‌ఆన్‌కు గల మరో పేరు రూహ్‌ – ఆత్మ. నేడు ప్రపంచమంతా సమస్యల సుడిగుండంగా తయారయింది, మనిషి అలా తయారు చేసుకున్నాడు. ఈ వలయాన్ని ఛేదించి మానవ జాతులకు స్వేచ్ఛను, ముక్తిని ప్రసాదించే శక్తి గ్రంథ పరంగా ఒక్క ఖుర్‌ఆన్‌కు మాత్రమే ఉంది. నేడు ఖుర్‌ఆన్‌ను ఎంతగానో అభిమానించే ముస్లింలు, వ్యక్తులయినా, ప్రభుత్వాలయినా ఈ అనంత ‘కరుణా నిధి’ ద్వారా మానవాళికి కారుణ్యాన్ని పంచడంలో దాదాపు విఫలమయ్యారు అని చెప్పొచ్చు. నాటి ముస్లింలు ఖుర్‌ఆన్‌నే శ్వాసించి, ఖుర్‌ఆన్‌ నీడలోనే జీవించి ధన్యులయ్యారు. నేటి ముస్లింలు ఖుర్‌ఆన్‌ను విస్మరించి, మనోవాంఛలను అనుసరించి దీనులయ్యారు. ఫలితం వారి గతేమో సుగతి, వీరి గతి దుర్గతి. ఒక్క మాటలో చెప్పాలంటే , ప్రపంచ వ్యాప్తంగా వినబడే నినాదాలుగానీ, కనబడే ఇజాలుగానీ మనిషి సమస్యను మరింత జఠిలం చేసినవే. మానవులకు ఎదురయిన ఉన్న సకల సమస్యలకు పరిష్కారంగా సర్వలోక ప్రభువయిన అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అవతరింప జేశాడు. ”అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయ పెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగాను వారి వెంట (ప్రవక్తల వెంట) సత్యబద్ధమయిన గ్రంథాలను పంపాడు”. (అల్‌ బఖరహ్‌: 213) అలా అల్లాహ్‌ అవతరిమపజేసిన గ్రంథాలలో అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌. కాబట్టి ఖుర్‌ఆన్‌ను మానవాళి సమస్యలకు పరిష్కారం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. చేస్తారని ఆశిస్తూ ....

మన పాలు ఎవరి పాలవుతుందో?

నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు - విభిన్నమయిన వ్యక్తులు కలిసి కొంతకాలం ఉంటే, ఒకరి గుణాలు (మంచైనా,చెడైనా) మరొకరికి అలవడతాయి అని చెప్పటమే ఈ సామెత సారాంశము. ఎదుటి వ్యక్తి ఉప్పా? నిప్పా? తీపా? చేదా? అమృతమా? విషమా? అన్న దాన్ని బట్టి మనం స్నేహం ఫలించనైనా ఫలిస్తుంది. నిష్ఫలమైనా అవుతుంది. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒంటరితనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది. నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’ ‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా. మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది. ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..? చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు: (1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది. (2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది. (3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది. (4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.

ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటి? What good has Islam done to women?

స్త్రీ గొప్పదనం సృష్టి ప్రారంభమైన నాటినుంచి తన కన్నా బిడ్డల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ, తనవారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ఒకే ఒక్కరు " స్త్రీ". ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా ఒక అమ్మకు కొడుకే అందుకే చెప్పారు పెద్దలు అయితే పురుషాహంకార సమాజం కారణంగా మహిళలలు అనేక ఎదుర్కొంటున్నారు
మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు కొన్ని - 1. కనీస మానవ హక్కులను దూరం చేయడం: జీవించే హక్కు, మాట్లాడే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు మొదలైనవన్నీ వారికి దూరం చేయడం. 2. ప్రాథమిక హక్కులైన విద్య, ఆర్థిక స్వతంత్రత, సమానహోదా మొదలైనవన్నీ నిరాకరించడం. 3. మహిళలపై సమాజవైఖరి, గృహహింస, పనిచేసే దగ్గర లైంగిక, మానసిక హింస. 4. చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి, వారిని బయటకు రాకుండా చేసి, వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. 5. లింగ అసమానత అన్ని రంగాల్లో పాతుకుపోయింది. 6. నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యం లేకపోవడం. 7. మహిళను వివిధ భౌతిక హింసలకు గురిచేయడం పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో ఈ జఠిల సమస్యకు ఇస్లాం ఏమైనా తరుణోపాయం కాగలుగుతుందా తెలుసుకుందాం! ఇస్లాం మహిళకు చేసిన మేలేమిటో తేల్చుకుందాం!! మహిళల హక్కుల విషయంలో ఇస్లాం ఒక మేలిమి మలుపు ఇస్లాం - విశ్వ ప్రభువు తరఫు నుండి విశ్వ జనులందరి కోసం ఎన్నుకోబడిన విశ్వ జనీన ధర్మం. వర్ణ, వర్గ, రంగు, రూపు, భాషా, ప్రాంతం, ఆడ, మగ అన్న తేడా లేకుండా - అందరి హక్కును సమానంగా, న్యాయబద్ధంగా అంగీకరించే ధర్మం ఇస్లాం. వారి హక్కులకు పూర్తి పూచి పుచ్చుకునే ప్రకృతి సిద్ధ ధర్మం ఇస్లాం. ఇస్లాంలో స్త్రీలు - వారు పసి పిల్లలయినా, యవ్వనస్తులయినా, , కూతురు అయినా, భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, అమ్మమ్మ అయినా, నాన్నమ్మ అయినా - వారందరికీ ఎంతో గొప్ప స్థానం ఉంది. అనేక సందర్భాల్లో దైవ ప్రవక్త (స) మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని నొక్కి వక్కాణించారు: మీరు మహిళల యెడల మంచిగా వ్యవహరించండి. (బుఖారీ, ముస్లిం). ధర్మ ఆదేశాలు వర్తించే విషయంలో - ''నిశ్చయంగా స్త్రీలు పురుషుల తోబుట్టువులు" అన్నారు. (అబూ దావూద్) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, మహిళల సామాజిక మరియు ఆర్థిక హక్కులు మంజూరు చేయబడ్డాయి. ఇవి సుదీర్ఘ పోరాటాలతో, ప్రాం త్యాగాలతో, ధర్నాలతో, ఆమరణ నిరాహారదీక్షలతో సాధించున్నవి కాదు, ప్రక్రుతి సిద్ధంగా పడుతుల్ ప్రభువయిన అల్లాహ్ వారికి జన్మతః అనుగ్రహించిన జన్మహక్కులు. వాటికి పురుషుల మాదిరిగానే ఇస్లాంలో హామీ ఇవ్వబడింది. ఈ హామీ అనేది భద్రత, రక్షణ, న్యాయం మరియు స్థిరత్వం రీత్యా ఉన్నత ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. తొలి మానవుడయిన ప్రవక్త ఆదమ్ (అ) వారికి పూర్వం నుండే ఉన్న ఇస్లాం ధర్మం - 1,440 సంవత్సరాల క్రితం పరిపూర్ణమయింది. అది మహిళల హక్కులకు సంబంధించి చారిత్రాత్మకమైన మేలిమి మలుపు. అరేబియా ద్వీపకల్పం మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష, ఆడ శిశుహత్య, స్త్రీల ఆర్థిక మరియు సామాజిక హక్కులను స్వాహా చేసుకోవడం, బాలికలను బలవంతంగా వివాహం చేసుకోవడం వంటి మహిళలకు హాని కలిగించే దౌర్జన్యపూరిత ఆచారాలు అమల్లో ఉండేవి. ఈ వికృత విధానాలన్నింటి ఇస్లాం నిషేధించింది. అన్ని రకాల వైవాహిక అవమానాల నుండి మహిళలను కాపాడింది. ఇస్లాం మహిళల సంపాదన, ఆస్తిపాస్తుల్ని రక్షిస్తుంది. వాటిని ఎవరూ వారి నుండి లాక్కోలేరు. ఇస్లాం మహిళల వారసత్వపు హక్కును ఆమోదించింది. ఆమె కుటుంబ స్థితిని బట్టి వారసత్వపు వాటాను నిర్ణయించే ఒక దైవిక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది ఒక గొప్ప సాంస్కృతిక, సాంఘిక, ఆర్ధిక మార్పు. మహిళలకు వారసత్వ హక్కును ఇవ్వని సమాజాలకు ఇది ఓ కనువిప్పు. పూర్వం - స్త్రీ పురుషుని ఆస్తిలో భాగంగా, భర్త చనిపోతే వారసత్వపు సొత్తుగా భావించేవారు. ఇస్లామీయ వారసత్వ చట్టం నేటికీ అనేక పాశ్చాత్య న్యాయస్థానాలలో చట్టపరమైన దిక్సూచిగా ఉంది అనేది నిర్వివాదాంశం. ఇస్లాం వివాహితులు, విడాకులు పొందిన మరియు వితంతువుల స్త్రీలకు స్పష్టమైన, నిర్దిష్టమైన హక్కులను కేటాయిస్తుంది. మరియు భార్యకు తన భర్తపై ఉన్న హక్కులకు సమానమైన హక్కులను ఆమెకు ఇస్తుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒక మెట్టు ఆధిక్యత ఉంది. దేవుడు శక్తిమంతుడు, వివేచనాపరుడు. (అల్-బఖరహ్: 228) మహిళల యెడల మంచిగా వ్యవహరించండి. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; ఎవరైతే ఇద్దరు ఆడ పిల్లల పోషణా బాధ్యతను స్వీకరించి,వారు యవ్వన దశకు చేరుకునేంత వరకు వారి బాగోగులను చక్కగా గమనిస్తారో - వారు రేపు ప్రళయ దినాన వచ్చినప్పుడు - నేను మరియు వారు ఈ రెండు వ్రేళ్ళలా ఉంటారు అని ఆయన తాన్ రెండు వెళ్ళను కలిపి చూపించారు.(ముస్లిం) స్త్రీకి స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది ఇస్లాం స్త్రీలను తన స్వంత అస్తిత్వం మరియు స్వతంత్ర వ్యక్తిత్వం గల స్వేచ్చాయుత స్త్రీగా చూస్తుంది. ఆమె తన వంశం, కుటుంబ పేరుతోనే పిలువబడుతుంది. అనేక పాశ్చాత్య సమాజాలలో జరిగే విధంగా వివాహం తర్వాత తన ఇంటి పేరును మార్చుకోదు. మహిళలకు హక్కులున్నట్లే బాధ్యతలు కూడా ఉంటాయి. విధులు, బాధ్యతలు రూపేణా తప్ప స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎలాంటి ఉండదు. ఇస్లామీయ సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉంది సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర చాల కీలకం అన్న విషయాన్నిఇస్లాం గుర్తిస్తుంది. ఆమె సమాజ అభివృద్ధిలో పాలు పంచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ కర్తవ్య నిర్వహణలో ఎక్కడా ఆమె పురుషునితో విభేదించదు. పైగా ఒకరు మరొకరని బల పరుస్తారు, పూర్ణతను సాధిస్తారు. మహిళల కార్య పరిధి ప్రధానంగా పిల్లల ఆలనా పాలన, వారికి సుశిక్షణ ఇచ్చి సక్రమంగా పెంచడం కోసం ప్రత్యేకించబడింది. తద్వారా పిల్లలు సత్పౌరులుగా, సత్సమాజ నిర్మాతలుగా, భావి పౌరులుగా ఎదుగుతారు. సమాజ విచ్చిన్నానికి కాకుండా ఆదర్శ సమాజ నిర్మాణానికి బలమయిన పునాదులుగా రూపు దిద్దుకుంటారు. అయితే ముస్లిం మహిళలు సామాజిక మరియు రాజకీయ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించి, తనదైన బలమైన ముద్రనువేసే పూర్తి స్వేచ్ఛ, అధికారం వారికుంటుంది. దైవ ప్రవక్త (స) మహిళా శిక్షణార్థం, విద్యాబోధ నిమిత్తం ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించేవారు. మహిళలు సామూహిక నమాజు, ఈద్ నమాజు, ప్రమాణం, స్వఅభిప్రాయాన్ని తెలియజేయడం కోసం రావలసిందిగా ఆయన ప్రోత్సహించారు. స్వయంగా ప్రవక్త (స) ప్రాపంచిక విషయాలలో తన సహచరులతో సలహాసంప్రతింపులు జరిపినట్లే, తన సతీమణులు సలహాలు సయితం తీసుకోకునేవారు. అలాగే సంఘ ఇతర మహిళలు కూడా వారి వారి అవసరాలను ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి చెప్పుకునేవారు. అయన ఇచ్చిన సలహాలను, చూపిన పరిష్కారాలను అమలు పరచేవారు కూడా, ఎంతవరకంటే, ఒక సామాన్య బానిస మహిళ, పని మనిషి తన సమస్యను ప్రవక్త (స) వారి ముందర పెట్టడానికి భయ పడేది కాదు. సమాజాని సేవ, విద్య, నర్సింగ్, వైద్యం వంటి రంగాలలో ముందు తరాల సుశిక్షణ నిమిత్తం పని చేయాలని ఇస్లాం మహిళలను ప్రోత్సహిస్తుంది. అనేక సందర్భాల్లో, ప్రవక్త (స) స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించాలని తాకీదు చేశారు. పెరిగి పెద్దయ్యే వరకు ఆడపిల్లలను మంచిగా తర్ఫీదు ఇవ్వాలని, వారిని ఆదర్శ మహిళకు తీర్చిదిద్దాలని ఆయన అభిలషించారు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; ఎవరైతే ఆడపిల్లల విషయంలో పరీక్షకు గురి చేయబడి, ఓర్పు, నేర్పుతో వారిని చక్కగా పెంచి, వారు పెద్దయ్యే వరకు ధర్మమార్గంలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారో - వారికీ నరకాగ్ని నుండే కాపాడే కవచాలుగా ఆడ పిల్లలుంటారు> (బుఖారీ, ముస్లిం) ఆధునిక యుగంలో మహిళలు మరియు ఇస్లాం ఆధునిక యుగం మునుపటి చారిత్రక యుగాలకు భిన్నంగా వేగవంతమైన మార్పులను చూస్తోంది. మరి ఇస్లాం బోధనలు ప్రస్తుత మహిళల అవసరాలను తీరుస్తున్నాయా? ప్రపంచంలోని చాలా దేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న మూడు ప్రపంచ సమస్యలను మేము క్రింద ఇస్తున్నాము. ఇస్లాం వాటికి సమూల పరిష్కారాలను ఎలా చూ[పిందో క్లుప్తంగా అందిస్తున్నాము: 1 - స్త్రీ శరీరాన్ని దుర్వినియోగం చేయడం. 2 - వివాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు. 3 - గృహ హింస మరియు మహిళలపై వేధింపులు. 1) ఆడదాని శరీరం అంగడి సరుకు కాదు ఇస్లాం స్త్రీలను గౌరవించింది, శారీరక దుర్వినియోగం నుండి వారిని రక్షించింది. ఆమె దేహాన్ని విలాస వస్తువుగా చూడటాన్ని, ఆమెను వ్యభిచారం కుంపటిలోకి లాగడాన్ని, వారిని పురుషులకు ఎరగా వాడుకోవడాన్ని గర్హించింది, నిషేధించింది. అలాగే మగువ జీవితాన్ని నాశనం చేసే, ఆమె గౌరవానికి, ఆత్మాభిమానానికి భంగం కలిగించే నగ్నత్వాన్ని. అర్థ నగ్నత్వాన్ని, సంఘ నీతికి, నైతికతకు విరుద్ధమైన ప్రతి చర్య మరియు క్రియను ఇస్లారం నిషేధించింది. సిగ్గుమాలిన చేష్టల వల్ల ఆమె లైంగిక వేధింపులకు గురవ్వడమేకా, ఒక్కోసారి అపహరణకు, అత్యాచారానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. నేడు లైంగిక వ్యాపారం, వ్యభిచారంలో చిన్న వయసు గల ఆడపిల్లలు దించడం ద్వారా - అశ్లీల సాహిత్యం, బూతు సినిమాలు, నగ్న, అర్థ నగ్న చిత్రాల వెల్లువ అనేక సాంఘిక రుగ్మతలకు దారి తీసుతున్నది. ఫలితంగా - ప్రాణాంతక వ్యాధులు నేటి యుగాయానికి, రాబోయే తరానికి భయంకర శాపంగా మారనున్నాయి. ఆదం సంతానమా! మీరు మీ మర్మావయవాలను కప్పుకోవడానికి, మీ దేహానికి రక్షణగా, అలంకరణగా ఉపయోగపడటానికి మేము మీకు దుస్తులు ప్రసాదించాము. అయితే అన్నిటికంటే భయభక్తుల దుస్తులే ఎంతోశ్రేష్ఠమైనవి. ఇది (వస్త్రధారణ) దేవుని సూచనల్లో ఒక సూచన. మీరు విషయం గ్రహిస్తారని (ఇలా తెలుపుతున్నాం).” (అల్-ఆరాఫ్: 26) వ్యభిచారం దరిదాపులకు పోకండి. అది చాలా హేయమైనది, పరమచెడ్డదారి. (బనీ_ఇస్రాయీల్: 32) 2) వి వాహేతర సంబంధాలు మరియు ధర్మ విరుద్ధమైన పిల్లలు లేని సమాజం నేడు ప్రపంచ అనేక దేశాల్లో ఉన్నట్టు - స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాన్ని ఇస్లాం అనుమతించదు. ఒక పురుషుడు మరియు స్త్రీకి మధ్య లైగిక సంబంధం వివాహం అనే పవిత్ర పద్ధతిలోనే ఏర్పడాలి. ఇస్లాం చెప్పే ఈ సువర్ణ సూత్రం నేడు ప్రపంచంలో పెచ్చుమీరుతున్న అనేక సామాజిక, సాంసారిక, దాంపత్య సమస్యలకు చక్కటి పరిష్కారం. వాటిలో ముఖ్యమైనవి: మహమ్మారి రోగాల వ్యాప్తి, వంశ మూలాలను కోల్పోవడం, అక్రమ సంతానం అధికమవ్వడం, అసలు తల్లిదండ్రులెవరో కూడా తెలియని అనామక, ఆశ్రయరహిత సంతానం పెరిగిపోవడం. ఇస్లామీయ బోధనలు వంశ వృక్ష, పరంపర పరిరక్షణను, పిల్లలు వారి తండ్రులు మరియు తల్లులతో ఉండాలన్న ఖచ్చితమైన నియతిని కలిగి ఉంటాయి. గొప్ప విషయం ఏమిటంటే, ఇస్లాం ప్రజల సృష్టికర్త తరఫు నుండి అందజేయబడిన కుటుంబ చట్టాల ఆధారంగా ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఉనికిలోకి రావాలని అభిలషిస్తోంది. ఆ కుటుంబ వాతావరణం - స్త్రీలను గౌరవించేలా, వారి మనో భావాలను గుర్తించేలా, వారి ఆత్మాభినాన్ని రక్షించేలా, వారి హక్కులను కాపాడేలా ఉండాలని కోరుకుంటంది. అలాగే మహిళకు తన భర్తను ఎన్నుకునే స్వేచ్ఛ, హక్కు హామీని ఆమెకిస్తుంది. ఆమె గౌరవార్థం వివాహ సందర్భంగా మహర్ ను భర్తపై తప్పనిసరి చేసింది. ఇస్లాం, పురుషుడు తన కుటుంబం మరియు పిల్లల ఆర్థిక బాధ్యత స్వీకరించాలని కోరుతుంది. అనివార్య కారణాల వల్ల విడిపోయినప్పుడు లేదా విడాకులు తీసుకున్నప్పుడు, భరణం పొందే హక్కు స్త్రీకి ఉంటుంది అంటుంది. గడువు ముగిసే వరకు ఆమెకు సంబంధించిన కూడు, గూడు, గుడ్డ ఏర్పాటు పురుషునిపై తప్పనిసరి అని గట్టి తాకీదు చేస్తుంది. ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (అర్-రూమ్: 21) దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: “యువకుల్లారా! మీలో వివాహం చేసుకునే శక్తి కలవారు వివాహం చేసుకోవాలి. ఆ శక్తి లేనివారు ఉపవాసవ్రతం పాటించాలి. ఉపవాసం కామవాంఛను అదుపులో ఉంచుతుంది. శీలాన్ని రక్షిస్తుంది. చెడు దృష్టిని కాపాడుతుంది " (బుఖారి, ముస్లిం) ఆయన ఇంకా ఇలా అన్నారు: ఒక వ్యక్తి వ్యభిచారం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక వ్యక్తి దొంగతనం చేసేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక వ్యక్తి మద్యం త్రాగేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. (అంటే ఆ స్థితిలో విశ్వాసం అతన్నుండి వైదొలుగుతుంది). (బుఖారీ) 3) గృహ హింస మరియు మహిళలపై వేధింపులు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొనే మిక్కిలి విచారకర సమస్యల్లో గృహ హింస కూడా ఒకటి. స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని ఆఫ్రికన్ దేశాలు ప్రపంచంలో అత్యధిక గృహ హింస మరియు అత్యాచార నేరాలను నమోదు చేశాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, గృహ హింస సంఘటనల కారణంగా సంవత్సరానికి $100 మిలియన్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇందులో పనికి హాజరుకాకపోవడం మరియు అనారోగ్య సెలవులు ఉన్నాయి. హింస ఫలితంగా మొత్తం వైద్య ఖర్చులు సంవత్సరానికి సుమారు $5 బిలియన్లు చేరాయి. స్పెయిన్‌లో, మహిళలపై హింసాత్మక సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. 2017 గణాంకాల ప్రకారం మహిళలపై హింస సంబంధిత కేసులు 158,000 కంటే ఎక్కువ నమోదవదయ్యాయి. దీనికి భిన్నంగా - దాంపత్య సంబంధ బాంధవ్యం - ప్రేమ, దయ, పరోపకారం, త్యాగం, నిబద్ధత, పరస్పర గౌరవం అనే పునాదులపై నిర్మితమవ్వాలని ఇస్లాం ధర్మం పిలుపునిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: “మీరు స్త్రీల పట్ల మృదువుగా వ్యవహరించండి. స్త్రీలు ప్రక్కటెముకలతో సృజించబడ్డారు. ప్రక్కటెముకలలో కూడా అన్నిటికంటే ఎక్కువ వంకరగా ఉండే పైఎముకతో సృజించబడ్డారు. మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. ఒకవేళ దాని మానాన వదిలేస్తే అది అలా వంకరగానే ఉంటుంది. కనుక మీరు స్త్రీలతో మంచిగా (మృదువుగా) మసలు కోండి." (బుఖారి, ముస్లిం) భార్య ముఖమ్మీద కొట్టరాదని, శరీరం కందిపోయే వస్తువులతో కొట్టరాదని, నిర్దయగా కొట్టరాదని దైవప్రవక్త (సల్లం) అన్నారు. అలాంటి వారిని ఆయన అస్సలు ఇష్ట పడేవారు కాదు. పగలు గొడ్డులా బాది, రాత్రవగానే కామాంధుల్లా ప్రక్క చేరే బుద్ధి ఎలా కలుగుతుందయ్యా మీకు? అని పురుషాహంకారులను మందలించిన సందర్భాలు ఎన్నో. ఎవరికైనా ఇద్దరు భార్యలుండి, వారిద్దరి హక్కుల్ని న్యాయంగా, సమానంగా, సమంజసంగా నిర్వర్తించకపోతే, తీర్పుదినాన అతను సగం శరీరం కోల్పోతాడు. ఆ స్థితిలోనే (అర్థశరీరంతో సమాధినుండి) లేస్తాడు" అన్నారు దైవప్రవక్త (స). (తిర్మిజి) కుదరని ఓపక్షంలో - దంపతులిద్దరు దైవనిర్ణీత పరిమితులకు కట్టుబడి ఉండలేమని భయపడినప్పుడు స్త్రీ తన భర్తకు ఏమైనా ఇచ్చేసి అతని నుండి వేరుపడ దలచుకుంటే వారిద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదరడంలో తప్పు లేదు. (బఖరః - 229) మహిళకు సంబంధించి మహనీయ ముహమ్మద్ (స) చేసిన మహితోక్తులు జీవితానికి సంబంధించిన సకల విషయాలలో పరమ ఆదర్శప్రాయులు మహనీయ ముహమ్మద్ (స). అయన - మహిళల యెడల మంచిగా వ్యవహరించాలని ఆయన నొక్కి వక్కాణించారు. ముందు మీ అమ్మ ఒక వ్యక్తి దైవ ప్రవక్త పవిత్ర సన్నిధికి వచ్చి - ఇలా విన్నవించుకున్నాడు: ఓ దైవ ప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అత్యంత ఎక్కువ అర్హులు ఎవరు? దానికి: "నీ అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆ తర్వాత ఎవరు? అని మళ్ళీ అడగ్గా - "నీ తల్లి... అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆ పిదప ఎవరు? అని తిరిగి ప్రశ్నించగా - "నీ అమ్మ." అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). ఆనక ఎవరు? అని మళ్ళీ అడగ్గా ''నీ తండ్రీ" బదులిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం) మహనీయ ముహమ్మద్ (స) జీవిత కాలంలో ఎవ్వరినీ ఎప్పుడు కొట్ట లేదు. ఏ స్త్రీని కొట్టింది లేదు. ఏ సేవకుణ్ణి కొట్టింది లేదు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసేటప్పుడు తప్ప. అలాగే ఆయన్నుండి ఎవరికీ ఎలాంటి హాని, ఇబ్బంది కలిగింది లేదు. ఆయన ఎవరితోనూ ఎలాంటి ప్రతీకారం తన స్వయం కోసం తీర్చుకుంది లేదు. అల్లాహ్ నిషేధితాలకు ఆ వ్యక్తి పాల్పడి ఉంటె తప్ప, అలాంటి స్థితిలో ఆయన అల్లాహ్ కోసం ఆ వ్యక్తికి దండన విధించేవారు. (ముస్లిం) ముహమ్మద్ (స) ఒక భర్తగా బాధ్యతాపరులైన గొప్ప నిజాయితీపరులు. వివాహం చేసుకోవాల్సిందిగా, ఉత్తమ కుటుంబాన్ని స్థాపించాల్సిందిగా, సంతానాన్ని - ఆడ మగ అనే వివక్ష చూపకుండా సత్పౌరులుగా తీర్చి దిద్దాల్సిందిగా ఆయన (స) యువకుల్ని ప్రోత్సహించేవారు. మహనీయ ముహమ్మద్ (స) - విద్య నేర్చుకోవాల్సిందిగా, పండుగ నమాజు వంటి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా ఆయన మహిళల్ని ప్రోత్సహించేవారు. అలాగే పురుషులు వారి బాధ్యతలను నిర్వర్తించినట్లే, స్త్రీలు - వారి బాధ్యతలను సజావుగా నెరవేర్చాలి అని హితవు పలికేవారు. ఇస్లాంలో మహిళలు కూడా అల్లాహ్ సమక్షంలో వారికి సంబంధించిన బాధ్యతల గురించి ప్రశ్నించబడతారు. వనితలు ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా - సాంఘిక, సాంసారికి బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడే వారు అన్ని రకాల అపమార్గాల నుండి, అపసవ్యతల నుండి, పొరపాట్ల నుండి కాపాడబడతారు. ఫలితంగా ఓ సత్సమాజం నిర్మాణంలో ఆమె బలమైన ముద్రను వేస్తుంది. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ప్రవర్తన రీత్యా ఉత్తములైన వారే విశ్వాసం రీత్యా పరిపూర్ణులు. మీ మహిళల యెడల ఉత్తములైన వారే మీలో పురుషోత్తములు. (తిర్మిజీ) దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నేను మరియు ఓ అనాథ పోషణ బాధ్యతను తీసుకున్న వ్యక్తి స్వర్గం ఇలా తోడుగా ఉంటాము - అని ఆయన తన చూపుడు వ్రేలుని, మధ్య వ్రేలుని కాస్త ఎడంగా ఉంచి చూపించారు. (బుఖారి) దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ యెడల తఖ్వా కలిగి జీవించు. నీ వల్ల ఒక తప్పు జరిగితే వెనువెంటనే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టు. ప్రజలతో మంచిగా మసలుకో. (తిర్మిజీ) చిరు విన్నపం! నేటి ముస్లిం మహిళ ఓ నగ్నసత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. భావితరం భవితవ్యం ఆమె చేతుల్లోనే ఉంది. ఆ చేతులతో ఒకసారి గీచిన 'గీతలు' అవి ధర్మానికి సంబంధించినవయినా, అధర్మానికి సంబంధించినవయినా సరే సమాధికి చేరేదాకా చెరిగి పోవు. ఆమె తన శిక్షణా సాధనంతో చరిత్ర దిశ, దశనే మార్చగలుగుతుంది. ఆ దిశ దైవానికైనా లేదా దుష్టశక్తికైనా అనుకూలమైనది కావచ్చు. ముస్లిం మహిళలు స్వయంగా ఇమామ్ హుసైన్ (రజి), ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై), ముహమ్మద్ బిన్ ఖాసిం, సలాహుద్దీన్ అయ్యూబి, ఇమామ్ గజాలి, ఇబ్నె తైమియా లాంటి మహనీయులు కాకపోవచ్చు. కాని అలాంటి మహనీయుల్ని తయారు చేయగల శక్తి స్వరూపిణులు అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. ముస్లిం మహిళ ముందుకొచ్చి ఇలాంటి "కింగ్మేకర్" పాత్ర వహించగలిగితే అత్యున్నత మానవీయ విలువలు, అసామాన్య నైతిక ప్రమాణాలతో భాసిల్లే నవతరాన్ని తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి ఒక్కటే షరతు. ఆమె ఖతీజా (రజి), ఫాతిమా (రజి), ఆయిషా (రజి), జైనబ్ (రజి)లను తన హీరోయిన్ లుగా, ఆదర్శప్రాయులుగా స్వీకరించాలి.